శాస్త్రీయతలేని విధానాలతోనే విపత్తులు | Sakshi Guest Column: Disasters caused by unscientific methods | Sakshi
Sakshi News home page

శాస్త్రీయతలేని విధానాలతోనే విపత్తులు

Sep 3 2026 12:41 AM | Updated on Sep 3 2026 12:41 AM

Sakshi Guest Column: Disasters caused by unscientific methods

విశ్లేషణ

హిమాలయాలు ఒకదాని తర్వాత ఒకటిగా హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాయి. ఆకస్మిక వరదలు, హిమ పాతాలు, హిమానీనద సరస్సులకు గండి పడటంతో ముంచెత్తుతున్న వరదలు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, తీవ్రంగా భూమి కుంగిపోవడం వంటివి వాటి కోవలోకి వస్తాయి. కేదార్‌నాథ్, ధౌళిగంగ, జోషీమఠ్, సిక్కిం, ఇపుడు నేపాల్‌లోకి సరిహద్దులు దాటి వచ్చిన వరదలు అలాంటివే. అటువంటి ప్రతి ఉత్పాతంలోనూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అపారమైన విధ్వంసం కనుల ఎదుట నిలుస్తోంది. హిమాలయాలలో సంభవిస్తున్న విపత్తులను ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. శాస్త్రీయ పరిశోధనలు సాగించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే యంత్రాంగాలను తయారు చేసుకోవడం, ప్రజా చైతన్యం తీసుకు రావడం, సమాజాలను కూడా ఈ కృషిలో భాగస్వాములుగా చేయడం వంటివి చేపట్టక తప్పదు. 

నివేదికలు వెల్లడిస్తున్న వాస్తవాలు
వాతావరణ మార్పుపై ఏర్పడిన వివిధ ప్రభుత్వాల ప్యానెల్‌ అంతర్జాతీయ స్థాయిలో వివిధ నివేదికలను ప్రచురించింది. గ్లేసియర్లు, పర్వత ప్రాంతాలలోని జీవావరణ వ్యవస్థల గురించి వివిధ దేశాలు వాటి పరిశోధనల్లో కనుగొన్న అంశాలకు ఒక సమగ్ర రూపం ఇచ్చింది. మన దేశంలోనూ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఇమేజరీని ఉపయోగించి (మొత్తం 28,000లలో) 7,500లకు పైగా గ్లేసియల్‌ సరస్సుల మ్యాప్‌ను రూపొందించింది. హై–రిస్క్‌ గ్లేసియల్‌ సరస్సులకు సంబంధించి అది వరద ముప్పుల మ్యాప్‌ను కూడా తయారు చేసింది. ఐసు గడ్డలు, బండరాళ్ళు కట్టలుగా ఉన్న సరస్సులు ఒక్కసారి తెగిపడితే రాగల వరదలు, వాటివల్ల దిగువ పరీవాహక ప్రాంతాల్లోనున్న జనావాసాలకు వాటిల్లగల నష్టాల గురించి కూడా అది తెలియజేసింది. కాఠ్‌మాండూకు చెందిన ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటెగ్రే టెడ్‌ మౌంటైన్‌ డెవలప్‌మెంట్‌(ఐసీఐఎంఓడీ) మొన్నీమధ్య అంటే 2026 మార్చిలో కూడా రెండు గణనీయమైన నివేదికలను ప్రచురించింది. వాటిలో ఒకటి హిందూ కుష్‌ హిమాలయ ప్రాంతంలో 1990 నుంచి 2020ల వరకు మారుతున్న గ్లేసియర్ల గతిశీలతలను వివరించింది. మరోటి 2026 నాటికి ఉన్న హిందూ కుష్‌ హిమాలయ గ్లేసి యర్ల స్థూల స్వరూప స్వభావాలను వెల్లడించింది. 

ఈ నివేదికలు వెల్లడిస్తున్న అంశాలు ఆందోళన రేపేవిగా ఉన్నాయి. మొదటి నివేదిక 55 వేలకు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ కుష్‌ ప్రాంతమంతటానున్న 63,761 గ్లేసియర్ల డేటాను ఆధారం చేసుకుని రూపొందింది. వాటిలో 5,700 క్యూబిక్‌ కిలోమీటర్ల మేర ఐసు నిల్వలున్నాయి. నలుచెరగులా ఉన్న ఈ గ్లేసి యర్లు 1990ల ఆరంభం నుంచి స్థిరంగా కరిగిపోతూ వస్తున్నా యని ఆ విశ్లేషణ తెలిపింది. మొత్తం గ్లేసియర్‌ ప్రాంతంలో 12 శాతం తరిగిపోయింది. అంచనా వేసిన హిమ నిల్వలలో 9 శాతం క్షీణత కనిపించింది. గ్లేసియర్లు అలా కుంచించుకుపోవడం 2010 నుంచి 2020 మధ్య కాలంలో మరీ కొట్టొచ్చినట్లు కనిపించింది. సింధు నదీ పరీవాహక ప్రాంతం 6 శాతం గ్లేసియర్‌ ప్రాంతాన్ని కోల్పోయింది. గంగా నది 21 శాతం, బ్రహ్మపుత్ర 16 శాతం తరుగుదలను నమోదు చేశాయి. హిమం గడ్డకట్టిన ప్రాంతాలు కుంచించుకు పోవడం వల్ల వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో నీటి లభ్యత తగ్గి పోతోంది. 

రెండవ నివేదిక 38 గ్లేసియర్ల సన్నిహిత పరిశీలనతో తయారైంది. హిమాలయాల్లో హిమం గడ్డకట్టిన భూభాగాల్లో కొన్ని పాతరూపును పూర్తిగా కోల్పోయే స్థితికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నా యని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘ఇది ఎక్కడో సుదూరంలో ఉన్న సమస్య కాదు. నేటి కాలంలో ఆవిష్కృతమవుతున్న సంక్షోభం. ప్రతి వేసవిలోను, వర్షాకాలంలోను కొత్త ఉపద్రవాలను చూస్తున్నాం. హిమాన్ని కోల్పోతున్న రేట్లు ఈ శతాబ్దంలో రెండింతలైన వాస్తవ మైనా కనీసం మన కళ్లు తెరిపించాలి’’ అని ఐసీఐఎంఓడీ డైరెక్టర్‌ జనరల్‌ పెమా గ్యాంషో అన్నారు. నేపాల్‌లో ఇటీవల చూసిన వరదలు గ్యాంషో హెచ్చరికలోని వాస్తవాన్ని ఎత్తి చూపాయి. ఇది గ్లేసియర్‌ గతిశీలతల సైన్స్, ఉపగ్రహాల విశ్లేషణ, 1974 నుంచి క్షేత్ర స్థాయిలో సేకరిస్తూ వస్తున్న డేటాను ఆధారం చేసుకుని చేసిన స్పష్టమైన హెచ్చరికగా భావించవచ్చు. 

రుణాలు ఎలా ఇస్తున్నారు?
డేటాను విశ్లేషించడం ద్వారా, నిష్క్రియాపరత్వం వల్ల కలిగే ప్రమాదకర పర్యవసానాలను తెలుపడం ద్వారా సైంటిస్టులు తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ, విధాన నిర్ణేతల స్పందనే మంద కొడిగా ఉంది. అంతర్జాతీయంగా కూడా, వివిధ దేశాల ప్యానెళ్ళ నివేదికలపై స్పందన లోపభూయిష్టంగా ఉంది. ముఖ్యంగా, పుడమి తాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను తగ్గించు కోవాల్సిన అంశంపై వాటి కార్యాచరణ పేలవంగా ఉంది. దాని ప్రత్యక్ష ఫలితం హిమా లయాలపై పడుతోంది. ప్రాంతీయ స్థాయిలో హిమాలయ ప్రాంతంలోని దేశాల మధ్య సహకారం బొత్తిగా లేదనే చెప్పాలి. ప్రాంతాల మధ్య రాజకీయ సరిహద్దులను ప్రకృతి ఉత్పాతాలు, వాతావరణం గుర్తించవు కనుక ఈ ప్రాంతంలోని దేశాలు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుని తీరాలి. సింధు, గంగ, బ్రహ్మపుత్ర, మెకాంగ్‌ వంటి పెద్ద నదులన్నీ హిమాల యాలలోనే పుడుతున్నాయి. వివిధ దేశాలను దాటి ప్రవహిస్తు న్నాయి. కనుక, ఒక దేశంలో ఆ నదిలోకి కొండ చరియలు విరిగి పడితే, అది మరో దేశంలో వినాశకర వరదలకు కారణంగా పరిణ మించవచ్చు. 

లిహెండే ఖోలా నదిలో గత ఏడాది జూలైలో సంభవించిన విపత్తు అదే రసూవా, నువాకోట్‌ ప్రాంతంలోని కనీసం అర డజను జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులకు నష్టం కలిగించింది. ఇపుడు వార్తలకెక్కిన ప్రాంతం అప్పుడూ ఇంచుమించుగా ఇవే కారణాలపై వార్తలకెక్కింది. త్రిశూలి పరీవాహక ప్రాంతంలో దాదాపు 36 జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. బహుళ జాతీయ రుణ సంస్థలు కూడా ఆయా అంశాలు వేటినీ లెక్కలోకి తీసుకోకుండా రుణాలు ఇస్తూనే ఉన్నాయి. ఆనకట్టలు, నదులు, ప్రజానీకంపై అధ్యయనం చేసిన సౌత్‌ ఏషియా నెట్‌వర్క్‌ విశ్లేషణలో ఆ అంశాలు వెలుగు చూశాయి. భారతదేశంలో కూడా ప్రకృతి ఉత్పాతాలు, హిమ పాతాలు సంభవించే, శిథిల ప్రవాహాలుసాగే ప్రాంతాల్లో జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు చురుకుగా సాగుతున్నాయి. 

రెండూ సాగవు!
హిమాలయాల్లో జీవావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు రాజకీయంగా కూడా సున్నితమైనవి. అవి భారత్, చైనా, నేపాల్‌ సరిహద్దుల గుండా వ్యాపించి ఉన్నాయి. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా మౌలిక వసతులను పెద్దయెత్తున అభివృద్ధి చేస్తున్నాయి. పైగా, సామూహిక యాత్రలను, వాణిజ్యపరమైన పర్వత ప్రాంత టూరిజాన్ని అవి ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నాయి. కానీ, పర్యావరణపరంగా పెళుసైన ప్రాంతాల్లో నిర్నిరోధ అభి వృద్ధి, కమర్షియల్‌ టూరిజం చెట్టపట్టాలేసుకుని సాగలేవని గ్రహించాలి. శాస్త్రీయ ఆధారాలు, విధాన నిర్ణయాల మధ్య అగాథాన్ని భర్తీ చేయడం ద్వారా పర్వత ప్రాంతాల్లో సంభవించగల విపత్తుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. 

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement