ఆదాయపు పన్ను – అముఖ మదింపు | Faceless Assessment Scheme E assessment September 2019 | Sakshi
Sakshi News home page

Faceless Assessment ఆదాయపు పన్ను – అముఖ మదింపు

Sep 1 2026 10:58 AM | Updated on Sep 1 2026 10:58 AM

Faceless Assessment Scheme E assessment September 2019

 Faceless Assessment ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేసిన వారి రిటర్న్‌ల మదింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నది. ఎలక్ట్రానిక్‌ గవర్నెన్స్‌ చట్టబద్ధమైన తరవాత, ప్రభుత్వం ఎన్నో విధి విధానాలను మార్చేసింది.  వాటిలో ఆదాయపు పన్ను అముఖ మదింపు (ఫేస్‌లెస్‌ అసెస్మెంట్‌) ఒకటి. ఇంతకు మునుపు ఆదాయపు పన్ను మదింపులు, పన్ను చెల్లింపుదారులు ఉండే ప్రదేశంలో నియమితులైన క్షేత్ర స్థాయి మదింపు అధికారుల పరిధిలో ఉండేది. ఆదాయపు పన్ను రిటర్న్‌లను పరిశీలించి, తేడాలుంటే వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయి అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేవారు. సరిగ్గా ఇక్కడే అవినీతి జరిగే ఆస్కారముండేది.

పన్ను మదింపులో విప్లవాత్మకమైన మార్పును చేస్తూ కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు, దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేసే సంస్కరణకు 2019లో శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో పన్ను చెల్లింపుదారులకు ఏ అధికారి పన్ను మదింపు చేస్తున్నారో తెలి యదు.  ఆ అధికారి కూడా కనిపించడు. ఇది కేవలం అముఖమదింపు మాత్రమే కాదు, ఈ ప్రక్రియలో భౌగోళిక పరిధి కూడా ఉండదు.  ఇది ఒక విధంగా ‘జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌.’ ప్రక్రియ లాంటిదే. ఆదాయపు పన్ను శాఖలో ‘నేషనల్‌ ఫేస్‌లెస్‌ అసెస్మెంట్‌ సెంటర్‌’ అనేది  ఏర్పాటయ్యింది. ఈ కేంద్రం, కృత్రిమ మేధ సహాయంతో, పన్ను మదింపు అధికారుల బృందానికి పన్ను చెల్లింపుదారుల రిటర్న్‌లను పంపిస్తుంది. వారు ఆ రిటర్న్‌లను పరిశీలించి అభ్యంతరాలుంటే, తమ అభ్యంతరాలతో సహా నోటీసులను ఆదాయపు పన్ను వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్‌  చేస్తారు. పన్ను చెల్లింపుదారులు ఆ నోటీసులకు సమాధానం, తమ వాదనకు రుజువుగా పత్రాలు, సాక్ష్యాలు మళ్లీ అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కోరితే, పన్ను చెల్లింపుదారులకు ఆన్‌లైన్‌లోనే వ్యక్తిగతంగా తమ వాదనలు విని పించే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. మరింత సమయం కావాలన్నా, వాయిదా కావాలన్నా, ఇదే ప్రక్రియలో కోరవచ్చు. అంతే కాని, పన్ను చెల్లింపుదారులు మాటిమాటికి ఆదాయపు పన్ను కార్యాలయాలకు వెళ్లటం, రావడం అనే ప్రశ్నే ఉండదు. 

ఆ తరువాత పన్ను మదింపు అధికారుల బృందం– పత్రాలు, రుజువులు, వాదనలు పరిశీలించి తమ ఆదేశాలను ఎన్‌.ఎ. ఎఫ్‌.ఎ.సి. ద్వారా మళ్లీ అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. జరిమానా ఏమైనా విధిస్తే, లేక పన్ను అసలే చెల్లించకపోతే లేదా మరింత పన్ను చెల్లించాలని ఆదేశిస్తే, వాటిని వసూలు చేయడానికి ఆ పన్ను చెల్లింపుదారుల దస్త్రాన్ని అప్పుడు భౌగోళిక పరిధిలో ఉన్న క్షేత్ర స్థాయి మదింపు అధికారులకు పంపిస్తారు. ఒకసారి మదింపు జరిగి ఆదేశాలు జారీ అయిన తరువాత వాటిని మార్చే అధికారం క్షేత్రస్థాయి అధికారులకు ఉండదు కనుక క్షేత్రస్థాయి అధికారులు అవినీతికి పాల్పడే అవకాశ ముండదు. క్షేత్రస్థాయి మదింపు అధికారులు, రికవరీ సర్టిఫికేట్‌ నియమాలను అనుసరించి, పన్ను వసూలు చర్యలు చేపడతారు. అదేవిధంగా, ఆ ఆదేశాలపై కమిషనర్‌ స్థాయిలో అప్పీల్‌ చేయాలన్నా ఇదే పద్ధతిలో ఆన్‌లైన్‌లో అప్పీల్‌ చేయాల్సి ఉంటుంది.  

పన్ను చెల్లింపుదారులకు సహాయంగా, ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో ఈ అముఖ మదింపు విధానంలో పాల్గొనడానికి,ఆకళింపు చేసుకోవడానికి అన్ని సాంకేతిక వివరాలు విపులంగా పొందుపరచారు. ఈ ప్రక్రియ పారదర్శకమైనది. పన్ను చెల్లింపు దారులకు సౌకర్యవంతమే కాకుండా పన్ను మదింపు వేగవంతం అయింది. ఇది అవినీతిని రూపుమాపే దిశలో చాలా ప్రభావవంతమైన ఆధునీకరించిన సంస్కరణ. సాంకేతికతను ఉపయోగించి సాధించిన విశిష్టత. డిజిటల్‌ గవర్నెర్స్‌ లక్ష్య సాధనలో ఇదొక మైలు రాయి అని చెప్పడంలో సందేహంలేదు. 

– హరీష్‌ కుమార్‌ కొలిచెల 
అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ – లా (రిటైర్డ్‌), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement