అమెరికాలోని కొలంబస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి ప్రముఖ రచయిత, పరిశోధకుడు డేనియల్ హెచ్. పింక్ స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం:
విశ్వగురు
అందరికీ శుభోదయం. ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజున మీతో మాట్లాడ టానికి వచ్చిన నేను... మెదిపిన బంగాళాదుంపల (స్మాష్డ్ పొటా టోస్) గురించి మాట్లాడబోతున్నాను! ఎందుకో తెలుసుకోవాలంటే మనం 50 ఏళ్ల వెనక్కి వెళ్లాలి. 1970లలో నేను కొలంబస్‌లో పెరిగాను. ఆ రోజుల్లో పరిస్థితులు ఇప్పటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, ఉద్యోగాలపై ఆందోళన, పెరుగుతున్న పెట్రోల్ ధరలు వంటి సమస్యలు ఉండేవి.
మెదిపిన బంగాళాదుంపల కథ
చిన్నప్పుడు నేను... మా అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లతో కలిసి రోజూ భోజనం చేసేవాడిని. మా ఇంట్లో భోజనం చాలా సాధారణంగా ఉండేది. హాట్ డాగ్స్, ట్యూనా క్యాసరోల్, మీట్ లోఫ్ వంటివి ఉండేవి. అయితే మా భోజనంలో తరచుగా కనిపించేది మెదిపిన బంగాళాదుంపలు. తొమ్మిదేళ్ల వయసులో నేను ఓ రోజు మా వృద్ధ బంధువు ఇంటికి వెళ్లాను. ఆమె నాకు మెదిపిన బంగాళాదుంపలు వడ్డించింది. అవి నేను అప్పటివరకు తిన్న వాటిలో అత్యంత రుచికరమైనవి. అవి మెత్తగా రుచిగా ఉన్నాయి. వాటిని ఎలా తయారుచేశారో తెలుసుకోవాలనే ఆసక్తితో వంటగది లోకి వెళ్లాను. అక్కడ నాకు ఆశ్చర్యం కలిగింది. అవి ప్యాకెట్ నుంచి వచ్చినవి కావు. ఆమె సహజమైన బంగాళాదుంప లను ఉడికించి, వాటిని మెదిపి... వెన్న, ఉప్పు కలిపి తయారు చేసింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నాకు మంచి రుచి ఏదో తెలుసు. నాకు నా సొంత అభిరుచి ఉంది. అంటే కేవలం రుచి చూసే నాలుక ఉందని కాదు. ఏది మంచిదో, ఏది అంత మంచిది కాదో గుర్తించే సొంత అభిప్రాయం నాకు ఉందని అర్థం.
గత నాలుగేళ్లలో మీరు ఇక్కడ యానిమేషన్ , ఫ్యాషన్ , సినిమా, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ , గేమ్స్, ఫైన్ ఆర్ట్ వంటి ఎన్నో విషయాల్లో నైపుణ్యం సంపాదించారు. మీరు కష్టమైన ప్రాజెక్టులు పూర్తి చేశారు. మంచి ఇంటర్న్‌షిప్‌లు పొందారు. జీవితాంతం గుర్తుండిపోయే స్నేహా లను ఏర్పరచుకున్నారు. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. మీరు మీ సొంత అభిరుచిని, కళాత్మక దృష్టిని,సొంత ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఏది మంచిదో, ఏది గొప్పదో, ఏది మెరుగుపరచాలో గుర్తించే శక్తిని పొందారు. ఇప్పుడు మనం కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ఉన్నాం. ఈ కాలంలో మీ సొంత అభిరుచి మిమ్మల్ని ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఏఐ మీకు ఎన్నో ఎంపికలు ఇవ్వగలదు. ఒక చిన్న సూచన ఇస్తే చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ సాధనాలు డజన్ల కొద్దీ, వందల కొద్దీ ఆలోచనలు ఇవ్వగలవు. కానీ వాటిలో ఏది అద్భుత మైనది? ఏది సాధారణమైనది? ఏది వినియోగదారుడికి ఉపయోగ పడుతుంది? ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? అనేది మీరు నిర్ణయించాలి. ఏఐకి సొంత అభిరుచి, సొంత అభిప్రాయం ఉండదు. మీకు సొంత అభిరుచి ఉంది. సొంతం అభిప్రాయం ఉంది. అందుకే భవిష్యత్తులో ఏఐకి మీలాంటి మనుషులు మరింత అవసరం అవుతారు. కృత్రిమ మేధ యుగంలో మీ గొప్ప ఆయుధం... మీ సొంత అభిరుచి. మీ సొంత విచక్షణ!
మంచి పనిని గుర్తించే అభిరుచి
చాలా కాలం వరకు మనుషులు గొప్ప ఆలోచనలు చేయ గలిగేవారు. కానీ వాటిని నిజంగా రూపొందించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాధనాలు అందరికీ ఉండేవి కావు. ఏఐ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చింది. ఇప్పుడు దాదాపు ఎవరైనా దాదాపు ఏదైనా తయారు చేయగలరు. అందువల్ల భవిష్యత్తులో అరుదైన నైపుణ్యం పని చేయడం మాత్రమే కాదు; మంచి పనిని గుర్తించడం. దీనినే విచక్షణ అంటాం. ఉదాహరణకు పుస్తక ప్రచురణ రంగంలో ఏఐ కారణంగా పుస్తకాలు రాయడం సులభమైంది. పుస్తకాల సంఖ్య పెరిగింది. పరిమాణం పెరిగింది. కానీ వాటి సగటు నాణ్యత తగ్గింది. ఈ పరిస్థితిలో మంచి పనిని గుర్తించే అభిరుచే అత్యంత కీలక నైపుణ్యంగా మారనుంది. మన అభిరుచి ఇతరుల పనిని చూడటం వల్ల అభివృద్ధి చెందదు. మనమే ఏదైనా సృష్టించినప్పుడు మన అభిరుచి మరింత పెరుగుతుంది. మీరు చేసిన ప్రతి ప్రాజెక్టు, ఎదుర్కొన్న ప్రతి విమర్శ, వదిలేయాలని అనిపించిన ప్రతి పని.. ఇవన్నీ మీ అభి రుచిని పెంచుతాయి. కళ, డిజైన్ , సంగీతం, సినిమాలు, సాహిత్యం వంటి వాటిని ఆస్వాదించండి. కానీ ఇతరుల పనిని చూడటంకంటే... మీరు స్వయంగా సృష్టించే పనికి ఎక్కువ సమయం కేటాయించండి. అభిరుచి అంటే మనకు నచ్చినది చెప్పడం మాత్రమే కాదు. నచ్చనప్పుడు ‘లేదు’ అని చెప్పే ధైర్యం కూడా. ‘ఇది సరి పోదు.’ ‘ఇది నాకు నచ్చలేదు.’ ‘ఇది ఇంకా మెరుగ్గా ఉండాలి’ అని నిర్మొహమాటంగా చెప్పగలగాలి. ఇతరులందరూ ఒక పనికి ‘అవును’ అని చెప్పినప్పటికీ... అది సరైనది కాదని మీకు అనిపిస్తే ‘నో’ అని చెప్పే ధైర్యం ఉండాలి. ఇదే నిపుణుడికి, సాధారణ వ్యక్తికి మధ్య ఉన్న తేడా!
అభిరుచి మారాలి!
మీ అభిరుచులు ఎప్పటికీ ఒకేలా ఉంటే మీరు ఎదగడం లేదని అర్థం. మీరు ఈ కాలేజీలో చేరిన రోజు ఉన్న వ్యక్తి ఇప్పుడు లేరు. మీ ఆలోచనలు మారాయి. మీ అనుభవాలు పెరిగాయి. మీ దృష్టి మారింది.ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది ఎదుగుదలకు సంకేతం. నాలుగేళ్ల తర్వాత, పదేళ్ల తర్వాత కూడా మీరు మారు తూనే ఉండాలి. విజయవంతమైన సృష్టికర్తలు జీవితాంతం ఒకే విధానంలో చిక్కుకుపోరు. వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త ఆలోచ నలను స్వీకరిస్తారు. తమ అభిరుచిని నిరంతరం అభివృద్ధి చేసుకుంటారు. అందుకే మూడు విషయాలు గుర్తుంచుకోండి: ఎక్కువగా సృష్టించడంపై దృష్టిపెట్టండి. అవసరమైనప్పుడు ‘నో’ చెప్పండి. ఎప్పటి కప్పుడు మారుతూ ఉండండి. చివరగా ఒక చిన్న సలహా: ఓ ఆన్‌లైన్ వేదికలో బంగాళా దుంపల గురించి ప్రత్యేకంగా చర్చించే ఒక సమూహం ఉంది. అక్కడ మెదిపిన బంగాళాదుంపల గురించి కూడా చర్చ జరిగింది. కొంతమంది వాటిని ఇష్టపడలేదు. మరికొందరు వాటిని సమర్థించారు. అందులో ఒక వ్యక్తి చెప్పిన నాలుగు పదాల సలహా నాకు చాలా నచ్చింది: ‘‘విమర్శలను పట్టించుకోకండి. మీ ఆనందాన్ని ఆస్వాదించండి’’. ఇది సృజనాత్మక జీవితానికి కూడా గొప్ప సలహా.
మీరు అడుగుపెడుతున్న ప్రపంచంలో మనుషులు చూడగలి గిన దానికంటే ఎక్కువ సమాచారం ఉంటుంది. అనంతమైన చిత్రాలు. అసంఖ్యాకమైన ఎంపికలు. ఎప్పటికీ ఆగని సమాచార ప్రవాహం. అలాంటి ప్రపంచంలో ఏది నిజమైనది? ఏది అందమై నది? ఏది విలువైనది? ఏది సృష్టించదగినది? అని గుర్తించగలిగిన వారిదే భవిష్యత్తు. చివరగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక్కటే: విమర్శలను పట్టించుకోకుండా, మీ జీవితాన్ని ఆనందంగా ఆస్వా దిస్తూ ముందుకు సాగండి. మీ అందరికీ అభినందనలు!


