అమ్మ, నాన్న.. జెన్‌జీ | 72 percent of Gen Z youth are dependent on their parents | Sakshi
Sakshi News home page

అమ్మ, నాన్న.. జెన్‌జీ

Aug 29 2026 5:05 AM | Updated on Aug 29 2026 5:05 AM

72 percent of Gen Z youth are dependent on their parents

72 శాతం జెన్‌జీ యువత తల్లిదండ్రులపై ఆధారపడుతున్న వైనం 

ఏఐ కారణంగా ఉద్యోగాలపై 46 శాతం మందిలో ఆందోళన

చదువు పూర్తయింది.. ఉద్యోగం వచ్చింది.. సొంతంగా జీవితం మొదలుపెడదాం.. ఇవి జెన్‌–ఎక్స్‌ (1965 నుంచి 1980 మధ్యకాలంలో జన్మించిన వారు) తరం వారి ఆలోచనలు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, ఇళ్ల ధరలు, విద్యా ఖర్చులు, రుణాలు తదితర కారణాలతో మిలీనియల్స్‌ (1981 నుంచి 1996 మధ్యకాలంలో జన్మించిన వారు), జెన్‌జీ (1997 నుంచి 2012 మధ్యకాలంలో జన్మించిన వారు) తరాల ఆలోచనల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 

పెరిగిన ఖర్చులతో పాటు ముఖ్యంగా ఉద్యోగ భద్రతపై అనిశ్చితుల కారణంగా జెన్‌జీ జీవిత ప్రణాళికలు మారుతున్నాయి. ఇల్లు, పెళ్లి, పిల్లలు.. వయసును బట్టి కాకుండా ఆర్థిక స్తోమతను బట్టి నిర్ణయించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో మార్పులతో జెన్‌జీ తరం ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించేందుకు ఇబ్బందులు పడుతోంది. సొంత ఇల్లు, పెళ్లి అనే ప్రధాన ఘట్టాలను వాయిదా వేయడం లేదా పూర్తిగా విరమించుకోవడం చేస్తోంది. అమెరికాకు చెందిన నార్త్‌వెస్టర్న్‌ మ్యూచువల్‌–2026 ప్లానింగ్‌ అండ్‌ ప్రోగ్రెస్‌ స్టడీ  ఈ విషయాలపై తాజాగా ఓ నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం..  – సాక్షి, అమరావతి

జెన్‌జీ యువతలో ఏకంగా 72 శాతం మంది తాము ఇప్పటికీ తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడుతున్నామని చెప్పారు. పూర్తిగా తల్లిదండ్రుల సాయం లేకుండా తమను తాము పోషించుకోగలమని చెప్పిన వారు 24 శాతం మాత్రమే. ఇదే పరిస్థితి మిలీనియల్స్‌లో 53 శాతంగా ఉంది. జెన్‌జీ సొంతింటి కల కూడా ఆర్థిక భారంతో వెనక్కి వెళ్తోంది. ఇంటి యజమానులు కాని జెన్‌జీ యువతలో 54 శాతం మంది ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఇల్లు కొనుగోలు చేయడంపై డౌన్‌పేమెంట్‌కు తగినంత డబ్బు లేదని 52 శాతం, ఇంటి బీమా, మరమ్మతులు తదితర అదనపు ఖర్చులను భరించలేమని 47 శాతం, మార్ట్‌గేజ్‌ వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నాయని 43 శాతం మంది చెబుతున్నారు. 

దీంతో తమకు సొంతింటి కలను సాకారం చేసుకోవడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. జెన్‌జీ తరం వారిలో 31 శాతం మంది ఇల్లు కొనడాన్ని, 20 శాతం మంది పెళ్లిని, 24 శాతం మంది పిల్లలను కనాలనే నిర్ణయాన్ని, 26 శాతం మంది తమ ఉన్నత విద్య ఖర్చులను వాయిదా వేసినట్లు అధ్యయనం లో వెల్లడైంది. ఇల్లు కొనలేమేమోనని 34 శాతం, పిల్లల్ని కని వారి బాధ్యతలను మోయలేమేమోనని 20 శాతం, పెళ్లి చేసుకుంటే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించలేమేమోనని 14 శాతం యువత ఆందోళన వ్యక్తం చేసింది.

ఏఐతో ఉద్యోగ భయం.
కృత్రిమ మేధ (ఏఐ) అన్ని రంగాల్లో విస్తరించడం కూడా యువతలో ఆందోళన పెంచుతోంది. తమ కెరీర్‌పై ఏఐ ప్రభావం ప్రతికూలంగా ఉండొచ్చని 46 శాతం జెన్‌జీ యువత భావిస్తోంది. ఉద్యోగ భద్రత, ఆదాయ స్థిరత్వం, భవిష్యత్తులో తమ నైపుణ్యాలకు డిమాండ్‌ ఉంటుందా అనే సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. అయితే, జీవితంలో ఇతర లక్ష్యాలు ఆలస్యమవుతున్నా.. రిటైర్మెంట్‌ పొదుపుల విషయంలో జెన్‌జీ ముందుగానే అడుగులు వేస్తోంది. సగటున 22 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ కోసం పొదుపు ప్రారంభిస్తున్నట్లు అధ్యయనం తెలిపింది. సగటున 61 ఏళ్లకు రిటైర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement