మూడో వంతు సీట్లు కేటాయించేలా ఒత్తిడి తేవాలి
స్థానిక సంస్థల ఎన్నికలపై తేల్చి చెప్పిన జనసేన నేతలు
కచ్చితంగా గెలిచే చోట పోటీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల
ఇక ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ యువజన విభాగం
సాక్షి, అమరావతి : అసెంబ్లీ సీట్ల మాదిరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో జనసేనకు కేటాయించే సీట్లను అప్పటికప్పుడు పార్టీలో చేరే నేతలకు ఇస్తే ఊరుకోమని జనసేన నేతలు స్పష్టం చేశారు. కూటమి పార్టీల నుంచి నామినేషన్లకు ముందు జనసేనలో చేరే నేతలకు సైతం సీట్లు ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కాదు.. కూడదని సీట్లు ఇస్తే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు సహకరించే పరిస్థితి ఉండదని, ఓడిస్తారని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శుక్రవారం మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నేతల సమావేశం నిర్వహించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, వివిధ నామినేటెడ్ పదవులు పొందిన నేతలు, అసెంబ్లీ.. స్థానిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు మూడో వంతు సీట్లు కేటాయించేలా ఒత్తిడి తేవాలన్నారు. 10–12 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికే ఈ సీట్లు ఇవ్వాలన్నారు. జనసేనకు అధికారం దక్కిన తరుణంలో పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. ‘స్థానిక సంస్థల్లో ప్రతి నాయకుడు లోతుగా అధ్యయనం చేయాలి.
మనకు కచ్చితమైన గెలుపు అవకాశం ఉండే చోట జనసేన పోటీ చేస్తుంది. రిజర్వేషన్లు, స్థానిక బలాబలాలు అన్నీ బేరీజు వేసుకొని, నాయకత్వాన్ని పెంచే దిశగా జనసేన అడుగులు వేస్తుంది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ యువజన విభాగాన్ని ఆవిష్కరిస్తాం. 30 రోజుల స్థానిక సంస్థల ప్రణాళికను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధం చేశారు’ అని తెలిపారు.
అనంతరం ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలో పార్టీ నియమించిన 14 మంది సభ్యుల కమిటీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘రాష్ట్ర స్థాయిలో కూటమి సమన్వయ కమిటీలో చర్చలు నడుస్తున్నాయి. జిల్లా, నియోజక వర్గాలవారీగా సమన్వయ కమిటీలు ఉంటాయి. ముందుగా నగర పాలక, పుర పాలక సంస్థల ఎన్నికల మీద దృష్టి పెట్టాలి. డివిజన్లు, వార్డుల్లో మన బలాబలాలు గుర్తించాలి’ అంటూ నాదెంద్ల ఆ కమిటీకి సూచించారు.


