పోలీసులు ఆ విషయాన్ని మీడియాకు చెప్పనివ్వడం లేదు
కటవుట్ శ్రీను టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు
కాకినాడలో హతుడు సతీష్ భార్య జయశ్రీ ఆరోపణ
కాకినాడ క్రైం: కాకినాడలో మంగళవారం రాత్రి తన భర్త, జిమ్ ట్రైనర్ సతీష్ ను హత్యచేయించింది కాకినాడ నగర టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు బోను శ్రీను అలియాస్ కటవుట్ శ్రీను అని సతీష్ భార్య జయశ్రీ ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పనివ్వడంలేదన్నారు. కాకినాడ ట్రెజరీ కాలనీలోని ఇంటివద్ద శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శ్రీను.. తన భర్త సతీష్ కు, తన భర్తను హత్యచేసిన సాయికిరణ్‌కు స్నేహితుడని చెప్పారు. గర్భవతిని కావడంతో తాను ఇబ్రహీం కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు తెలిపారు.
జూలై రెండోవారంలో ఒకరోజు అర్ధరాత్రి తాను అన్నయ్యగా పిలిచే సాయికిరణ్ తమ ఇంటికి వచి్చ, తన భర్త కటవుట్ శ్రీను భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పాడన్నారు. శ్రీను, అతడి భార్య విడాకుల విషయం కోర్టులో ఉందని చెప్పాడని తెలిపారు. అతడు మాట్లాడుతూ ఉండగానే కటవుట్ శ్రీను మరో గుర్తుతెలియని వ్యక్తితో వచ్చి తన భర్తను చంపేస్తానని బెదిరించి వెళ్లాడన్నారు. శ్రీను భార్యపై కన్నేసిన సాయికిరణ్ తన భర్తపై చాడీలు చెప్పి శ్రీనుని రెచ్చగొట్టాడన్నారు. అనంతరం శ్రీను పథకం మేరకు సాయికిరణ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తన భర్తను హత్యచేశాడని ఆరోపించారు.

ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కటవుట్ శ్రీను (ఫైల్)
రాత్రి 2 గంటలకు హత్య జరిగితే.. 3 గంటలకు ఆస్పత్రిలో చేరిన శ్రీనుతన భర్తను కటవుట్ శ్రీను హత్యచేయించాడని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొండబాబు ఒత్తిడితో పోలీసులు ఈ కేసు నుంచి కటవుట్ శ్రీనును తప్పిస్తున్నారని ఆరోపించారు. జీజీహెచ్ మార్చురీ వద్ద తాను శ్రీను పేరు మీడియాకు చెప్పేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వారించారని, సాయి కిరణ్ పేరు మాత్రమే చెప్పాలన్నారని తెలిపారు. రాత్రి రెండు గంటలకు హత్య జరిగితే, మూడు గంటలకు శ్రీను తనకు లేని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.
హత్య జరిగి మూడురోజులు గడుస్తున్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న కటవుట్ శ్రీనుని విచారించకపోవడం, అదుపులోకి తీసుకోకపోవడం చూస్తే పోలీసులు ప్రలోభాలకు లోనయ్యారని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని తెలుస్తోందని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు శ్రీను, అతడి అనుచరుల వల్ల ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కటవుట్ శ్రీనును అదుపులోకి తీసుకుని హత్యకు కారణాలను బయటపెట్టి నిందితులను శిక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


