కమీషన్ల ‘టవర్‌’! | Provision that joint ventures are not eligible to participate in tenders | Sakshi
Sakshi News home page

కమీషన్ల ‘టవర్‌’!

Aug 29 2026 4:18 AM | Updated on Aug 29 2026 4:18 AM

Provision that joint ventures are not eligible to participate in tenders

శాశ్వత సచివాలయం ఎంఈపీ, హెచ్‌వీఏసీ, ఫైర్, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల టెండర్లలో గోల్‌మాల్‌ 

మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ పనుల్లో రూ.783 కోట్ల దోపిడీకి స్కెచ్‌ 

రూ.2,183.84 కోట్ల అంచనా వ్యయంతో వేర్వేరుగా టెండర్‌ నోటిఫికేషన్‌ 

చదరపు అడుగుకు రూ.4,183.20 చొప్పున వ్యయం.. అత్యాధునిక టెక్నాలజీ వాడినా చ.అ.కు రూ.2,500 మించదంటున్న ఇంజినీరింగ్‌ నిపుణులు  

టెండర్లలో జాయింట్‌ వెంచర్లు పాల్గొనేందుకు అర్హత లేదంటూ నిబంధన 

పనులు దక్కించుకున్నాక 50% సబ్‌ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకునే వెసులుబాటు  

ఇదంతా ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు ఇవ్వడానికేనంటున్న ఇంజినీర్లు  

సాక్షి, అమరావతి: అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు ఎంఈపీ (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌), హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ఫైర్‌ అలారమ్‌ తదితరాల పనులకు ఏకంగా రూ.2,183.84 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవడంపై ఇంజినీరింగ్‌ నిపుణులు నివ్వెరపోతున్నారు. కేవలం ఐదు టవర్లలో అంతర్గత పనులకే ఈ స్థాయిలో వ్యయం చేస్తుండటంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు టవర్లను బీ+జీ+39.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 

ఒక్కో అంతస్తు 47 మీటర్ల వెడల్పు, 47 మీ. పొడవుతో 2,209 చ.మీ. నిర్మిత ప్రాంతంతో నిర్మిస్తున్నారు. మొత్తం ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4.85 లక్షల చదరపు మీటర్లు.. అంటే 52,20,496 చ.అడుగులు. అంటే.. ఎంఈపీ, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు లాంటి పనులకే చదరపు అడుగుకు రూ.4,183.20 చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పనులకు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి టెండర్లు పిలిచారని.. ఎక్కువ కమీషన్‌ ఇచ్చే కాంట్రాక్టర్‌కు అప్పగించి.. భారీ ఎత్తున దోచుకోవడానికి ముఖ్యనేత స్కెచ్‌ వేశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

 శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో జాయింట్‌ వెంచర్లలు పాల్గొనటానికి అర్హత లేదని ఏజీఐసీఎల్‌ పెట్టిన నిబంధన    

టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థ ఆ పనుల విలువలో 50 శాతం వరకు సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు వెసులుబాటు  కల్పిస్తూ పెట్టిన నిబంధన 

మూడు ప్యాకేజీలుగా..
రాజధాని ప్రాంతంలో నేలపాడు వద్ద శాశ్వత సచి­వాలయాన్ని 900 మీ. పొడవు, 139 మీ. వెడల్పుతో 32 ఎకరాల విస్తీర్ణంలో పాలవాగుకు ఉత్తరాన 2 టవర్లు, దక్షిణాన మూడు టవర్లుతో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఐదు టవర్లకు హై సైడ్‌ ఎలక్ట్రికల్‌ (విద్యుత్‌ సరఫరా), హెచ్‌వీఏసీ(వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్య­వ­స్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్‌ పనులు చేపట్టేందుకు మూ­డు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్‌ (అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) టెండర్లు పిలిచింది. 

1, 2 టవర్లకు రూ.737.76 కోట్లు (రూ.134.68 కోట్లు అదనంగా సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రీయింబర్స్‌).. 2, 3 టవర్లకు రూ.679.19 కోట్లు (రూ.123.92 కోట్లు పన్నుల రూపంలో అదనంగా రీయింబర్స్‌).. జీఏడీ టవర్‌కు రూ.429.83 కోట్లు (రూ.78.46 కోట్లు పన్నుల రూపంలో అదనంగా రీయింబర్స్‌) అంచనా వ్యయంతో 18 నెలల్లో పనులు పూర్తి చేసి.. మరో రెండేళ్లపాటు నిర్వహించాలనే షరతుతో టెండర్లు పిలిచింది. ఈ బిడ్‌ల దా­ఖలు తుది గడువు సెప్టెంబరు 9. అదే రోజు టెక్నికల్‌ బిడ్‌ తెరుస్తారు. ఫైనాన్స్‌ బిడ్‌ను 16న తెరిచి... సెప్టెంబరు 25లోగా టెండర్‌ ఖరారు చేసి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించేలా షెడ్యూలు ప్రకటించారు.

ఐకానిక్‌ ‘దోపిడీ’..
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి మహా నగరాల్లో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలు, ఇటాలియన్‌ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్‌ విధానంలో కట్టినా.. నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని స్పష్టం చేస్తున్నారు. కానీ, శాశ్వత సచివాలయం టవర్లకు హై సైడ్‌ ఎలక్ట్రికల్‌, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లంబింగ్‌ పనులకే చదరపు అడుగుకు రూ.4,183.20 చొప్పున వ్యయం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

అంచనా వ్యయం భారీగా పెంచేస్తుండటంపై ఎవరైనా ప్రశ్నిస్తే.. అవి సాధారణ భవనాలు కాదు.. ఐకానిక్‌ టవర్లు అంటూ చంద్రబాబు సర్కార్‌ సమర్థించుకోవడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమేనని ఇంజినీరింగ్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, హంగులతో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో హై సైడ్‌ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లంబింగ్‌ పనులకు చదరపు అడుగుకు రూ.2,000 నుంచి రూ.2,500లకు మించి వ్యయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఈ లెక్కన చదరపు అడుగుకు సగటున రూ.1,500 చొప్పున అంచనా వ్యయాన్ని పెంచేశారని.. రూ.783 కోట్ల మేర దోపిడీకి స్కెచ్‌ వేశారని ఆరోపిస్తున్నారు. శాశ్వత సచివాలయం ఐదు టవర్లకు డిజైన్‌లు రూపొందించిన ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థే.. చైనాలో షెన్‌జెన్‌లోని మర్చంట్స్‌ బ్యాంక్‌ హెడ్‌ క్వార్టర్స్‌ భవనాలను డిజైన్‌ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్‌ ఫెసాడ్‌ కొటేషన్‌లో పేర్కొన్న ధరను పరిగణనలోకి తీసుకుని.. గ్లాసింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కానోపి, స్కైలైట్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ లాంటి పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892లుగా బీవోసీఈ ఖరారు చేసింది. 

ఐదు టవర్లలోనూ అన్ని రకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కకట్టింది. ఈ లెక్కన ఆ పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్ల వ్యయంతో ఏజీఐసీఎల్‌ ఇటీవల టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చదరపు మీటరు ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ (బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌) ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో రూ.553.51 కోట్ల దోపిడీకి ముఖ్యనేత స్కెచ్‌ వేశారని నిపుణులు పేర్కొంటున్నారు.

జాయింట్‌ వెంచర్లకు అర్హత లేదట.. 
50 శాతం సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చుకోవచ్చట..
సచివాలయం టవర్లకు ఎంఈపీ, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ఫైర్‌ అలారమ్‌–ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల పనుల టెండర్ల బిడ్‌లు దాఖలు చేసేందుకు ఏజీఐసీఎల్‌ పెట్టిన నిబంధనలు చూసి ఇంజనీరింగ్‌ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్‌ వెంచర్లు (ఒకటి కంటే ఎక్కువ సంస్థలు కలిపి జట్టుగా ఏర్పడటం) బిడ్‌లు దాఖలు చేయడానికి అర్హత లేదని నిబంధన పెట్టింది. కానీ.. టెండర్‌లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏజీఐసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అనుమతితో 50 శాతం పనులను సబ్‌ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది. 

పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనలను విధించడం వెనుక లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక. సీఆర్‌డీఏ కొటేషన్లు ఆహ్వానించిన సంస్థల్లో ఎవరు ఎక్కువ కమీషన్‌ ఇస్తే వారికి పనులు అప్పగించడానికే ఇలాంటి విచిత్రమైన నిబంధనలు పెట్టారంటూ ఇంజినీరింగ్‌ నిపుణులు ఆరోపిస్తున్నారు. జాయింట్‌ వెంచర్‌లకు టెండర్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తే.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న రెండు మూడు సంస్థలు కలిసి జట్టుగా ఏర్పడి బిడ్‌లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అధిక సంస్థలు పోటీ పడితే.. అంచనా విలువ కంటే తక్కువ ధరకే కోట్‌ చేస్తూ బిడ్‌లు దాఖలు అవుతాయి. అదే జరిగితే తమకు అధికంగా కమీషన్‌ ఇచ్చేందుకు ముందుకొచి్చన సంస్థకు ఆ పనులు దక్కే అవకాశం ఉండదు. అందుకే ముఖ్యనేత సూచన మేరకు పరస్పర విరుద్ధమైన నిబంధనలు పెట్టారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

చ.అడుగు వ్యయం రూ.4,350.42తో మొదలై.. ఏకంగా రూ.20,439.58..
» శాశ్వత సచివాలయం ఐదు టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలకు అప్పగిస్తూ నాడు ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 
» ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. 
»  ఈ భవనాలకు హై సైడ్‌ ఎలక్ట్రికల్‌ (విద్యుత్‌ సరఫరా), హెచ్‌వీఏసీ (వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్‌ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. 
»  టవర్ల డిజైన్‌ల పనులను రూ.401.54 కోట్లకు ఫోస్టర్‌ పార్టనర్స్‌–హాఫీజ్‌ కాంట్రాక్టర్, జెనిసిస్‌ ప్లానర్స్‌కు అప్పగించారు. 
»  అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివా­లయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. 
»  ఇక అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. 
»  మొత్తమ్మీద సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. అంటే.. నిర్మాణ వ్యయం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. 
» రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దుబారా చేస్తూ.. దోపిడీ చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నారంటూ ఇంజినీర్లు, ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement