జైపూర్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు రాఖీ కట్టి వార్తల్లో నిలిచిన రాజస్థాన్‌కు చెందిన మోహిని దేవి గత మార్చి నెలలో కన్నుమూశారు. దీంతో గత 26 ఏళ్లుగా భారత్-అమెరికాల మధ్య కొనసాగుతున్న ఓ అరుదైన, ఆత్మీయ అనుబంధం ముగిసింది. 2000వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో గల నాయ్లా గ్రామాన్ని సందర్శించారు.
ఆ సమయంలో పంచాయతీ రాజ్ మహిళా సాధికారతను పరిశీలించేందుకు వచ్చిన క్లింటన్‌కు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఆ సందర్భంగా గ్రామానికి చెందిన మోహిని దేవి క్లింటన్‌కు హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్ది రాఖీ కట్టారు. ఆ సమయంలో క్లింటన్ ఆమెతో కలిసి స్థానిక రాజస్థానీ గీతాలకు నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం రక్షాబంధన్ పర్వదినాన మోహిని దేవి క్లింటన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రాఖీలు పంపడం ఆనవాయితీగా కొనసాగించారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ద్వారా ఈ రాఖీలు వైట్‌హౌస్‌కు చేరేవి. దీనికి ప్రతిగా బిల్ క్లింటన్ కూడా ఆమెకు ప్రత్యేక లేఖలు, కానుకలు పంపేవారు. మోహిని దేవి భద్రపరుచుకున్న ఆ లేఖలు, కానుకలు, జ్ఞాపకాలు వీరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలిచాయి. మోహిని దేవి మృతితో నాయ్లా గ్రామంతో పాటు ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇది కూడా చదవండి: అంతటా రక్షా బంధన్ రద్దీ.. ‘హెల్ప్‌లైన్’ ప్రకటించిన పోలీసులు


