లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సీజన్‌లో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదైంది. ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల మహిళ బలరాంపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను తొలుత ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. లక్షణాలను పరిశీలించిన వైద్యులు స్వైన్ ఫ్లూ పరీక్ష చేయించాలని సూచించారు. ఆగస్టు 24న ఒక ప్రైవేట్ ల్యాబ్ ఆమెకు స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారించింది. మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు ఆగస్టు 25న ఆమెను బలరాంపూర్ ఆసుపత్రిలో చేర్పించారు.
పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు ఆక్సిజన్, లైఫ్ సపోర్ట్ అందించినప్పటికీ, గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు మృతి చెందారు. అయితే, ఆమె మరణించిన తర్వాతే కుటుంబ సభ్యులు స్వైన్ ఫ్లూ పాజిటివ్ రిపోర్టును వైద్యులకు చూపించారు. ఈ సమాచారంతో ఆసుపత్రి వర్గాలు అప్రమత్తమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా, ఆమెకు చికిత్స అందించిన 17 మంది వైద్యులు, సిబ్బందితో పాటు సమీపంలోని రోగుల నమూనాలను సేకరించి కేజీఎంయూ కి పంపారు. సంబంధిత వైద్య సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు.
మహిళకు నిర్వహించిన పరీక్ష వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారని, స్వైన్ ఫ్లూ నిర్ధారణకు ఎలిసా పరీక్ష రిపోర్టు అవసరమని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.బి. సింగ్ తెలిపారు. బాధిత మహిళ ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని సేకరిస్తూ కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టారు. ఆమె కుటుంబ సభ్యులకు మందులు అందించి, ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ‘ఈ బంధం అబద్ధమా..’.. ఇకపై క్లింటన్‌కు ‘రాఖీ’ లేదు!


