మాబున్నీ మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన. (ఇన్‌సెట్‌లో) మాబున్నీ (ఫైల్)
డాక్టర్ల సలహాతో అబార్షన్ చేసిన కాంపౌండర్, నర్సులు
వైద్యం వికటించి గర్భిణి మృతి
మార్కాపురం జిల్లాలో ఘటన
యర్రగొండపాలెం: వీడియో కాల్ ద్వారా డాక్టర్ల సలహాతో కాంపౌండర్, నర్సులే ఓ గర్భిణికి అబార్షన్ చేయగా, అది వికటించడంతో ఆమె మృతి చెందింది. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఈ దారుణం జరిగింది. యర్రగొండపాలెం మండలం మురారిపల్లె గ్రామానికి చెందిన షేక్ మాబున్నీ (25) 5 నెలల గర్భాన్ని తీయించుకునేందుకు యర్రగొండపాలెంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అక్కడ అన్నీ తామై ఆపరేషన్లు చేస్తున్న కాంపౌండర్, నర్సులు కలిసి ఆమెకు అబార్షన్ చేసేందుకు పూనుకున్నారు.
వీడియో కాల్‌లో డాక్టర్లను సంప్రదించి ఆపరేషన్ చేయగా బ్లీడింగ్ ఎక్కువైంది. దీంతో సమీపంలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అక్కడికి మాబున్నీని తీసుకెళ్లగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి డాక్టర్లు ఆమెకు వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందింది. అవగాహన లేకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లనే మాబున్నీ మృతి చెందిందని బంధువులు ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
మెడికల్ షాపు యజమానే హాస్పిటల్ యజమాని!
మాబున్నీకి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తిరిగి గర్భందాల్చిన ఆమె లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆడపిల్ల అని తేలడంతో ఆమె అబార్షన్ చేయించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆమె అబార్షన్ చేయించుకున్న ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్ వైద్యం చేస్తుండేవారు. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత ఒక మెడికల్ షాపు యజమాని ఆ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అక్కడకు ఎక్కువగా అబార్షన్ కేసులే వస్తుంటాయని సమాచారం. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు యర్రగొండపాలెం ఎస్సై దేవకుమార్ తెలిపారు.


