ఊళ్లు ఖాళీ చేస్తున్నా.. నిర్వాసితులకు అందని పరిహారం
కొత్త ప్రాంతంలో బతుకు భయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు వేదనతో ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. పరిహారం పూర్తిగా అందకపోయినా, అసలు అందకపోయినా ఇళ్లు, ఊళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముంపు గ్రామాలైన గొట్టిపడియ, కలనూతల, సుంకేసుల, గుండంచర్ల తదితర ప్రాంతాల నుంచి కొందరు మార్కాపురం పట్టణానికి, మరికొందరు సమీప గ్రామాలకు వెళ్లిపోతున్నారు. ఇన్నేళ్లు తమదనుకున్న ఇంటిని, ఊరిని వదిలేస్తున్నామనే బాధ ఒకవైపు, కొత్త ప్రాంతంలో ఇల్లు, ఉపాధి, పిల్లల చదువులు, పశుపోషణ ఎలా సాగుతాయోనన్న ఆలోచనలు మరోవైపు వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి.
పరిహారం అందలేదని, పేర్లు జాబితాలో లేవని, వివరాల్లో తప్పులున్నాయని తదితర కారణాలతో నిర్వాసితుల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్‌లో 1,863 అర్జీలు వచ్చాయి. జిల్లాస్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటైన 11 బృందాలు ఇప్పటివరకు 1,818 అర్జీలను విచారించాయి. విచారించిన వాటిలో కేవలం 758 అర్జీలే అర్హమైనవిగా అధికారులు నిర్ధారించారు. 977 అర్జీలు అనర్హమైనవని తేల్చారు. మరో 83 అర్జీలపై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు. అధికారుల నివేదిక ప్రకారం ఇప్పటికే చెల్లించిన పరిహారానికి అదనంగా మరో రూ.112 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ప్రత్యేక గ్రీవెన్స్‌లోని అర్జీలన్నింటినీ పరిష్కరించి అర్హులను గుర్తిస్తే అదనంగా మరో రూ.100 కోట్ల వరకు అవసరమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గతంలో సర్వే సమయంలో గ్రామాల్లో లేని వారు, వలస వెళ్లిన వారు, కుటుంబ విభజన కారణంగా పేర్లు నమోదు కానివారు, రికార్డుల్లో చిన్నపాటి తప్పుల కారణంగా పరిహారానికి దూరమైన వారిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు గొట్టిపడియ గ్రామానికి చెందిన పలువురు నిర్వాసితుల పేర్లు గెజిట్‌లో ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ జాబితాలో లేకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
కొందరికి ఇంటి పట్టాలు కూడా ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వికలాంగులకు సైతం ప్యాకేజీ అందకపోవడం బాధాకరమని నిర్వాసితులు చెబుతున్నారు. తమ వద్ద ఆధార్, రేషన్ కార్డు, ఇతర ఆధారాలు ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధపడుతున్నారు. ప్రభుత్వమే అర్హులందరికీ న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
నా పేరు గెజిట్‌లో ఉన్నా.. ప్యాకేజీ లిస్టులో లేదు
నేను గొట్టిపడియ గ్రామంలోనే నివసిస్తున్నాను. నాకు కంటిచూపు లేదు. గెజిట్‌లో నా పేరు ఉన్నప్పటికీ ప్యాకేజీ లిస్టులో పేరు రాలేదని అధికారులు చెబుతున్నారు. నేను దివ్యాంగురాలిని కావడంతో ఆఫీసుల చుట్టూ తిరిగి నా సమస్యను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. గెజిట్‌లో పేరున్న నాకు ప్యాకేజీ ఎందుకు రాలేదో అధికారులే పరిశీలించి న్యాయం చేయాలి. దయచేసి నాకు రావాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాను. – నడికట్టు తిరుపతమ్మ, దివ్యాంగురాలు, గొట్టిపడియ
అన్ని ఆధారాలున్నా.. పేరు లేదు
నాకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ లిస్టులో నా పేరు రాలేదు. రాజకీయ కారణాల వల్లే నా పేరు ప్యాకేజీ జాబితాలో చేర్చలేదని చెబుతున్నారు. నా అర్హతలు పరిశీలించి నాకు రావాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించి న్యాయం చేయాలి. – అట్లూరి నాగభూషణం, గొట్టిపడియ
వెలిగొండ నిర్వాసితుల ఆగ్రహజ్వాల
కలెక్టర్, అధికారుల వాహనాల ముట్టడి
పోలీసులు, నిర్వాసితుల మధ్య తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు ఇళ్లు ఖాళీ చేయబోమన్న నిర్వాసితులు
అర్హులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ విజయ సునీత హామీ
మార్కాపురం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులు ప్రభుత్వంపై భగ్గుమన్నారు. గురువారం మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన, ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులను గొట్టిపడియ ఎస్సీ కాలనీలో అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన నిర్వాసితులు కలెక్టర్, ఇతర అధికారుల బస్సును, కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. తమ గ్రామంలోకి రావద్దని కరాఖండిగా చెప్పారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు.
ప్రభుత్వం నుంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇంకా చాలామందికి అందలేదని, ఇళ్ల పట్టాల పంపిణీలోనూ తీవ్ర గందరగోళం నెలకొందని గ్రామస్తులు మండిపడ్డారు. అర్హులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు ఇళ్ల పట్టాలు ఇస్తేనే గ్రామాన్ని ఖాళీ చేస్తామని అధికారులకు తేల్చి చెప్పారు. పోలీసులు వచ్చి నిరసనకారులను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో కలెక్టర్ విజయ సునీత నిర్వాసితులతో మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలు, వినతులను పరిశీలించి అర్హులందరికీ పరిహారం, పట్టాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు హామీ ఇచ్చి మీరు వెళ్లిపోయిన తరువాత మా గురించి పట్టించుకోకపోయినా, న్యాయం జరగకపోయినా మాకు ఆత్మహత్యలే శరణ్యమని నిర్వాసితులు కలెక్టర్‌తో చెప్పారు. పూర్తి బాధ్యతతో న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం నిర్వాసితుల్లో కొందరికి పట్టాలు పంపిణీ చేశారు. నిర్వాసితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు.


