నేపాల్‌లో వరద బీభత్సం 25 మంది తెలుగువారు మిస్సింగ్ | 25 Telugu people missing in Nepal flood disaster | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో వరద బీభత్సం 25 మంది తెలుగువారు మిస్సింగ్

Aug 28 2026 5:27 AM | Updated on Aug 28 2026 5:27 AM

25 Telugu people missing in Nepal flood disaster

ఇందులో తెలంగాణ వారు 22 మంది, ఏపీ వారు ముగ్గురు  

వీరి ఆచూకీ కోసం అధికారుల ముమ్మర యత్నాలు 

ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంల ఏర్పాటు  

డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితం  

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: నేపాల్‌లో భారీ వరదల కారణంగా 25 మంది తెలుగు రాష్ట్రాల యాత్రికుల ఆచూకీ తెలియక పోవడంపై ఆందోళన నెలకొంది. అక్కడ చిక్కుకుపోయిన మిగతా వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు చర్యలు వేగవంతం చేశాయి. ఢిల్లీలోని సంబంధిత రాష్ట్రాల భవన్‌ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న వారి యోగక్షేమాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 

నిరంతరం నేపాల్‌ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర ప్రజల వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక నంబర్లు 011–­23384016, 011–23387089తోపాటు వాట్సాప్‌–­9059824101ను అందుబాటులో ఉంచారు. నేపాల్, చైనా సరిహద్దుల్లో బుధవారం సంభవించిన వరదల కారణంగా చిక్కుకుపోయిన ఏపీ యాత్రికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌ సహా హైదరాబాద్‌లోని సచివాలయంలో హెల్ప్‌లైన్‌ ప్రారంభించిన నాటి నుంచి కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి సమాచారం, సహాయం కోరుతూ సుమారు 80 నుంచి 100 కాల్స్‌ అందాయి. 22 మంది ఆచూకీ కోసం అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగుతోందని తెలంగాణ భవన్‌ అధికారులు తెలిపారు.  

బాధితులకు తక్షణ సాయం అందించండి: వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి  
నేపాల్‌ విపత్తుకు ప్రభావితమైన ఏపీకి చెందిన వారికి తక్షణ సాయం అందించడంతో పాటు గల్లంతైన వారి కోసం గాలింపు, రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ను కోరారు. ఈ మేరకు గురువారం విదేశాంగ మంత్రితో పాటు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాశారు. ఏపీకి చెందిన పలువురు గాయపడ్డారని, కొందరు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. తక్షణ వైద్యసాయం అందించడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఏపీకి చెందిన నలుగురు సురక్షితం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు యాత్రికుల సమాచారం హెల్ప్‌లైన్‌కు అందింది. వారిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు అధి­కా­రులు గుర్తించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్‌శాస్త్రి సహా నలుగురు కైలాస మానస సరోవర్‌ యాత్రికులు క్షేమంగా ఉన్నప్పటికీ వరద తీవ్రత వల్ల అక్కడ చిక్కుకుపోయారు. కుప్పానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్‌ గ్రూప్‌ (ఎస్‌–త్రీ) సభ్యులైన శశికుమార్, రాజ్యలక్ష్మి నిమ్మగడ్డ జాడ ఇంకా దొరకలేదని, వారిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ భవన్‌ అధికారులు పేర్కొన్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన చొప్పరపు రమేష్ బాబు, అట్లూరి శశి, నిమ్మగడ్డ రాజ్యక్ష్మితో పాటు కాకినాడ జిల్లాకు చెందిన అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర అనఘ, ప్రకాశం జిల్లాకు చెందిన కందిమళ్ల సుహాసినిరెడ్డి, వెన్నెలగంటి బాలసుబ్రహ్మణ్యం వివరా­లను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. కాగా, నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ సతీష్ రెడ్డి దంపతులు క్షేమంగా ఉన్నట్లు మీడియాకు తెలిపారు. కర్నూలుకు చెందిన డాక్టర్‌ కె.నవంతిరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఈమె ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్, యూరాలజిస్టు డాక్టర్‌ కేజీ గోవిందరెడ్డి సతీమణి. మూడు రోజుల కిందట ఈషా ఫౌండేషన్‌ తరఫున  మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు.  

ఏపీకి చెందిన 41 మంది నేపాల్‌లో చిక్కుకున్నారు  
నేపాల్‌ వరదల్లో ఏపీకి చెందిన 41 మంది చిక్కుకున్నారని, వీరిలో 34 మంది సురక్షితంగా ఉండగా.. మరో ఏడు­గురి ఆచూకీ తెలియాల్సి ఉందని (సాయంత్రానికి వీరి­లో నలుగురి ఆచూకీ తెలిసింది) సీఎం చంద్రబాబు తెలిపా­రు. నేపాల్‌లో భారీ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వా­సు­ల పరిస్థితిపై గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మానస సరోవర్‌ యాత్ర వెళ్లిన ఏపీ యాత్రీకులు యోగక్షేమాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు టిబెట్‌లో సురక్షితంగా ఉన్నారని చెప్పారు. తిరుపతి ప్రాంతానికి చెం­దిన 28 మంది యాత్రికులు ఖాట్మండులో సురక్షితంగా ఉన్నారని అధికా­రులు చెప్పారు. నేపాల్‌లో చిక్కుకు­న్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గా­ల్లో సమన్వయం చేయాలని అధికారులను ఆదే­శించారు. 

కానరాని  83 మంది తమిళుల జాడ  
సాక్షి, చెన్నై: నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న వారిలో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 103 మంది ఉన్నారు. వీరిలో 20మంది సమాచారం మాత్రమే తెలిసింది. మిగిలిన 83 మంది వివరాలు లభించకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి. వారి జాడ కోసం అన్వేషణ మొదలెట్టారు. కైలాస మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన భక్తుల విషయమై మంత్రులు, అధికారులతో తమిళనాడు సీఎం విజయ్‌ సమావేశమయ్యారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్‌  రెసిడెంట్‌ కమిషనర్‌ ఆశిష్ కుమార్‌ నేతృత్వంలోని ఐఏఎస్‌ అధికారుల బృందాన్ని నేపాల్‌కు పంపించారు. 

తమిళనాడు మంత్రులు ఆదవ్‌ అర్జున, రాజ్‌మోహన్,  తెన్నరసు, వినోద్, విదేశీ తమిళుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సతీష్ లను ఢిల్లీకి పంపించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయించేందుకు, రక్షణ చర్యలు పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. నేపాల్‌ వెళ్లిన ఈషా గ్రూపునకు చెందిన 80 మంది సభ్యులు అదృశ్యమయ్యారని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. టిబెట్‌ నుండి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఈ విషాదకర ఘటన వివరాలను ఆయన పంచుకున్నారు. ప్రభావిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించడానికి తాను ఉదయాన్నే బయలుదేరడానికి ప్రయత్నించినప్పటికీ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో అక్కడికి చేరుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement