వాతావరణ మార్పుల ప్రభావమే!  | Climate crisis could be destabilising mountain areas | Sakshi
Sakshi News home page

వాతావరణ మార్పుల ప్రభావమే! 

Aug 28 2026 5:22 AM | Updated on Aug 28 2026 5:22 AM

Climate crisis could be destabilising mountain areas

నేపాల్‌ మెరుపు వరదలపై నిపుణుల అంచనా 

కరుగుతున్న హిమనీ నదాలు 

వర్ష, హిమపాతాల్లో మార్పులు 

పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు 

అన్నీ కలిపి తరచూ ప్రకృతి విపత్తులు

→ జూన్, 2013... కేదార్‌నాథ్‌ క్లౌడ్‌బరస్ట్‌. ఆరువేల మంది మృతి 
→ ఫిబ్రవరి 2021... రిషిగంగ నందాదేవీ వద్ద మంచు అవపాతం... 200 మంది మరణం. రెండు హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు ధ్వంసం. 
→ ఆగస్టు 2025... ఉత్తరకాశీలోని ధరాలి వద్ద ఖీర్‌ గంగాపై క్లౌడ్‌బరస్ట్‌... మెరుపు వరదలతో నలుగురి మరణం. యాభైమంది గల్లంతు. 
→ తాజాగా... నేపాల్‌లో హిమనదం కుప్పకూలి మెరుపు వరదలు.. 
→ వందలాది మంది మృతి.. ఆస్తినష్టం!

హిమాలయ పర్వత ప్రాంతంలో సంభవించిన పై నాలుగు భారీ ప్రకృతి విపత్తులకు కారణం ఏమిటి? వాతావరణ మార్పులే అంటున్నారు హిమనీనదాల నిపుణుడైన మనీశ్‌ మెహతా. కేదార్‌నాథ్, రిషిగంగ, ధరాలి ప్రమాదాలపై దీర్ఘకాలం అధ్యయనం చేసిన ఈయన హిమాలయ పర్వత ప్రాంతాల్లో జరుగుతున్న మార్పులను, ప్రమాద ఘటనలను వేర్వేరుగా చూడలేమని స్పష్టం చేస్తున్నారు.  

భూతాపోన్నతి ఫలితంగా ఈ ప్రాంతంలోని చాలా హిమనీనదాల కుంచించుకుపోతున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనివల్ల ఒక ప్రమాదముంది. మంచు, నీటితో కూడిన ప్రాంతం తగ్గిపోవడం వల్ల అడుగున వదులుగా ఉండే మట్టి, రాళ్లు, శిథిలాలు అలాగే ఉండిపోతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే ఈ ప్రాంతాల్లో నేల స్థిరంగా ఉండదు. 

ఎప్పుడైనా ఆకస్మాత్తుగా భారీ వర్షాలు పడినా, పెద్ద మొత్తంలో మంచు కరిగినా ఈ మట్టి, రాళ్లు చాలా సులువుగా వాలు ఉన్నవైపు వెళ్లిపోతాయి. అతితక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురిస్తే వదులుగా ఉన్న మట్టి, రాతిప్రాంతం త్వరగా నీటితో నిండిపోయి అకస్మాత్తుగా కిందివైపుకు కదులుతాయని, ఇది కాస్తా కొండచెరియలు విరిగిపడేందుకు లేదా రాతి శిథిలాలు దొర్లేందుకు కారణమవుతాయని ఆయన వివరిస్తున్నారు. 

కొన్ని సందర్భాల్లో ఎత్తైన పర్వతప్రాంతాల్లో గడ్డకట్టిన మంచు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటాయని, దీనివల్ల అక్కడ తాత్కాలికంగా ఒక డ్యామ్‌ లాంటి నిర్మాణం ఏర్పడుతుందని చెప్పారు. ఈ తాత్కాలిక అడ్డుగోడ పగిలిపోతే అప్పటివరకూ అక్కడకు చేరిన నీరు, మంచు ఒక్కసారిగా చాలా వేగంగా దిగువ ప్రాంతాలవైపు ప్రయాణిస్తాయని తెలిపారు. 

కేదార్‌నాథ్‌సహా మిగిలిన చోట్ల వచ్చిన విపత్తుల్లోనూ నీటితోపాటు భారీ బండరాళ్లు కూడా దొర్లుకుంటూ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నీరు మాత్రమే ప్రవహిస్తే పుట్టే శక్తికంటే ఇలా రాళ్లతో కూడిన ప్రవాహపు శక్తి చాలా ఎక్కువని... మార్గమధ్యంలో ఉండే రహదారులు, వంతెనలు, భవనాలు ఏవీ తట్టుకోలేవని తెలిపారు. 

వాస్తవానికి హిమాలయ పర్వత ప్రాంతంలో కొండచెరియలు విరిగి పడటం కొత్తేమీ కాదని, కానీ వాతావరణ మార్పుల పుణ్యమా అని ఇప్పుడు ఇలాంటి ఘటనలతో రాగల ప్రమాదాల గురించి పనరాలోచన చేయాల్సి ఉందని ఆయన హెచ్చరించారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలతోపాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ కావడం గమనించదగ్గ మార్పని మెహతా చెబుతున్నారు. 

గతంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా ఎక్కువగా ఉండేదని, ఫలితంగా రాత్రిపూట మంచు కరిగే వేగం తగ్గేదని ఆయన వివరించారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూండటంతో హిమనీనదాలు పగలు, రాత్రి కరుగుతున్నాయని వివరించారు. భూతాపోన్నతితోపాటు హిమనీ నదాలు కుంచించుకుపోవడం, వర్ష, హిమపాతాల్లో వచ్చిన తేడాలు, ఆకస్మిక భారీ వర్షాలు, రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, వదులు మట్టితో కూడిన హిమనీ నదీ గర్భాలు, లోతైన పర్వత సానువులు వంటిని అన్నీ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు పెరిగేందుకు కారణమవుతున్నాయని మనీశ్‌ మెహతా చెబుతున్నారు.  
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement