భారత్‌కు మెడోగ్‌ ముప్పు?  | Nepal Flash Floods Raise Alarm Over China Mega Dam Near Indian Border | Sakshi
Sakshi News home page

భారత్‌కు మెడోగ్‌ ముప్పు? 

Aug 28 2026 5:04 AM | Updated on Aug 28 2026 5:04 AM

Nepal Flash Floods Raise Alarm Over China Mega Dam Near Indian Border

భూకంప జోన్‌లో చైనా భారీ ప్రాజెక్టు 

చిన్నపాటి భూకంపంతోనూ పెను విపత్తు 

నేపాల్‌లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు... వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టమూ తీవ్రంగానే ఉంది. అయితే నేపాల్‌ కాదు కానీ... భారత్‌ ఇలాంటి మరో ముప్పు ముంగిట్లో ఉందా? అవునంటున్నారు నిపుణులు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ఇందుకు కారణమంటున్నారు వారు. మెడోగ్‌ పవర్‌ స్టేషన్‌గా పిలుస్తున్న ఈ భారీ డ్యామ్‌ను 2033లోగా పూర్తి చేసేందుకు చైనా పరుగులు పెడుతోంది. 

యార్లుంగ్‌ సాంగ్పో నదిపై 16,700 కోట్ల డాలర్ల ఖర్చుతో అరవైవేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ యార్లుంగ్‌ సాంగ్పో నదే అరుణాచల్‌ ప్రదేశ్‌లో సియాంగ్‌ నదిగా ఆ తరువాత అసోంలో బ్రహ్మపుత్రగా మారి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. మెడోగ్‌ పవర్‌స్టేషన్‌ నిర్మాణం ఒక రకంగా మన నెత్తిన వాటర్‌ బాంబు లాంటిది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉండటం ఒక కారణమైతే... ఇది భూకంపాలు జరిగే ప్రాంతంలో కడుతూండటం ఇంకో కారణం.

 చైనా భూగర్భ శాస్త్రవేత్తలు నెల రోజుల క్రితమే ఇక్కడ ఒక అధ్యయనం జరిపి.. మెడోగ్‌ పవర్‌స్టేషన్‌ పైజెన్‌ ఫాల్ట్‌పైనే ఉందని తేల్చారు. చిన్నపాటి భూకంపం వచ్చినా దాని ప్రభావం దిగువన ఉన్న మనపై పడుతుంది. యార్లుంగ్‌ సాంగ్పోపై పెత్తనం చైనాదే కావడం... దిగువన మనం ఉండటం భారత్‌ ఆందోళనకు మరో కారణం. ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలలో ఏ చిన్న మార్పు వచ్చినా మనకు వరద ముప్పు తప్పదన్నమాట. 

వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మికంగా భారీ వర్షాలు నమోదైతే అరుణాచల్‌ ప్రదేశ్‌తోపాటు అసోం, టిబెట్‌ ప్రాంతాల్లోనూ ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశముంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు నీటి విడుదల తగ్గి వ్యవసాయానికి సమస్యలొస్తాయి. అయితే... మెడోగ్‌ వపర్‌ స్టేషన్‌తో వచ్చే సమస్యలకు పరిష్కారంగా భారత్‌ సియాంగ్‌ నదిపై 11,000 మెగావాట్ల సియాంగ్‌ అప్పర్‌ బహుళార్థక ప్రాజెక్టును నిర్మిస్తోంది. కాకపోతే ఇదొక్కటే త్రీగార్జెస్‌ డ్యామ్‌ కంటే పెద్దదైన మెడోగ్‌ బలాన్ని తట్టుకోగలదా అన్నది ప్రశ్న!!!       

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement