న్యూఢిల్లీ: రాఖీ పండుగ వేళ ఢిల్లీ, నోయిడాల నుంచి స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే స్తంభించిపోయింది. గురువారం (ఆగస్టు 27) సాయంత్రం నుంచి ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనదారులు దాదాపు 5 నుంచి 6 గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఘజియాబాద్ మీదుగా వెళ్లే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు నోయిడా-గ్రేటర్ నోయిడా, ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రధాన రహదారుల్లోనూ తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
నోయిడా సెక్టార్ 62 నుంచి దాస్నా వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పండుగ షాపింగ్ కోసం మార్కెట్లకు భారీగా జనం తరలిరావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా 10-15 నిమిషాల్లో ప్రయాణించే 4 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 35 నుంచి 40 నిమిషాల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. ట్రాఫిక్ నియంత్రణకు ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను (9643322904) ఏర్పాటు చేశారు. లాల్ కువాన్ వద్ద ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. చిజ్జార్సీ సమీపంలో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
Ghaziabad: Raksha Bandhan की पूर्व संध्या पर Delhi-Meerut Expressway पर लगा भीषण जाम। 🚨🚗 pic.twitter.com/KFDEZhI4c0
— Greater Noida West (@GreaterNoidaW) August 27, 2026
ఘజియాబాద్ నుంచి మీరట్ వెళ్లేవారు దాస్నాకు ముందున్న కనెక్టర్ల ద్వారా ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ, ఘజియాబాద్ వాసులు మురాద్‌నగర్, మోదీనగర్ మీదుగా పాత జాతీయ రహదారిలో వెళ్లవచ్చు. మీరట్ ప్రయాణికుల కోసం ఎన్‌సీఆర్‌టీసీ నమో భారత్ రైళ్ల సర్వీసులను పెంచి ప్రతి 8 నిమిషాలకొకటి చొప్పున 47 అదనపు ట్రిప్పులను నడుపుతోంది.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు అదిరిపడే గుడ్ న్యూస్.. ఇక నో ఫెయిల్!


