అసెంబ్లీలో సీఎం విజయ్‌ కొత్త రూల్‌.. ప్రతిపక్షాల అభ్యంతరం | Vijay Breaks Assembly Tradition Sits Among Ministers Oppositions Object | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో సీఎం విజయ్‌ కొత్త రూల్‌.. ప్రతిపక్షాల అభ్యంతరం

Aug 28 2026 10:05 AM | Updated on Aug 28 2026 12:29 PM

Vijay Breaks Assembly Tradition Sits Among Ministers Oppositions Object

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ గురువారం ఆసక్తికరంగా వ్యవహరించారు. సాధారణంగా స్పీకర్‌ కుర్చీకి సమీపంలో సీఎం కోసం కేటాయించిన ప్రత్యేక సీటులో కూర్చునే ఆయన.. తొలిసారి ఆ స్థానాన్ని వదిలి మంత్రుల వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో అసెంబ్లీలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ కుడివైపున ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీటు ఉంటుంది. ఆయన పక్కనే మంత్రులు వారి సీనియారిటీ ఆధారంగా కూర్చుంటారు. అయితే గురువారం మధ్యాహ్నం సమావేశాల సందర్భంగా విజయ్‌ తన సీటు నుంచి లేచి.. సభా నాయకుడు, మంత్రి కేఏ సెంగొట్టయ్యన్‌, మరో మంత్రి ఆధవ్‌ అర్జున మధ్యలో కూర్చున్నారు. 

ఈ పరిణామంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విజయ్‌ ఇష్టానుసారం వ్యవహరించడం తగదని.. పాలనకంటూ కొన్ని మార్గదర్శకాలు ఉంటాయని.. వాటిని ఆయన పాటించాలని సూచించాయి. అయితే సహచర మంత్రులతో మాట్లాడేందుకే ఆయన ఇలా స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. 

సాధారణంగా మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు తమ సహచరులతో మాట్లాడేందుకు కొద్దిసేపు సీట్లు మారడం కనిపిస్తుంటుంది. కానీ ముఖ్యమంత్రి తనకు కేటాయించిన అధికారిక సీటును వదిలి మంత్రుల కోసం ఉద్దేశించిన సీటులో కూర్చోవడం మాత్రం తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. సభలో అధికారుల గైర్హాజరుపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించారు. కీలక అంశాలపై ఎమ్మెల్యేలు చర్చిస్తున్న సమయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు అసెంబ్లీలోనే ఉండేలా చూడాలని స్పీకర్‌ను కోరారు. గతంలో కరూర్‌ తొక్కిసలాట ఘటనపై చర్చ జరిగినప్పుడు అప్పటి సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు చీఫ్‌ సెక్రటరీ, శాఖల కార్యదర్శులు సభలో ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం, ఉన్నతాధికారులు సభలో కనిపించడం లేదని విమర్శించారు.

దీనిపై మంత్రి ఆధవ్‌ అర్జున స్పందిస్తూ.. అధికారులు పక్కనే ఉన్న ‘వార్‌ రూమ్‌’లో ఉండి, సభ్యుల ప్రసంగాలను నోట్‌ చేసుకుంటున్నారని తెలిపారు. అయితే ఉదయనిధి సూచనతో ఏకీభవించిన స్పీకర్‌.. అసెంబ్లీ సమావేశాల సమయంలో సీనియర్‌ అధికారులు సభలోనే ఉండేలా ఆదేశిస్తామని చెప్పారు. అంతకుముందు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం విజయ్‌.. ఆ తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు.

ఇదీ చదవండి: రాఖీ పండుగను రాజకీయం కోసం వాడేసుకుంటున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement