'మోహన్‌లాల్‌తో పెళ్లి.. నాన్న ముందే వార్నింగ్ ఇచ్చారు' | Suchitra Mohanlal recalls her father warning before marriage to Mohanlal | Sakshi
Sakshi News home page

Suchitra Mohanlal: 'మోహన్‌లాల్‌తో పెళ్లి.. ఇంట్లోకి రానివ్వనని చెప్పారు'

Aug 26 2026 5:22 PM | Updated on Aug 26 2026 7:17 PM

Suchitra Mohanlal recalls her father warning before marriage to Mohanlal

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి పరిచయం ‍అక్కర్లేదు. మలయాళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. జనతా గ్యారేజ్‌ మూవీతో టాలీవుడ్‌లో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తోన్న మోహన్ లాల్..ఈ ఏడాది  దృశ్యం-3 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మోహన్ లాల్.. రజినీకాంత్ హీరోగా వస్తోన్న జైలర్-2లో కనిపించనున్నారు.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే..పర్సనల్‌ లైఫ్‌లో ఆయన సుచిత్ర బాలాజీని పెళ్లాడారు. 1988 వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం లేని సుచిత్ర.. మోహన్‌ లాల్‌తో పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూకు హాజరైన సుచిత్ర..మోహన్ లాల్‌తో తన రిలేషన్‌ గురించి మాట్లాడారు. వీరిద్దరు మొదటిసారి ఎలా కలుసుకున్నారో గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా పెళ్లికి తన తండ్రి ఇచ్చిన సలహాను కూడా పంచుకున్నారు.

తాను మోహన్‌లాల్‌ను మొదటిసారి ఓ పెళ్లిలో కలిశానని సుచిత్ర వెల్లడించారు. అప్పటికే మా కుటుంబాలకు పరిచయం ఉండటంతో ఆయనను కలిసే అవకాశం వచ్చిందని తెలిపింది. తాను కూడా ఒక అభిమానిగానే  ఆయనతో ఒక ఫోటో దిగానని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆ ఫోటో కాపీ తనకు ఇప్పటికీ అందలేదని సుచిత్ర వెల్లడించారు. ఆ తర్వాత సుచిత్ర తాను మోహన్‌లాల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తన కుటుంబంతో చెప్పగా.. నా ఆలోచనకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. తన తండ్రికి బాగా తెలిసిన నటి సుకుమారి ద్వారా ఈ పెళ్లి ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని భావించానని పేర్కొంది. 

మోహన్‌లాల్‌తో పెళ్లికి ముందే తన తండ్రి హెచ్చరించారని సుచిత్ర వెల్లడించింది. నువ్వు అతన్ని పెళ్లి చేసుకునే ముందే ఒకసారి ఆలోచించుకో అన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావని వార్నింగ్ ఇచ్చారు. కొన్నిసార్లు ఆయన ఇంట్లోనే ఉంటాడు.. కొన్నిసార్లు షూటింగ్‌కు వెళ్లి నెలల రోజుల వరకు తిరిగి రాడని నాన్న అన్నారు. అలాంటప్పుడు నువ్వు అన్నింటికీ సిద్ధంగా ఉండాలని.. పైగా ఇండస్ట్రీలో మనం చాలా విషయాలు వింటాం.. వాటన్నింటినీ కూడా తట్టుకోగలగాలని చెప్పారు. మీ అమ్మ చాలా ప్రశాంతమైన వ్యక్తి.. మీ అమ్మ అన్నింటినీ ఎలా సర్దుకుపోతుందో నువ్వు చూస్తూనే ఉన్నావ్ కదా.. నువ్వు కూడా అలాగే ఉండాలని సలహా ఇచ్చాడు. కానీ నీ పెళ్లయ్యాక తిరిగి వచ్చి నాన్న, ఆయన ఇలా ఉంటాడు, అలా ఉంటాడని నా దగ్గర ఏడిస్తే.. నేను నిన్ను మళ్లీ ఇంట్లోకి కూడా రానివ్వనని చెప్పాడని గుర్తు చేసుకుంది. అందుకే పెళ్లి విషయంలో అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో అని నాన్న చెప్పారని సుచిత్ర వెల్లడించింది.

అయితే భర్తగా మోహన్‌లాల్‌పై ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని కూడా సుచిత్ర వెల్లడించారు. మా వివాహం తర్వాత  తండ్రికి, మోహన్‌లాల్‌కి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు.  నా కూతురిని ఇంత బాగా చూసుకుంటూ.. నువ్వు ఆమెను చెడగొట్టావని మా నాన్న మోహన్‌లాల్‌తో అన్నారు. ఏది ఏమైనప్పటికీ.. మీరు చూసుకున్న దానికంటే నేను ఇంకా బాగా చూసుకోవద్దా? మోహన్‌లాల్ అని అన్నారని తెలిపింది. మోహన్‌లాల్ తనకు దక్కాల్సిన గౌరవాన్ని ఎల్లప్పుడూ ఇచ్చారని ఆమె వివరించారు. కాగా.. సుచిత్ర- మోహన్‌లాల్‌ పెళ్లి ఏప్రిల్ 28, 1988న జరిగింది. వీరికి కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్, కుమార్తె విస్మయ మోహన్‌లాల్ ఉన్నారు. కాగా.. సుచిత్ర తండ్రి కె బాలాజీ తమిళంలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement