న్యూఢిల్లీ: వివాహ వ్యవస్థ చాలా విచిత్రమైందని, భార్యాభర్తల మధ్య వివాదాలు తొందరగా సమసిపోకుంటే బెటర్ హాఫ్ కాస్తా బిటర్‌హాఫ్‌గా మారిపోతారని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మానవ సంబంధాల్లో భార్యా భర్తల సంబంధం చాలా అందమైందని, కానీ తేడాలొస్తే అంతే వికారంగానూ మారుతుందని జస్టిస్ విమల్ కుమార్ యాదవ్ తెలిపారు. భార్యను చంపేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై నఫే సింగ్ అనే వ్యక్తికి ట్రయల్‌కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను నిలిపివేశారు. నిందితుడి అప్పీల్‌పై విచారణకు ఓకే అన్నారు.
అంతేకాకుండా... నిందితుడు హత్యాయత్నం చేశాడనేందుకు తగిన సాక్ష్యాలూ ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని స్పష్టం చేశారు. నఫే సింగ్‌కు 2000లో వివాహమైంది. ఏడాది పాటు అంతా సవ్యంగానే సాగింది కానీ ఆ తరువాత భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2001లో ఒకానొక వివాదం సందర్భంగా భార్యతో బలవంతంగా కీటకనాశిని బేగాన్ స్ప్రే తాగించే ప్రయత్నం చేశాడని, అది కాస్తా ఫలించకపోవడంతో బలవంతంగా నోట్లో పోసి చంపేసే ప్రయత్నం చేశాడని నఫే సింగ్, అతడి తల్లిపై కేసు నమోదైంది.
వితంతువైన తల్లిని వదిలేసి వేరు కాపురం పెడదామన్నదే భార్యతో వచ్చిన వివాదమని, తాను ఎలాంటి హత్యాయత్నానికీ పాల్పడలేదని నఫే సింగ్ మొత్తుకున్నా ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు. దోషిగా నిర్ధారిస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో నఫే సింగ్ ఆ తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.


