భార్య హత్య కేసులో ట్విస్ట్‌.. స్క్రూ మేకుతో బయటపడ్డ భర్త బండారం! | Shocking Incident In Akividu | Sakshi
Sakshi News home page

భార్య హత్య కేసులో ట్విస్ట్‌.. స్క్రూ మేకుతో బయటపడ్డ భర్త బండారం!

Aug 25 2026 12:53 PM | Updated on Aug 25 2026 1:21 PM

Shocking Incident In Akividu

ఏలూరు జిల్లా: ఎలాంటి ఆధారాలు దొరక్కుండా భార్యను హత్య చేసి, ఉప్పుటేరులో పడేసి చేతులు దులుపుకోవాలనుకున్న భర్త పన్నాగం పది రోజులకు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మెడికల్‌ స్క్రూ మేకు ఇచ్చిన కీలక ఆధారంతో పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. ఈ హత్యోదంతానికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్‌ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

ఘటన వివరాలు ఇలా.. 
భీమవరం టూటౌన్‌లోని వంశీకృష్ణ అపార్ట్‌మెంట్‌లో ఉప్పాడ నారాయణరావు, దేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉండగా, ఆమె అమెరికాలో ఉంటున్నారు. చేపల కమిషన్‌ వ్యాపారం చేసే నారాయణరావు అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పాటు అనుమానాలు పెరిగాయి. కుటుంబ సభ్యులను దూషించడం, శారీరకంగా దగ్గరకు రానివ్వకపోవడం వంటి విషయాలతో కక్ష పెంచుకున్న నారాయణరావు.. ఈ నెల 8న వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లి, 14న తిరిగి ఇంటికి వచ్చాడు. 

అదే రోజు రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగగా, భార్యను నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి తన మారుతి కారు (ఏపీ 37 సీఎల్‌ 1499)లో మృతదేహాన్ని ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వంతెన వద్దకు తీసుకెళ్లాడు. మందపాడు వెళ్లే రోడ్డు వైపు వెళ్లి ఉప్పుటేరులో పడేసేందుకు ప్రయతి్నంచగా, మృతదేహం గట్టుపైనే పడిపోయింది. దీంతో కారును ముందుకు పోనిచ్చి, అక్కడి నుంచి తిరిగి భీమవరానికి వెళ్లిపోయాడు. 

విస్తృత దర్యాప్తు.. 
మహిళ మృతదేహంపై పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీమ్, వేలిముద్రల నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌ నేరస్థలాన్ని పరిశీలించాయి. డాగ్‌ స్క్వాడ్‌ సమీపంలోని చెరువు గట్టు ప్రాంతం వరకు వెళ్లి ఆగిపోయింది. నిందితుడు ఆ ప్రాంతంలో కారును వెనక్కి తిప్పడంతో అక్కడివరకే జాగిలం వెళ్లినట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలకు ఆదేశించారు. ఆయా బృందాలు ఉభయగోదావరి, కృష్ణ, ఇతర ప్రాంతాల్లో పర్యటించి విచారణ చేశారు. 

స్క్రూ మేకుతో బయటపడిన నిజం 
మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి రెండు రోజులు మార్చురీలో ఉంచారు. పోస్టుమార్టంలో ఆమె ఎడమ కాలుకు స్టీల్‌ రాడ్డు, సర్జికల్‌ స్రూ్కలు ఉండటాన్ని గుర్తించారు. వాటిని పరిశీలించగా.. ఇంప్లాంట్‌ తయారీ కంపెనీ ’దాల్‌ అండ్‌ సన్స్‌’గా తేలింది. ఆ స్టీల్‌ రాడ్, స్రూ్కలను హైదరాబాద్‌లోని సుశీల ఆసుపత్రికి పంపినట్లు నిర్ధారించుకుని ఆరా తీయగా.. 2023 జనవరిలో భీమవరానికి చెందిన ఉప్పాడ దేవికి వాటిని అమర్చినట్లు వెల్లడైంది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించగా తాళం వేసి ఉంది. దీంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. 

నిందితుడి అరెస్ట్‌ 
తరచూ గొడవలు పడటంతో పాటు కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించడం, శారీరకంగా దగ్గరకు రాకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు నారాయణరావు అంగీకరించాడని అదనపు ఎస్పీ తెలిపారు. ఈ నెల 23న రాత్రి 7:15 గంటలకు ఆకివీడు పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిందితుడిని అరెస్ట్‌ చేసి, నేరానికి ఉపయోగించిన కారును సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన డీఎస్పీ రఘువీర్‌ విష్ణు, ఆకివీడు సీఐ కాళీచరణ్, ఎస్సై కే శుభశేఖర్, కాళ్ల ఎస్సై ఏ గణేశ్‌కుమార్, ఉండి ఎస్సై మల్లికార్జునరావు తదితర సిబ్బందిని ఆయన అభినందించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement