కరీంనగర్ జిల్లా: తల్లి ఇంట్లో చనిపోతే దోషం వల్ల ఇల్లు వదలాల్సి వస్తుందన్న మూఢనమ్మకంతో కొడుకులే ఆమెను బావిలో పడేసి హత్య చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై హుజూరాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ విలేకరులకు తెలిపిన వివరాలివి.
సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ (80)కు నలుగురు కుమారులు సమ్మయ్య, కుమారస్వామి, రవీందర్, శ్రీనివాస్. వెంకటమ్మ వయోభారం, అనారోగ్యంతో మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉండేది. ఇంట్లో చనిపోతే దోషం వల్ల ఇల్లు వదలాల్సి వస్తుందని, ఎవరి ఇంట్లో చనిపోయినా దోషం పట్టుకుంటుందని పెద్ద కుమారుడు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ భావించారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటమ్మను వ్యవసాయ బావిలో వేసి హత్య చేశారు.
మర్నాడు తమ తల్లి కనిపించడం లేదని గ్రామంలో వెతికారు. కాగా, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు వ్యవసాయ బావి వద్దకు ఎలా వెళ్తుందన్న అనుమానంతో పాటు కొడుకుల ప్రవర్తనపై పోలీసులు విచారించారు. ఇంట్లో చనిపోతే కీడు సోకుతుందని మూఢనమ్మకంతో తల్లిని బావిలో వేసి హత్య చేసినట్లు సమ్మయ్య, శ్రీనివాస్ విచారణలో ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.


