సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పండుగకు కేవలం 20 రోజుల సమయే ఉండగా..మట్టి గణపతి విగ్రహాల పంపిణీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎలాంటి కదలిక లేదు. పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసి ప్రజల్లో అవగాహన పెంచేందుకు, పొల్యూషన్‌ను అడ్డుకునేందుకు ప్రతి ఏటా పీసీబీ లక్షల సంఖ్యలో మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటుంది. ఈమేరకు దాదాపు రెండు నెలల ముందుగానే విగ్రహాల తయారీ, టెండర్లు, కాంట్రాక్టర్లకు అప్పగింత వంటి పనులు మొదలవ్వాలి.
ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉండగా..ఇప్పటికీ టెండర్లే పిలవలేదు. దీంతో విగ్రహాల పంపిణీ ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టెండర్ల ప్రక్రియను తూతూ మంత్రంగా మార్చేందుకే ఇలా జాప్యం జరుగుతోందన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. గత ఏడాది కూడా విగ్రహాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారం ఆలస్యమై చివరి నిమిషం వరకు గందరగోళం ఏర్పడింది. దాన్ని అనుభవంలోనికి తీసుకునైనా ఈ ఏడాది అధికారులు స్పందించడం లేదు.
లక్ష్యం 3.26 లక్షలు
పీసీబీ ఈ ఏడాది 3,26,471 మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ గుత్తేదారుల నుంచి టెండర్లు పిలవడంలో ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయింది. టెండర్లు తెరిచి తక్కువకు కోట్(ఎల్–1) చేసిన వారికి సరఫరా బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఉన్న ఈ తక్కువ సమయంలో ఎల్–1 గుత్తేదారుకు 3.26 లక్షల విగ్రహాల తయారీ, పంపిణీ సాధ్యమయ్యే వి షయమేనా అన్నదే అసలు సమస్యగా కనిపిస్తోంది.
40 శాతం గోల్‌మాల్..
గత ఏడాది పీసీబీ అధికారులు 2.20 లక్షల విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. సరిపడా సమయం లేకపోవడంతో చివరి క్షణంలో ఎల్–1 గుత్తేదారు మొత్తం మేం సరఫరా చేయలేమని చెప్పడంతో అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. టెండరులో పాల్గొన్న అందరిని పిలిచి సనత్‌నగర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరు ఎన్ని విగ్రహాలను సరఫరా చేయగలరో అన్ని ఇవ్వండని సూచించారు. దీంతో సుమారు 40 శాతం మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయకుండానే అక్రమంగా బిల్లులు పొందారని పీసీబీ సిబ్బంది పేర్కొంటున్నారు. ‘దేవుడి విగ్రహాల విషయంలో ఇలా చేస్తారని అనుకోలేదు. నమ్మకంతో అప్పగిస్తే కాకిలెక్కలు చెప్పారు’ అని ఓ ఉన్నతాధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు.


