ఎస్‌ఐఆర్‌లో లక్షల ఓట్లు పోతుండటం ప్రమాదకరం... ఒక్క ఓటూ పోనివ్వకండి
ఎస్‌ఐఆర్‌లో పార్టీ నేతల పనితీరును బట్టే టికెట్లు ఇస్తాం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి దిశానిర్దేశం
కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందన్న పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచి్చంది కేవలం 2 శాతం ఓట్ల తేడాతోనేనని.. ఇప్పుడు లక్షల ఓట్లను ఎన్నికల సంఘం ద్వారా కేంద్రం మాయం చేస్తోందని.. ఇది చాలా ప్రమాదకరమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహా రాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూ డా పోకుండా పార్టీ నాయకత్వం తగిన చర్యలు తీసుకోవా లని ఆమె ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ రెండో దశపై సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ‘జూమ్’సమావేశం జరిగింది.
పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎస్‌ఐఆర్ అసెంబ్లీ, పార్లమెంటు సమన్వయకర్తలు, డీసీసీ అ«ధ్యక్షులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె దిశానిర్దేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఏం జరిగిందన్న దానిపై ప్రత్యేక నివేదికలు తయారు చేస్తామని చెప్పారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమయంలో బాగా పనిచేసే వారికే మళ్లీ టికెట్లు ఇస్తామ ని.. పనిచేయకుండా టికెట్ ఇవ్వాలంటే కుదరదని మీనాక్షి స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ను, రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కుట్రను గమనించి ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పనిచేయాలన్నారు.
ఎస్‌ఐఆర్‌లో నిర్లక్ష్యం వద్దు: మహేశ్‌కుమార్‌గౌడ్
పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందువల్ల నేతలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని.. రెండోదశలో మరింత చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ నెల 27న జరిగే సభలు కీలకమన్నారు. పార్టీ నేతలు జాగ్రత్తగా లేకపోతే నష్టపోతామని హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి ఓటును పరిశీలించాలని చెప్పారు. ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జీలు, డీసీసీ అధ్యక్షులు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అదే పనిలో నిమగ్నం కావాలని ఆదేశించారు.
ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి
ఎమ్మెల్యేల పనితీరుపై మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల కోసం అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా నేతల జాబితాలను పంపాలని కోరినా ఎందుకు పంపలేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. మండల కమిటీలన్నింటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని.. సహకార సంఘాల కమిటీల ప్రతిపాదనలను కూడా వెంటనే పంపాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలను మహేశ్‌గౌడ్ కోరారు. ఈ భేటీలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎస్‌ఐఆర్ రాష్ట్ర సమన్వయకర్త గంపా వేణుగోపాల్, టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ రాజేశ్ పాల్గొన్నారు.
మంత్రి సురేఖ అంశం ఏఐసీసీ చూస్తోంది
మెదక్ జోన్: పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని.. మంత్రి కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక పీసీసీ, ఏఐసీసీకి అందిందన్నారు. త్వరలోనే ఏఐసీసీ పెద్దలు తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఉమ్మడి జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రావు, పార్టీ నేతలు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.


