ఢిల్లీ పెద్దల నిర్ణయానికి మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ బదిలీ
ఎవరూ మాట్లాడొద్దని, ఫుల్‌స్టాప్ పెట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచన
ప్రాథమిక నివేదిక ఇచ్చిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
ఏఐసీసీకి నివేదిక పంపనున్న మీనాక్షి, మహేశ్‌గౌడ్
త్వరలోనే రాష్ట్ర పార్టీ నేతలకు హస్తిన పిలుపు..
సీఎం, పీసీసీ చీఫ్ అభిప్రాయం మేరకు నిర్ణయం?
సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో భేటీలోనూ చర్చ
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోర్టులోకి చేరింది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంటుందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు తగినట్టుగానే సోమవారం రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అటు విలేకరుల సమావేశంలోనూ ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలోనూ సురేఖ అంశంపై స్పందించారు. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని విలేకరుల సమావేశంలో చెప్పిన ఆయన.. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని సూచించారు. ‘పాజిటివ్ వద్దు.. నెగెటివ్ వద్దు.. సురేఖ ఎపిసోడ్ గురించి మాట్లాడొద్దు.. ఫుల్‌స్టాప్ పెట్టండి... విషయం హైకమాండ్ దగ్గరకు వెళ్లింది కదా. వారు నిర్ణయం తీసుకోవాలి.’అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులకు సురేఖ సమాధానంపై ప్రాథమిక నివేదికను పార్టీకి అందజేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లకు కమిటీ చైర్మన్ మల్లురవి సోమవారం ప్రాథమిక నివేదికను అందజేశారు. సుస్మిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా సుస్మిత, సురేఖల అంశంపై పీసీసీ నుంచి కూడా ఏఐసీసీకి ఓ నివేదిక వెళుతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పార్టీ పెద్దలకు హస్తిన నుంచి పిలుపు వస్తుందని, అక్కడ జరిగే చర్చలో సీఎం, పీసీసీ చీఫ్‌ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది.
నాడు అడ్డుకున్నదెవరు?
ఈ ఎపిసోడ్‌లో మరో ఆసక్తికర అంశం వెలుగులోనికి వచ్చింది. గతంలో కూడా సురేఖ కుమార్తె సుస్మిత తననుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీఎం రేవంత్ చాలా సీరియస్‌గా తీసుకున్నారని, ఈ అంశంపై అధిష్టానం దగ్గర చర్చ జరిగినప్పుడు కొండా కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అడ్డుకున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతోనే మరోమారు సుస్మిత సీఎం మీద మాట్లాడగలిగారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి తాను కూడా కాపాడలేనని ఇటీవల మహేశ్‌గౌడ్ నిజామాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని వారంటుండడం గమనార్హం. కాగా, కొండా సురేఖ ఎపిసోడ్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిల మధ్య కూడా చర్చకు వచ్చింది. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో తెలంగాణ రైజింగ్–2027 సమీక్షకు ముందు తాజా రాజకీయ వివాదం గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం.
సురేఖ విఫలమయ్యారు: క్రమశిక్షణ కమిటీ
విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి కొండా సురేఖపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సురేఖ కుమార్తె సుస్మిత పదేపదే సీఎంను కించపరిచేలా, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతుంటే ఆమెను నియంత్రించడంలో సురేఖ విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. తాము సుస్మిత మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను క్షుణ్ణంగా పరిశీలించామని, సురేఖ సమాధానాలను కూడా పరిశీలించామని, అన్నింటినీ పరిశీలించిన మీదట క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సురేఖ అర్హురాలని, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఏఐసీసీ నిర్ణయమని టీపీసీసీ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.


