పంపిణీ చేయడానికి అధికారులు సరిపోరా అని ప్రశ్నించిన హైకోర్టు
భూములిచ్చిన దేశ నిర్మాతలకు పరిహారం మాటేంటి?
సంక్షేమం ఎప్పుడూ అవసరానికి ఆధారంగా ఉండాలి
కల్యాణలక్ష్మి పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు
వికలాంగ యువతుల వివాహ పథకానికి స్టే నుంచి మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీలో రాజకీయ నాయకుల జోక్యం అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని చట్టంలోగానీ, రాజ్యాంగంలోగానీ ఉందా అని అడిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తాత్కాలిక స్టేను సవాల్ చేస్తూ శాసనసభ్యులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ల(ఐఏ)పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. ఆ నగదు ప్రజాధనం నుంచి వస్తుంది కదా.. దానికి, ప్రజాప్రతినిధులకు ఏం సంబంధమని, వాటిని పంపిణీ చేయడానికి అధికారులు సరిపోరా అని నిలదీసింది. ప్రాజెక్టులు, రహదారులు, ఇతర ప్రజావసరాలకు భూములిచ్చిన దేశ నిర్మాతలైన రైతులకు పరిహారం చెల్లింపు మాటేంటని ప్రశ్నలు సంధించింది. రాజధానిలో రహదారులు, సిగ్నళ్ల వద్ద చిన్నారులు, మహిళలు యాచిస్తున్నారని, భావి భారత పౌరుల సంక్షేమం పట్టదా, వీరు సంక్షేమం పరిధిలోకి రారా అని వ్యాఖ్యానించింది. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఖర్చు చేసే ప్రతీ పైసాకు చట్టబద్ధత అవసరమని స్పష్టం చేసింది. అనంతరం.. పూర్తి వివరాలు అందజేసేందుకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అనుమతించిన ధర్మాసనం, తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం.. పథకాల చెల్లింపుల జీవోలపై స్టే ఇచ్చిన విషయం విదితమే. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.
ప్రజాధనం పంపిణీకి ఎమ్మెల్యేలు ఎందుకు?
సంబంధిత జీవో ప్రకారం.. లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గ ఎమ్మెల్యే కౌంటర్ సైన్ చేయాలని ఇంప్లీడ్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది వివరించారు. జీవోలను రద్దు చేయలేదని, సస్పెండ్ చేయలేదని, ఎమ్మెల్యేలను కేసులో ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ వంటి ప్రక్రియలను అధికారులు నిర్వహిస్తున్నప్పుడు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేల పాత్ర ఎందుకని నిలదీశారు. ప్రజాధనం పంపిణీలో రాజకీయ జోక్యానికి తావు ఉండకూడదని.. ఎమ్మెల్యేలు వెళ్లి చెక్కులు ఇవ్వడం వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటో చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలను వ్యతిరేకించడం లేదని, అవసరమైన వారికి సంక్షేమ ప్రయోజనాలు అందాల్సిందేనని పేర్కొన్నారు. అమలు విధానమే చట్టబద్ధంగా ఉండాలని చెబుతున్నామన్నారు.
పరిహారం కోసం 8 నెలలుగా...
భూసేకరణ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 నెలలుగా అందరూ ఎదురు చూస్తున్నారని.. అభివృద్ధి కోసం సొంత ఇళ్లు, భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాంటి రైతులు, ఇతరులతోనే దేశ నిర్మాణం సాగుతోందని చెప్పారు. భూసేకరణ బాధితుల పరిహారం చెల్లింపులు ఏ దశలో ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశించారు. ఎవరైనా సామాజిక సంక్షేమం కింద ప్రయోజనం కోరితే, అది అవసరానికి అనుగుణంగా ఉండాలని.. సంక్షేమం ఎప్పుడూ అవసరంపై ఆధారపడాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నిరాశ్రయులు, నిరుపేదలు, బాలలు, మహిళలు వంటి అనేక వర్గాలు సంక్షేమం కోసం ఎదురుచూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో భిక్షాటన చేస్తున్న పిల్లలున్నారు.. ఆధార్ కార్డు కూడా లేని చిన్నారులున్నారు.. నిరాశ్రయ మహిళలున్నారు. వారందరూ సామాజిక సంక్షేమ పరిధిలోకి వస్తారని వ్యాఖ్యానించారు. వికలాంగ యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించే జీవో 4ను తాత్కాలిక స్టే నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయండి..
న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపిస్తూ.. తెలుగు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘తెలుగు స్క్రైబ్’ను మొత్తంగా నిలిపివేయాలని కోరారు. ఆ ఖాతా నిర్వాహకుడి వివరాలు తెలియడం లేదని, అతనిపై 50కి పైగా క్రిమినల్ కేసులున్నాయని, అతడి చిరునామా తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రవాద నిరోధక చట్టాల నిబంధనల కింద కూడా ప్రయత్నాలు చేశారన్నారు. దీనిపై మెటా తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ పేర్కొన్న యూఆర్‌ఎల్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, పథకాల అమలుపై సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని, పేద యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై త్వరలో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.


