కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో ఎవరి వాదన వారిదే
అక్టోబరు 31 వరకు అవసరమైన 47 టీఎంసీలు కేటాయించాలన్న ఏపీ ఈఎన్‌సీ
అంతే స్థాయిలో తమకూ కేటాయించాలన్న తెలంగాణ ఈఎన్‌సీ
దీనిపై ఏపీ ఈఎన్‌సీ అభ్యంతరం
మళ్లీ సెప్టెంబరు 4న చర్చించాలని నిర్ణయం
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల ఈఎన్‌సీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నీటి కేటాయింపులపై చర్చించేందుకు సెప్టెంబరు 4న మళ్లీ సమావేశం నిర్వహిస్తామని త్రిసభ్య కమిటీ కనీ్వనర్ అయిన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి.. నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు చైర్మన్‌కు సిఫార్సు చేసేందుకు సోమవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి సతీష్ కాంబోజ్, ఏపీ ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి, తెలంగాణ ఈఎన్‌సీ రమేష్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అక్టోబరు 31 వరకు తమ రాష్ట్ర అవసరాలకు 47 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఈఎన్‌సీ కోరారు. అలాగే, వచ్చే ఏడాది జూన్ వరకూ 112 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది జూన్ వరకూ గంపగుత్తగా కాకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల నుంచి ఎంతమేరకు నీటి అవసరమో చెప్పాలని కోరారు. దాంతో అక్టోబరు 31 వరకు తమకు కూడా 47 టీఎంసీలు కేటాయించాలని, ఉమ్మడి ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాల్లో తమకు 50 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు.
దీనిపై ఏపీ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాల్లో 70 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌కు, 30 శాతం వాటా తెలంగాణకు కేటాయిస్తూ గతంలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. తమకు 50 శాతం వాటా కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ జోక్యం చేసుకుంటూ.. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సెప్టెంబరు 4న మళ్లీ నిర్వహిస్తామని.. అప్పుడు నీటి లభ్యత, అవసరాలు, కేటాయింపులపై చర్చించి, నిర్ణయం తీసుకుందామన్నారు. ఇందుకు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు అంగీకరించారు.


