ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
ఏకతాటిపై పోరాడుదాం
ఐక్య పోరాటాలకు ఏపీ ఎన్జీవో, ఇతర సంఘాలు కలిసి రావాలి
28న జరిగే రాష్ట్ర సదస్సు పోస్టర్, కరపత్రం విడుదల
పీఆర్సీ, 30 శాతం ఐఆర్, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు ఇవ్వాలి
రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల డిమాండ్
సాక్షి,అమరావతి: న్యాయమైన హక్కుల సాధనకు, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు, రూ.40 వేల కోట్ల బకాయిలను సాధించుకునేందుకు రాష్ట్రంలోని ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఈ నెల 28న విజయవాడలో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు పోస్టర్, కరపత్రాలను ఇతర నాయకులతో కలిసి సోమవారం ఆయన విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో నాయకత్వం కూడా ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. గతంలో మాదిరిగా ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య ఉద్యమ కార్యాచరణ రూపొందిద్దామని తెలిపారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘంతోపాటు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయ జేఏసీ కూడా ఐక్య ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా, వినతిపత్రాలు ఇచ్చినా, చర్చలకు హాజరైనా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తమ సమస్యలపై కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలవుతాయని ఇంతకాలం ఓపికతో ఎదురు చూశామని, అయితే దీన్ని ఉద్యోగుల బలహీనతగా చూడకూడదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కాలయాపన చేయడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని తెలిపారు. తాము చేసే ఉద్యమం కేవలం బకాయిల కోసం చేసే పోరాటం కాదని, ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తు కోసం చేసే పోరాటమని ఏపీ జేఏసీ అమరావతి నేత ఫణి పేర్రాజు చెప్పారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఉద్యోగుల ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు. ఈ నెల 28న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి మహిళా నేతలు పి.లక్ష్మి, పి విజయలక్ష్మి కోరారు.
ఇవీ ఉద్యోగుల డిమాండ్లు
– పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, ఆ వెంటనే పీఆర్సీ ఇవ్వాలి.
– పీఆర్సీ వచ్చే వరకు ఐఆర్ 30 శాతం ఇవ్వాలి.
– పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు వెంటనే ఇవ్వాలి.
– పోలీసుల సరెండర్ లీవ్స్ బకాయిలు చెల్లించాలి.
– జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోద యోగ్య పరిష్కారం చూపాలి.
– అత్యవసర అవసరాలకు జీపీఎఫ్ విత్‌డ్రాకు వెంటనే అనుమతివ్వాలి.
– రిటైర్‌మెంట్ ప్రయోజనాలు (జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ లైఫ్ ఇన్సూ్యరెన్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్) వెంటనే అందాలి.
– పెన్షనర్ల కోసం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి.
– పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
– కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి.
– మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి.


