బ్లాక్‌మెయిల్‌ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు | Soujanya Suicide Letter Viral | Sakshi
Sakshi News home page

బ్లాక్‌మెయిల్‌ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు

Aug 25 2026 5:31 AM | Updated on Aug 25 2026 5:31 AM

Soujanya Suicide Letter Viral

సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న సౌజన్య లేఖ 

ఆ లేఖలో సాధిక్‌ క్రూరత్వాన్ని వివరించిన సౌజన్య! 

తన భర్తను చంపేయడానికి ఓ రసాయనాన్ని తెచ్చాడని వెల్లడి 

అతనికి పోలీసులతో సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్న సౌజన్య 

అందుకే బయటకి చెప్పుకోలేకపోయానని ఆవేదన 

మతం పిచ్చి, ఆడవాళ్ల పిచ్చి ఉన్న సాధిక్‌తో ప్రతి మహిళ జాగ్రత్తగా ఉండాలని సూచన

కాకినాడ క్రైం: ‘సాధిక్‌ ఖాన్‌ నన్ను బ్లాక్‌మెయిల్‌ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు.. నన్ను మతం మార్పించడానికి, నా ఆస్తి కోసం వేధించేవాడు’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య మరణానికి ముందు రాసినట్లుగా భావిస్తున్న లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ లేఖలో సాధిక్‌ క్రూరత్వాన్ని వివరించింది. సాధిక్‌ తన కుమారుడు రియో సాయంతో తనకు దగ్గరయ్యాడని తెలిపింది. తన బిడ్డ చదివే స్కూల్‌లో చేరాడని, చెప్పిన మాట వినకపోతే రియోను కిడ్నాప్‌ చేస్తానని బెదిరించేవాడని పేర్కొంది. తన ప్రైవేటు విషయాలతో బ్లాక్‌మెయిల్‌ చేశాడని, ప్రశ్నిస్తే కొట్టాడని తెలిపింది. తన భర్త కూడా సాధిక్‌కు భయపడేవాడని తెలిపింది. తన భర్తను చంపేయడానికి ఓ రసాయనాన్ని తెచ్చాడని పేర్కొంది. 

తన ప్రతి ఫోన్‌ కాల్‌ను పరిశీలించేవాడని తెలిపింది. అతడి కన్ను తన ఆస్తిపై ఉందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించానని పేర్కొంది. తన ఆస్తి పత్రాలు, లాకర్‌ కూడా అతని ఆధీనంలో పెట్టుకున్నాడని, అతనికి పోలీసులతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఎవరికీ చెప్పుకోలేకపోయానని వివరించింది. తనను ఇస్లాంలోకి మారాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఇస్లాం మత పుస్తకాలు చదవమని, రాయమని బెదిరించేవాడని పేర్కొంది. చాలాసార్లు మనోవేదనకు గురై చనిపోదామనుకుంటే బిడ్డ గుర్తొచ్చి ఆగిపోయానని తెలిపింది.

 మతం పిచ్చి, ఆడవాళ్ల పిచ్చి ఉన్న సాధిక్‌తో ప్రతి మహిళ, యువతులు, పిల్లల తల్లులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ లేఖ విషయమై ఎస్పీ బిందుమాధవ్‌ని వివరణ కోరగా, పరిశీలిస్తున్నామని చెప్పారు. సాధిక్‌ ఖాన్‌ తనకంటే పదేళ్లు పెద్ద వయసున్న సౌజన్యను ట్రాప్‌ చేసి మతం మార్చేందుకు, ఆస్తి కాజేసేందుకు కుట్రపన్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.  

సాధిక్‌ ఇచ్చిన విష రసాయనంతోనే జగదీశ్వర్‌ రెడ్డి మృతి? 
సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డి నరాల సంబంధ వ్యాధితో బాధపడుతుండేవాడని, సాధిక్‌ ఇచ్చిన విష రసాయనంతో అతనికి జీర్ణకోశ వ్యాధి కూడా వచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అతన్ని హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రిలో చేర్చగా 23 రోజుల చికిత్స అనంతరం జూలై 2న మృతి చెందినట్లు సమాచారం. 

పోలీసులతోనే ఫొటోలన్నీ... 
సాధిక్‌ కాకినాడ గుడారిగుంటలో నిర్వహిస్తున్న ప్రో షూటింగ్‌ అకాడెమీలో ఫొటోలన్నీ పోలీసులతోనే ఉండటం చర్చనీయాంశమైంది. తాను సాధించిన మెడల్స్‌తో గతంలో పనిచేసిన జిల్లా ఎస్పీ సహా పలువురు అధికారులతో ఫొటోలు తీయించుకున్నాడు. వీటిని చూపించి పోలీస్‌ ఉన్నతాధికారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తన అకాడెమీకి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు చెప్పుకునేవాడు. పలువురు పోలీసుల పిల్లలకు కూడా సాధిక్‌ శిక్షణ ఇస్తుండటం గమనార్హం.  

రిమాండ్‌కు సాధిక్‌ ఖాన్‌
శనివారం ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసిన పోలీసులు
కాకినాడ రూరల్‌/కాకినాడ లీగల్‌/కాకినాడ క్రైం: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్‌ షూటింగ్‌ శిక్షకుడు షేక్‌ సాధిక్‌ ఖాన్‌ను సర్పవరం పోలీసులు సోమవారం కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. అతనికి సెప్టెంబర్‌ 3 వరకు రిమాండ్‌ విధిస్తూ మేజిస్ట్రేట్‌ ఎన్‌.ఉషాలక్ష్మి కుమారి ఆదేశాలు జారీ చేశారు. 

అనంతరం నిందితుడిని కాకినాడ సబ్‌జైలుకు రిమాండ్‌కు పంపించారు. ఈ నెల 16న ఏఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన వెంటనే సాధిక్‌ ఖాన్‌ పరారయ్యాడు. అతన్ని శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో అరెస్ట్‌ చేసి, ఆదివారం అర్ధరాత్రి సర్పవరం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. 

ఆరితేరిన నేరస్తుడిలా సాధిక్‌ పరారు: కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌
ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు పాల్పడగానే సాధిక్‌ ఖాన్‌ ఆరితేరిన నేరస్తుడి తరహాలో చాకచక్యంగా పారిపోయాడని ఎస్పీ బిందుమాధవ్‌ చెప్పారు. అతని కోసం 10 పోలీసు బృందాలు ఆరు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో గాలించాయని సోమవారం కాకినాడలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అతను సామర్లకోట నుంచి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి వెళ్లిపోయాడన్నారు. సామర్లకోట మీదుగా ఢిల్లీ, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌కు వెళ్లాడన్నారు. రైఫిల్‌ షూటింగ్‌లో శిక్షకుడైన ఓ మిత్రుడు సహా ఒకరిద్దరి దగ్గర ఆశ్రయం పొందినట్లు తెలిపారు.

 అతని ఫోన్‌ నుంచి చివరి కాల్‌ షూటింగ్‌ అసోసియేషన్‌లో సభ్యుడైన ఓ వ్యక్తికి వెళ్లడంతో అతని జాడ తెలుసుకొనే అవకాశం చిక్కిందని చెప్పారు. 22వ తేదీన అతని వద్దకు పోలీసులు వెళ్లగా.. అప్పటికి కొద్ది సేపటి ముందు సాధిక్‌ అక్కడి నుంచి మీరఠ్‌లో ఉంటున్న మరో షూటింగ్‌ శిక్షకుడైన అబ్బాస్‌ వద్దకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. స్థానిక పోలీసుల సాయంతో అబ్బాస్‌ ఇంటి వద్ద కాపు కాసి, సాధిక్‌ రాగానే పట్టుకున్నట్లు తెలిపారు. అతనిపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించడం, బెదిరింపులు, మతమార్పిడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement