సర్జరీలకు కత్తెర.. ‘ఔట్‌’ పేషెంట్‌! | Chandrababu govt Negligence on strike of JUDAs | Sakshi
Sakshi News home page

సర్జరీలకు కత్తెర.. ‘ఔట్‌’ పేషెంట్‌!

Aug 25 2026 5:09 AM | Updated on Aug 25 2026 5:09 AM

Chandrababu govt Negligence on strike of JUDAs

శ్రీకాకుళం రిమ్స్‌లోని ఐసీయూలో వైద్యులు లేని దుస్థితి

జూడాల సమ్మెపై బాబు సర్కారు మొండి పట్టుదల

న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించకుండా తాత్సారం 

ప్రభుత్వ వైద్య రంగాన్ని నీరుగార్చే కుట్రలు 

బోధనాస్పత్రుల్లో రోగుల హాహాకారాలు 

నర్సులు, నర్సింగ్‌ విద్యార్థులే దిక్కు 

ఓపీలో గంటల తరబడి పడిగాపులు.. వారం పది రోజులకు మందులు రాసిచ్చి పంపేస్తున్న వైనం 

అన్ని జీజీహెచ్‌ల్లో రెండు వారాలుగా అత్యవసరం కాని మేజర్, మైనర్‌ సర్జరీలన్నీ వాయిదా 

70 శాతానికి పైగా పడిపోయిన కాన్పులు 

రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్లు 40 శాతం తగ్గుదల

ఫొటోలో బెడ్‌పై ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన సరస్వతి గుండెల్లో దడ, ఆయాసంతో కడప జీజీహెచ్‌ ఐసీయూలో చేరింది. జూడాలంతా సమ్మెలో ఉండటంతో వార్డుల్లో రోగులను పట్టించుకునే వారే లేరని, డాక్టర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  

వీల్‌ చైర్‌లో కనిపిస్తున్న రాయచోటికి చెందిన నసీబ్‌ జాన్‌ కడుపు, నడుము నొప్పి సమస్యలతో బాధపడుతోంది. స్థానిక ఆస్పత్రుల్లో చూపించినా తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం 100 కి.మీ. దూరంలోని తిరుపతి రుయా ఆస్పత్రికి వచ్చింది. ఎమర్జెన్సీలో చేరినా ఫలితం లేకపోవ­డంతో కుటుంబ సభ్యులు ప్రయాసపడుతూ ఓపీకి తీసుకెళ్లారు. అక్కడ కనీస వైద్య పరీక్షలు కూడా చేయకుం­డానే మాత్రలు రాసిచ్చి వారం తర్వాత రమ్మని సిబ్బంది సూచించడంతో హతాశురాలైంది. 100 కి.మీ దూరం నుంచి వచ్చామని, మళ్లీ మళ్లీ రాలేమని ప్రాథేయపడ్డారు. సమస్య ఏమిటో పరిశీలించాలని కోరగా.. ‘డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. ప్రస్తుతానికి మందులే ఇస్తాం’ అని చెప్పారని నసీబ్‌జాన్‌ వాపోయింది. నడవలేని పరిస్థితిలో ఉన్నా. ఇక ప్రైవేట్‌ ఆస్పత్రే దిక్కు అంటూ రుయా నుంచి వెళ్లిపోయింది.

ఏలూరుకు చెందిన కుమారికి షుగర్‌ సమస్య తీవ్రమై ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మెరుగైన చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్‌కు రాగా ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోకుండా మందులు రాసి ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్లగానే అనారోగ్యం తీవ్రం కావడంతో చేసేది లేక కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  

రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులు, వైద్య కళాశాలల్లో సోమవారం 15వ రోజు జూడాల సమ్మె కొనసాగింది. తక్కువ స్టైపెండ్‌తో ఎక్కువ పని చేస్తున్న తమ ఇబ్బందులను గుర్తించాలని ప్లకార్డులు ప్రదర్శించి జూడాలు నిరసన తెలిపారు. తమ కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 20 శాతం స్టైపెండ్‌ పెంచే వరకూ వెనక్కు తగ్గబోమని ఏపీ జూడా అసోసియేషన్‌ పట్టుబడుతుండగా ప్రభుత్వ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ప్రకటించినట్లుగా ఏడాదికి 3 శాతం పెంపు హామీకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంతో ఆస్పత్రుల్లో సేవలు స్తంభించి రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం చలించడం లేదు.

సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలకుపైగా బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించి రోగులు హాహాకారాలు చేస్తున్నా చంద్రబాబు సర్కారు మొండి పట్టుదల వీడటం లేదు. జూనియర్‌ డాక్టర్ల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. స్టైపెండ్‌ సవరణపై ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తూ ఎస్మా ప్రయోగానికి కుట్రలు పన్నుతోందని జూడాలు ఆరోపిస్తున్నారు. అత్యవసర సేవలు సైతం బహిష్కరించి జూడాలు సమ్మె చేస్తుండటంతో బోధనాస్పత్రుల్లో సేవలు పూర్తిగా కుంటుపడ్డాయి. వందల కి.మీ నుంచి వ్యయప్రయాసల కోర్చి  వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని చంద్రబాబు సర్కార్‌ ఉద్దేశపూర్వకంగా నీరు గార్చే కుట్రలు చేస్తోంది! సంక్షోభ పరిస్థితులను సృష్టిస్తూ పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీసే దుస్థితి కల్పిస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.వేల కోట్ల బకాయిలు పెట్టి వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితిని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం కల్పించింది. ఇన్‌ సర్వీస్‌ మెడికల్‌ పీజీ కోటాకు కోతల పేరిట రెండేళ్ల పాటు పీహెచ్‌సీ వైద్యులను రోడ్లెక్కించి గ్రామీణ వైద్యాన్ని నెలల తరబడి స్తంభింప చేసి  అతలాకుతలం చేసింది. కొత్త వైద్య కళాశాలను ప్రైవేట్‌కు కట్టబెడుతూ పేదలకు ఉచిత సూపర్‌ స్పెషాలిటీ వైద్యానికి గండి కొట్టింది. తాజాగా జూనియర్‌ డాక్టర్ల స్టైపెండ్‌ పెంచకుండా వారిని సమ్మెలోకి దిగేలా చేసింది. 30 శాతం స్టైపెండ్‌ పెంచాలని జూడాలు డిమాండ్‌ చేస్తే కేవలం 3 శాతం పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో సమ్మె బాట పట్టారు. రెండేళ్లకు ఒకసారి జూడాలకు 15 శాతం పెంచాలి. అయితే పెరిగిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో 30 శాతం పెంచాలని జూడాలు కోరుతున్నారు.

విశాఖలోని కేజీహెచ్‌లో ఓపీల కోసం బారులు తీరిన రోగులు, కుటుంబ సభ్యులు 

వైద్య సేవలు పతనం
స్టైపెండ్‌ పెంపుపై సర్కార్‌ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా 7,500 మందికిపైగా జూడాలు విధులకు దూరం అయ్యారు. ప్రస్తుతం రెగ్యులర్‌ వైద్యులు మాత్రమే సేవలు అందిస్తుండగా రోగుల తాకిడికి అనుగుణంగా అందుబాటులో లేరు. ఓపీలో వారం పది రోజులకు మందులు రాసిచ్చి మళ్లీ రావాలని సూచిస్తున్నారు. అన్ని జీజీహెచ్‌ల్లో రెండు వారాలుగా అత్యవసరం కాని మేజర్, మైనర్‌ సర్జరీలన్నింటినీ వాయిదా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో రాష్ట్రం అంతటా 200కిపైగా ప్రసవాలు నమోదు అవుతుండగా సమ్మె నేపథ్యంలో సోమవారం 70 శాతానికి పైగా పడిపోయినట్టు తెలిసింది. 2 వేలకు పైగా నమోదయ్యే సర్జరీలు ఏకంగా సగానికి పరిమితం అయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మేర అడ్మిషన్‌లు పడిపోయాయి. 

నర్సులు, నర్సింగ్‌ విద్యార్థులే దిక్కు
వైద్యుల కొరత నేపథ్యంలో ఐసీయూ, అత్యవసర విభాగాల్లో సేవలు అగమ్యగోచరంగా మారాయి. గతంలో 24/7 ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ, ఐసీయూల్లో జూనియర్‌ వైద్యులు అందుబాటులో ఉంటూ రోగుల బాగోగులు చూసుకునేవారు. రోగి పరిస్థితి విషమించిన సమయాల్లో సీనియర్‌ వైద్యులను అప్రమత్తం చేసేవారు. ఇప్పుడు డ్యూటీలో ఉండే నర్సులు, నర్సింగ్‌ విద్యార్థులే రోగులకు దిక్కవుతున్నారు. శ్రీకాకుళం రిమ్స్‌లో 300 మందికిపైగా జూడాలు విధులకు దూరం కావడంతో ఓపీ, ఐపీల్లో రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

వెనక్కి తగ్గం.. ప్రభుత్వం దిగొచ్చేదాకా సమ్మె కొనసాగిస్తాం
30 శాతం స్టైపెండ్‌ పెంపు డిమాండ్‌తో సమ్మెలోకి వెళ్లాం. ప్రభుత్వం మూడు శాతమే పెంచుతామని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో మేమే ఓ మెట్టు దిగి 20 శాతం పెంచాలని కోరాం. దీనికీ ప్రభుత్వం నో చెప్పింది. సోమవారం మళ్లీ చర్చలయ్యాయి. పీజీలకు మూడు శాతం మించి పెంచేదిలేదని ప్రభుత్వం చెప్పేసింది. కనీసం 15 శాతం అయినా పెంచాలని అడిగాం. దీనికి కూడా అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మేం వెనక్కు తగ్గబోం. ప్రభుత్వం దిగివచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తాం.
    – ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌  

డాక్టర్లు లేని లోటు కనిపిస్తోంది
ఆయాసం సమస్యతో జీజీహెచ్‌కు వచ్చా. ఎమర్జెన్సీలో పట్టించుకునే వారే లేకుండా పోయారు. గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. వైద్యులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.  
    – ఫాతిమా, కడప జీజీహెచ్‌

ఈ పరిస్థితి ఉండేది కాదు..
తాడిపత్రి నుంచి అత్యవసర వైద్యం కోసం సోమవారం ఉదయం అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చా. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. డ్యూటీలో పీజీ డాక్టర్లు, జూనియర్‌ డాక్టర్లు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనిపిస్తోంది. 
    – నదీం, లారీ యజమాని, అనంతపురం జిల్లా

ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళుతున్నాం..
మా అమ్మ ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన జీజీహెచ్‌కు తీసుకొచ్చా. నాలుగు గంటలు తిప్పారు. అష్టకష్టాలు పడి అడ్మిట్‌ చేస్తే చికిత్స చేయడానికి వైద్యులు లేరు. వార్డుల్లో నర్సులు మాత్రమే ఉంటున్నారు. అమ్మ ఆరోగ్యం కుదుట పడలేదు. ఇక్కడే ఉంటే ఏమవుతుందో అని భయంగా ఉంది. అందుకే ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లిపోతున్నాం.    
 – విజయ్‌కుమార్, విజయవాడ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement