సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అబద్ధం! | Chandrababu Amaravati Promises Are False: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అబద్ధం!

Aug 25 2026 4:39 AM | Updated on Aug 25 2026 4:41 AM

Chandrababu Amaravati Promises Are False: Andhra Pradesh

రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్పేదంతా బూటకం

2026–27 బడ్జెట్‌లో రాజధాని పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించిన సర్కార్‌ 

అందులో రూ.1,200 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు 

2014–19 మధ్య రాజధాని కోసం రూ.5,013.60 కోట్ల అప్పు 

దాన్ని తీర్చేందుకు బడ్జెట్‌లో రూ.836.26 కోట్లు కేటాయింపు 

ఇందులో ఇటీవల రూ.421.99 కోట్లు చెల్లింపు 

2024 నుంచి ఇప్పటివరకూ రాజధాని కోసం రూ.47,687 కోట్ల అప్పు 

రాజధానిని 53 వేల నుంచి 2.29 లక్షల ఎకరాలకు విస్తరించేందుకు తాజాగా ప్రణాళిక 

మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున రూ.4.58 లక్షల కోట్లు అప్పు 

ఆ అప్పులను వడ్డీతో సహా రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తుందంటున్న ఆర్థిక నిపుణులు 

రాజధాని లేకుండా చేయడమే కాదు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న చంద్రబాబు  

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలే అనేందుకు ఇది మరో తార్కాణం!! 2026–27 బడ్జెట్‌లో రాజధాని నిర్మాణ పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, అందులో రెండో త్రైమాసికానికి రూ.1,200 కోట్లను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనులకు బడ్జెట్‌ నుంచి ఒక్క పైసా కేటాయించడం లేదని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.. రాజధాని కోసం చేస్తున్న అప్పులను అమరావతిలో ప్రభుత్వానికి మిగిలే భూమి అమ్మి తీర్చుతామని.. పైసా భారం కూడా ప్రజలపై పడదని.. అమరావతి ‘సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు’ అని ఆయన తరచూ చెబుతుంటారు. 

కానీ, అది పచ్చి అబద్ధమని తేలిపోయింది. రాజధాని కోసం 2014–19 మధ్య హడ్కో నుంచి రూ.1,151.60 కోట్లు, బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,862 కోట్లు, అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు.. వెరసి– రూ.5,013.60 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పును తీర్చేందుకు 2026–27 బడ్జెట్‌లో రూ.836.26 కోట్లు కేటాయించి, ఇప్పటికే రూ.421.99 కోట్లను చెల్లించారు. అంటే రాజధాని నిర్మాణ పనుల కోసం చేస్తున్న అప్పులను తీర్చేందుకు రాష్ట్ర ఖజానా నుంచే నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

ఇప్పటికే కౌలు, పెన్షన్‌లకు రూ.3,077.63 కోట్లు 
రాష్ట్ర విభజన తర్వాత 2014లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలను రాజధానిగా చంద్రబాబు సర్కార్‌ ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం 53,748 ఎకరాలు (217.23 చదరపు కిలోమీటర్లు)ను ల్యాండ్‌ పూలింగ్‌(భూసమీకరణ) కింద సమీకరించింది. ఇందులో 29,892 మంది రైతుల నుంచి 35,351 ఎకరాలను సమీకరించింది. పదేళ్లపాటు కౌలు చెల్లించడంతోపాటు పదేళ్లలోగా అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక 2024లో చంద్రబాబు సర్కార్‌ మళ్లీ అధికారంలోకి రాగానే కౌలు చెల్లింపును మరో ఐదేళ్లపాటు పొడిగించింది. 

గత 12 ఏళ్లుగా 29,892 మంది రైతులకు రూ.2,214.12 కోట్లను రాష్ట్ర ఖజానా నుంచే కౌలు రూపంలో చెల్లించారు. 2015లో రాజధాని రైతులకు రుణ మాఫీ రూపంలో రూ.85.19 కోట్లు, 17,525 మంది వ్యవసాయ కూలీలకు జూలై వరకూ రూ.778.31 కోట్లను పెన్షన్‌ రూపంలో చెల్లించింది. వెరసి ఇప్పటికే కౌలు, పెన్షన్, రుణ మాఫీ రూపంలో రాజధాని రైతులు, రైతు కూలీలకు రాష్ట్ర ఖజానా నుంచే రూ.3,077.63 కోట్లు వ్యయం చేసింది.

అప్పులు.. స్కాములు.. ఆర్థిక సంక్షోభం
2.29 లక్షల ఎకరాలు.. 4.58 లక్షల కోట్ల 
అప్పు + వడ్డీలు.. వందల ఏళ్లు.. ఇదీ చంద్రబాబుగారి కలల రాజధాని పరిస్థితి. ఇదంతా కలల్లోనే.. నిజానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికి చంద్రబాబుగారు వేసిన మాస్టర్‌ ప్లాన్‌ ఇది.. రాజధాని నిర్మాణం కోసం 2024, జూన్‌ 12 నుంచి ఇప్పటివరకూ ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ.. హడ్కో వంటి జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల వద్ద ఇప్పటికే రూ.47,687 కోట్లు అప్పు చేసింది. ఇక రాజధాని కోసం 2015లో 53,748 ఎకరాలు(217.23 చదరపు కిలోమీటర్లు) సమీకరించిన సర్కార్‌.. స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణం పేరుతో 20,494 ఎకరాల(82.9 చకిమీలు) సమీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసి, ఆ ప్రక్రియను ప్రారంభించింది.

 తాజాగా రైల్వే లైన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పేరుతో 2,344.12 ఎకరాల సమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంతటితో ఈ భూసమీకరణ ప్రక్రియ ఆగదని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. కొత్తగా సమీకరిస్తున్న మోతడకతోపాటు.. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌ ఇండస్ట్రీస్, భవిష్యత్‌ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, ఎడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాల (626.67 చదరపు కిలోమీటర్లు) మేర రాజధాని విస్తరణకు అవసరమైన మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను సింగపూర్‌కు చెందిన సుర్బానా–జురాంగ్‌ సంస్థకు రూ.45.14 కోట్లకు అప్పగించింది.

 అంటే.. మొత్తం 2,29,095 ఎకరాలలో(926.8 చ.కి.మీ.లు) రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి 29 గ్రామాల్లో 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికే వందేళ్ల సమయం పడుతుందని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఇటీవల ప్రభుత్వమే చెప్పింది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికి ఇంకెన్ని శతాబ్దాలు పడుతుందన్నది అంచనా వేయలేని పరిస్థితి. ఇక చంద్రబాబు సర్కార్‌ కేంద్రానికి సమరి్పంచిన డీపీఆర్‌ల ప్రకారమే రాజధాని నిర్మాణంలో రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ, తాగునీటి సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్లు వ్యయమవుతుందని పేర్కొంది. 

ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్ల అవసరం అవుతాయి. ఆ అప్పు, వడ్డీతో కలిసి ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందో!? ఈ అప్పును వడ్డీతోసహా రాష్ట్ర ఖజానా నుంచే అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచి చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. దీన్ని బట్టి చూస్తే స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాదు.. రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి సీఎం చంద్రబాబు నెడుతున్నారంటూ విద్యార్థులు, ఆర్థికవేత్తలు, మేధావులు 
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement