జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపండి
స్టైపెండ్ పెంపు విషయంలో ప్రభుత్వ వైఖరిపై వైఎస్ జగన్ మండిపాటు
జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడతారా?
సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం.. ఈ పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరి కారణం కాదా?
జూడాల డిమాండ్లు తక్షణమే పరిష్కరించండి.. మా హయాంలో 42.4% స్టైపెండ్ పెంచాం
ఇప్పటికే ప్రభుత్వ బకాయిలతో చేతులెత్తేసిన ‘ఆరోగ్యశ్రీ’ ఆస్పత్రులు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు
ప్రభుత్వ బోధనాçస్పత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులు ఆపేశారు
జీరో వేకెన్సీ పాలసీకి మంగళం.. సిబ్బంది తగ్గింపు.. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండి
ప్రజారోగ్య వ్యవస్థలో చంద్రబాబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల(జూడా)ను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని స్టైపెండ్‌ను 15 శాతం కంటే మెరుగ్గా పెంచాలని జానియర్ డాక్టర్లు కోరుతుంటే కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని ప్రభుత్వం చెప్పడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో జీవో 287లో నిర్దేశించిన 15 శాతం కంటే అధికంగా.. మొత్తంగా 42.4 శాతం స్టైపెండ్ పెంచామని గుర్తు చేశారు.
సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్‌గా గురిస్తూ, వారి విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన దాని కంటే పెంచి.. మొత్తంగా 77 శాతం పెంపు వర్తింపజేశామన్నారు. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచామని చెప్పారు. ఇప్పటికైనా అహంకారం వీడి, జూడా ప్రతినిధులతో వెంటనే చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చంద్రబాబుకు సూచించారు. తగిన స్థాయిలో స్టైపెండ్ పెంచి, సమ్మెను విరమింపజేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
రెండు వారాలైనా స్పందించరా?
‘రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్‌లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలు కావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపేశారు? జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఈ పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరి కారణం కాదా? ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగాన్ని దారుణంగా దెబ్బ తీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు చేపట్టాం. ఐదింటిని పూర్తి చేసి, తరగతులు కూడా ప్రారంభించాం. మరో కాలేజీని క్లాసులకు సిద్ధం చేశాం. ఇలా మొత్తంగా 6 కళాశాలలు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తి చేయాల్సి ఉండగా, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదిసరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. డబ్ల్యూహెచ్‌వో/జీఎంపీ ప్రమాణాలు ఉండే మందులు లేక ప్రభుత్వాస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్య రంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్‌లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో చంద్రబాబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.


