విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించిన స్పెషల్ టెట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ విషయంలో కొన్ని మినహాయింపులు, సడలింపులు ఇవ్వాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే.. ప్రభుత్వం విడుదల చేసిన తాజా స్పెషల్ టెట్ షెడ్యూల్‌లో ఆ మినహాయింపులకు చోటు లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పెషల్ టెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పరీక్షకు సంబంధించిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటికే సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి పరీక్ష విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం విడుదల చేసిన షెడ్యూల్‌లో ఉపాధ్యాయ సంఘాలు కోరిన సడలింపులను ప్రకటించలేదు. దీంతో ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం నుంచి షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు టెట్ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి రావడం ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారవచ్చని సంఘాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే ఏ విధంగా స్పందించాలనే విషయాన్ని రేపు ప్రకటించే అవకాశం ఉంది.


