కాకినాడ: ఏపీలో సంచలనం సృష్టించిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు.
ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన అనంతరం నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు తనను కనిపెట్టకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్ వాడటం పూర్తిగా పక్కనబెట్టాడు.
ఈ క్రమంలోనే అతను ఐదు రాష్ట్రాల వ్యాప్తంగా పరారీలో ఉన్నాడని, చివరకు నిఘా వర్గాల సాయంతో మీరట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వివరించారు. మృతుడు నూకరాజు రాసిన సూసైడ్ నోట్‌తో పాటు ఆయన భార్య సౌజన్య రాసిన లేఖ ఆధారంగా సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సౌజన్య తన లేఖలో సాధిక్ ఖాన్ గురించి స్పష్టంగా ప్రస్తావించిందని పేర్కొన్నారు. సౌజన్య, సాధిక్ ఖాన్ కొంతకాలంగా కలిసే ఉన్నారని.. ఈ నేపథ్యంలోనే నూకరాజు మృతిపై కూడా ప్రత్యేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సాధిక్ ఖాన్‌ను కాకినాడ తరలిస్తున్నామని, ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉన్నందున నిందితుడిని మరింత లోతుగా విచారించాల్సి ఉందని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు.


