ఆంధ్రప్రదేశ్‌లో విశ్వసనీయతతో కూడిన రాజకీయానికి, బుకాయింపు రాజకీయానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. డీఎస్పీ అక్రమాలపై సాక్ష్యాధారాలు చూపుతూ మీడియా సమావేశంలో వివరించడమే కాకుండా, వైఎస్సార్‌సీపీ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేసిన ఆరోపణలు అన్నింటికి జవాబు ఇచ్చిన తీరు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశ్వసనీయతను పెంచిందని చెప్పాలి.
ప్రతిపక్షం లేని అసెంబ్లీలో చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు డీఎస్పీపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి, విపక్షం ఉన్న శాసనమండలిలో అసలు చర్చకే వెనుకాడడం, దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఏపీపీఎస్సీపై ఆరోపణలు చేసిన వైనంతో వారు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో లోకేష్ పరిణితితో వ్యవహరించలేకపోతే, చంద్రబాబు మాత్రం డబాయింపు విధానాన్ని అనుసరించారన్న అభిప్రాయం కలుగుతుంది. అన్నింటికి మించి డీఎస్పీ, ఏపీపీఎస్సీలు రెండిటి పైన సీబీఐ విచారణకు అప్పగించాలని జగన్ సవాల్ విసరడంతో చంద్రబాబు, లోకేష్‌లకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.
మామూలుగా అయితే జగన్ మీడియా సమావేశం పూర్తి కాగానే టీడీపీ అధినేతలు దానికి కౌంటర్‌గా వారే మాట్లాడడం కాని, లేదా పార్టీ ఇతర నేతలతో కాని జవాబు ఇప్పించేవారు. కాని అలా చేసినట్లు కనిపించలేదు. అసెంబ్లీలో వీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూటమి ఎమ్మెల్యేలు దాదాపు మౌన ప్రేక్షకుల మాదిరిగానే ఉన్నారనిపించింది. దాదాపుగా ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం, ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్న దానిలో హేతుబద్దత లేదన్న భావన కలుగుతున్నా వాటిని ఎత్తిచూపలేకపోవడం వారి బలహీనతగా తీసుకోవాలి.
టీచర్ల నియమాకాలకు సంబంధించి జరిగే డీఎస్పీ ప్రక్రియలో, ప్రత్యేకించి క్రీడా రిజర్వేషన్ విభాగంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ నిర్దిష్ట ఆధారాలతో ఆరోపిస్తోంది. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోరాటం చేశారు. వెంటనే ఆ అక్రమాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాని అధికార టీడీపీ చర్చకు ముందుకు రాలేదు. పోనీ అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు పెట్టకుండా ఉంటే అదో పద్దతి అనిపించేది. చంద్రబాబు, లోకేష్‌లు డీఎస్పీ అక్రమాలు జరగలేదని చెప్పడానికి చేసిన వాదనలో చాలా లోపాలు కనిపించాయి. జగన్ చేసిన ఆరోపణలు ఒక్కోదానికి క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోయారు. వాటిలో కొన్నిటిని పరిశీలించండి.
జగన్ తన వాదనలో ప్రధానంగా క్రీడా కోటాలో 372 పోస్టులు పరీక్షలు లేకుండా ఇచ్చిన విదానాన్ని ప్రశ్నించారు. ఇందుకోసం రెండు జీఓలు ఇచ్చి, వారికి ఉద్యోగాలు ఇచ్చేశాక మళ్లీ ఆ జీఓలను రద్దు చేస్తూ వేరొక జీఓ ఇవ్వడం గురించి జగన్ ప్రస్తావించారు. తమకు కావల్సినవారికి ఉద్యోగాలు ఇచ్చి, తదుపరి గేట్లు మూసివేశారా అన్నది ఆయన వేసిన ప్రశ్న. దీనికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా జవాబు ఇచ్చినట్లు కనిపించలేదు. ప్రఖ్యాత క్రీడాకారిణి పీవీ సింధూతో ఈ టీచర్లను లోకేష్ పోల్చడాన్ని యావన్మంది తప్పుపట్టారు. ఈ విషయం కూటమి ఎమ్మెల్యేలకు కూడా అర్థం అయి ఉండాలి. కాని అధికార పక్షంలో ఉన్నందున వారు అడగలేకపోయి ఉంటారు.
లోకేష్ తీరు ఇమ్మెచ్యూర్‌గా ఉందని పలువురు విశ్లేషకులు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేధావులు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన లేఖల ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారో అర్థం కాదు. కేవలం స్థానికంగా ఆటలలో పాల్గొంటే చాలన్న పద్దతి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండి ఉండదు. చిత్రంగా జాతీయస్థాయి క్రీడలలో మెడల్స్ సంపాదించిన కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వారు బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చినట్లు ప్రకటించడం, ఆ తర్వాత అతనిని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం, పరీక్ష పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఒకరికే అప్పగించడం వంటివాటిని లోకేష్ సమర్ధించుకున్న తీరు కూడా అంత బాగోలేదు.
టీచర్ల పోస్టులకు బేరాసారాలు సాగిన ఆడియో తదితర విషయాలను కూడా జగన్ ఆధారసహితంగా చూపించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఇచ్చిన సమాధానాలలో పరస్పర విరుద్దంగా ఉన్న అంశాలను కూడా ప్రస్తావించారు. జగన్ లేదా వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసినంతనే లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. కాని తన వైపు తప్పులేదని చెప్పుకోవడానికి ఆయన పడిన పాట్లు, ఆయనను రక్షించడానికి తండ్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన యత్నాలు అందరికి అర్థం అయిపోయాయన్నది పలువురి భావన.
చంద్రబాబు తనదైన శైలిలో ఎదురుదాడి చేయడానికి యత్నించారు. పనికట్టుకుని ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ, తన జీవితంలోనే ఎన్నడూ ఇలాంటి కుంభకోణం చూడలేదంటూ పెద్ద హడావుడి చేయాలని ఆయన తలపెట్టారు. కాని అది పండలేదు. అసెంబ్లీలో అయినా, బయట అయినా ఆయన ఎంత గట్టిగా మాట్లాడితే, అంత అసత్యం అయి ఉంటుందని, గతంలో వైఎస్సార్‌సీపీలో ఉండి, ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటుండేవారు. పనికట్టుకుని జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అధికారి గురించి చంద్రబాబు ప్రస్తావించడంపై రకరకాల చర్చలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబుపైన పలు కీలకమైన కేసులు రావడానికి ఆ అధికారి కారణమన్న కోపం ఉండి ఉండవచ్చని, దానిని ఈ సందర్భంగా బయటపెట్టారని కొందరు అంటున్నారు.
అయితే జగన్ తన వివరణలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అన్నిటిని పటాపంచలు చేసే విధంగా మాట్లాడారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు తమ ప్రభుత్వంలో జరిగాయని ఆయన చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తం ప్రక్రియ జరిగిందని ఆయన తెలిపారు. అసలు సంబంధం లేని డిజిటల్ వాల్యుయేషన్, హాయ్ లాండ్ ఇష్యూలను తెరపైకి తెచ్చి, వాస్తవాలు మరుగున పరచడానికి ముఖ్యమంత్రి యత్నించారని ఆయన ఆరోపించారు. వాటిని కూడా ప్రస్తావించి జగన్ హైకోర్టు తప్పుపట్టలేదన్న సంగతిని గుర్తు చేశారు.
గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగలేదని చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని, పేపర్ టాంపర్ కాలేదని సీఎఫ్ఎస్‌ఎల్ నివేదిక పేర్కొందని జగన్ వెల్లడించడంతో కూటమి ప్రభుత్వ వాదనంతా వీగిపోయినట్లయింది. ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, వాల్యుయేషన్ మూడు ప్రదేశాలలో జరపడం, అన్నిచోట్ల సిసిటీవీ కెమెరాల అమరిక జంబ్లింగ్ మొదలైన పద్దతులను కట్టుదిట్టంగా అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌లు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారిలో తమ ప్రభుత్వం తప్పు చేయలేదన్న కాన్పిడెన్స్‌ను చూపించలేకపోయారన్న అభిప్రాయం పలువురిలో ఏర్పడింది.
అదే టైమ్‌లో జగన్ తన ప్రజెంటేషన్‌లో ఒక స్పష్టత, వీడియో, ఆడియో ఆధారాలు, ప్రభుత్వ జీఓలు, కోర్టు తీర్పులలోని వివిధ భాగాలు మొదలైనవాటిని చూపించడం ద్వారా తన క్రెడిబిలిటీని మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. ఈ వివాదాల నుంచి బయటపడాలంటే, అవినీతి జరగలేదని, తాము అసత్యాలు చెప్పడం లేదని ప్రజలను నమ్మించాలంటే చంద్రబాబు ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే జగన్ విసిరిన సవాల్‌కు ధైర్యంగా స్పందించి డీఎస్పీ, ఏపీపీఎస్సీ రెండిటిపైన సీబీఐ విచారణకు ఆదేశించడమే. మరి వారు అలా చేయగలుగుతారా!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


