ఉత్తరకాశీ: చార్‌ధామ్ రహదారి ప్రాజెక్టులో భాగంగా యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా-పోల్‌గావ్ సొరంగంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. సొరంగంలోని పోల్‌గావ్ బర్‌కోట్ వైపు నుంచి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల లోపల కొండచరియలు కూలిపడటంతో భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. ఈ పరిణామంతో నిర్మాణంలో ఉన్న సొరంగం భద్రతపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాంటి ప్రమాదం లేదని నిర్మాణ సంస్థ కొట్టిపారేసింది.
2023లో సిల్క్యారా సొరంగం ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల లోపల భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 17 రోజుల పాటు సాగిన సుదీర్ఘ సహాయక చర్యల అనంతరం వారందరినీ సురక్షితంగా వెలికితీశారు. అయితే ఆ ప్రమాదం తర్వాత కూడా ఇక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. తాజాగా పోల్‌గావ్ బర్‌కోట్ వైపు దాదాపు 1.5 కి.మీ లోపల శిథిలాలు పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
దీనిపై నిర్మాణ సంస్థ ‘నవయుగ ఇంజినీరింగ్ లిమిటెడ్’ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీరామ్ స్పందిస్తూ.. నిర్మాణ దశలో ఉన్న సొరంగాల్లో ఇలాంటి శిథిలాలు పడటం సాధారణమేనని అన్నారు. దాదాపు 1300 మీటర్ల లోపల కొంత మేర శిథిలాలు పడ్డాయని, వాటిని తొలగించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వెల్లడించారు.
2018లో ప్రారంభమైన ఈ 4.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మాణం 2022 నాటికి పూర్తి కావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. 2024లో రెండు వైపులా సొరంగ తవ్వకం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం దాదాపు 90 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని, మార్చి 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: చండీగఢ్: ఉగ్ర కుట్ర భగ్నం.. ఆయుధాలతో ముగ్గురు అరెస్ట్


