పాము కాటు.. సినిమాల్లో చూపించినట్లు నిజంగా చేయొచ్చా? | Snake Bite: Can You Really Do What Movies Show? | Sakshi
Sakshi News home page

పాము కాటు.. సినిమాల్లో చూపించినట్లు నిజంగా చేయొచ్చా?

Aug 24 2026 10:58 AM | Updated on Aug 24 2026 11:06 AM

Snake Bite: Can You Really Do What Movies Show?

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పాముల సంచారం పెరుగుతుంది. పొలాలు, ఇళ్ల పరిసరాలు, గోదాములు, పొదలు.. ఇలా ఎక్కడైనా అవి కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పాము కాటు ఘటనలు కూడా పెరుగుతాయి. అయితే ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా తాజా గణాంకాలు మరీ ఆందోళనకరంగా ఉన్నాయి. సకాలంలో చికిత్స అందకపోవడం ఒక కారణమైతే.. కొన్ని నిర్ణయాలు పరిస్థితిని మరింత విషమంగా మారుస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

చాలా సందర్భాల్లో పాము విషం కంటే.. కాటు తర్వాత మనుషులు చేసే పొరపాట్లే ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆలస్యం చేయకుండా సరైన వైద్య సహాయం పొందడం లేదు. దానికి బదులు సొంత వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు. ఇదే ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. అదే సమయంలో మరికొందరు.. తాత్కాలిక ఉపశమనం పేరిట చేస్తున్న ప్రయత్నాలు కూడా మరణాల సంఖ్యను పెంచుతున్నాయి. 

అలాంటప్పుడు పాము కాటు వేసిన చోట కోత పెట్టడం.. నోటితో విషాన్ని పీల్చే ప్రయత్నం చేయడం, ఆకుపసరుల్లాంటివి రాయడం, కాటేసిన చోట గట్టిగా తాడు.. గుడ్డలు కట్టడం, పామును పట్టుకోవడానికి ప్రయత్నించడం ఇలా సినిమాల్లో చూపించినట్లు చేయడం కరెక్ట్‌ కాదా?.. వైద్యులు, నిపుణులు ఏం చెబుతున్నారంటే.. 

నోటితో విషం పీల్చొచ్చా?
పాము కాటు వేసిన వెంటనే చాలామందికి గుర్తొచ్చేది సినిమాల్లో కనిపించే సన్నివేశాలే. కాటు వేసిన చోట కోత పెట్టి.. నోటితో విషాన్ని పీల్చడం ద్వారా ప్రాణాలు కాపాడినట్లు సినిమాల్లో చూపిస్తారు. పొలం పనులు చేసుకునేవాళ్లు.. ఎక్కువగా ఇదే చేస్తుంటారని, ఆ తర్వాత ఆకుపసరులాంటివి రాయడం చేస్తుంటారని గుర్తు చేస్తున్నారు. కానీ వాస్తవంలో ఇది పూర్తిగా తప్పు పద్ధతి అని వైద్యులు చెబుతున్నారు. నోటితో విషాన్ని పీల్చడం వల్ల శరీరంలోకి వెళ్లిన విషాన్ని బయటకు తీయడం సాధ్యం కాదని.. పైగా నోటిలో గాయాలు ఉంటే ప్రమాదం పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కాటు వేసిన ప్రాంతంలో కోతలు పెట్టడం వల్ల రక్తస్రావం, ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు రావచ్చు కూడా. 

గట్టిగా కట్టడం కూడా ప్రమాదమే
పాము కాటు తర్వాత చాలామంది విషం వ్యాపించకుండా ఉండేందుకు కాటేసిన పైభాగంలో తాడు, గుడ్డను బిగుతుగా కడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాటు వేసిన అవయవాన్ని కదలకుండా స్థిరంగా ఉంచడం మాత్రమే చేయాలి. బిగుతైన వస్తువులు, ఉంగరాలు, గాజులు, కడియాలు ఉంటే వెంటనే తొలగించాలి. వాపు పెరిగితే ఇవి సమస్యగా మారొచ్చు.

ముందుగా చేయాల్సింది ఇదే
పాము కాటుకు గురైన వ్యక్తిని ముందుగా ప్రశాంతంగా ఉంచాలి. భయం, ఆందోళన వల్ల గుండె వేగం పెరిగి రక్త ప్రసరణ వేగవంతం కావడంతో విషం వ్యాప్తి చెందే అవకాశం పెరగవచ్చు. కాటు వేసిన చేతి లేదా కాలును ఎక్కువగా కదపకుండా చూడాలి. బాధితుడు స్వయంగా నడిచి వెళ్లకుండా.. ఇతరుల సహాయంతో వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.

పామును పట్టుకోవాలా?..
కాటు వేసిన పాము ఏదో తెలుసుకుంటే చికిత్స సులభమవుతుందని చాలామంది భావిస్తారు. దీంతో కొందరు పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నిస్తారు. ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాము రంగు, ఆకారం వంటి వివరాలను దూరం నుంచి గుర్తుంచుకుంటే సరిపోతుంది. పామును పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

లక్షణాలు కనిపించకపోయినా జాగ్రత్త
ప్రతి పాము కాటులోనూ విషం శరీరంలోకి వెళ్లకపోవచ్చు. కానీ కాటు విషపూరితమా కాదా అనేది సాధారణ వ్యక్తులు వెంటనే గుర్తించడం కష్టం. అందుకే ప్రతి పాము కాటును అత్యవసర పరిస్థితిగానే పరిగణించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని పాముల విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మరికొన్ని రక్తం గడ్డకట్టే ప్రక్రియను దెబ్బతీస్తాయి. ఇంకొన్ని కణజాలాలు, కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన వాపు, బలహీనత, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర చికిత్స అవసరం.

యాంటీ స్నేక్‌ వెనం ఎప్పుడు ఇస్తారు?
పాము కాటు వేసిన ప్రతి ఒక్కరికీ యాంటీ స్నేక్‌ వెనం (ఏఎస్‌వీ) అవసరం ఉండకపోవచ్చు. బాధితుడి పరిస్థితి, లక్షణాలు, వైద్య పరీక్షల ఆధారంగా వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. అయితే విష ప్రభావం ఉన్నట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా ఏఎస్‌వీ అందించడం కీలకం. అందుకే పాము కాటు తర్వాత ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా ఆసుపత్రికి చేరుకోవడమే అత్యంత ముఖ్యం.

ఆ ఐదు నిమిషాలే డిసైడ్‌ చేస్తాయి
పాము కాటు వేసినప్పుడు భయం సహజం. కానీ ఆ భయంతో చేసే పొరపాట్లే ప్రమాదాన్ని పెంచుతాయి. నోటితో విషం పీల్చడం, కోతలు పెట్టడం, తాడు బిగించడం, పామును పట్టుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి. పాము కాటు వేస్తే.. ముందుగా విషంతో కాదు.. అపోహలతో పోరాడాలి. సరైన సమయంలో సరైన చికిత్స పొందితే ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఇదీ చదవండి: నేనంటే దెయ్యాలకు హడల్‌.. నా కౌగిలికి వచ్చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement