తైపీ: తైవాన్ రాజధాని తైపీ మేయర్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీ (కేఎంటీ) మరోసారి విజయం సాధించింది. ప్రస్తుత మేయర్ చియాంగ్ వాన్‌ఆన్ తిరిగి ఎన్నికయ్యారు. అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) అభ్యర్థి ప్యూమా షెన్‌పై హోరాహోరీ పోరులో ఆయన పైచేయి సాధించారు. ఓట్ల లెక్కింపులో చియాంగ్ స్పష్టమైన ఆధిక్యంలో ఉండటంతో షెన్ ఓటమిని అంగీకరించారు.
చైనాతో సన్నిహిత సంబంధాలకు మద్దతు తెలిపే కేఎంటీ పార్టీలో చియాంగ్ కీలక నేతగా గుర్తింపు పొందారు. 47 ఏళ్ల ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. భవిష్యత్తులో తైవాన్ అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశమున్న నాయకుడిగానూ రాజకీయ వర్గాలు ఆయనను చూస్తున్నాయి. శనివారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 8 గంటలకు చియాంగ్ ప్రచార కార్యాలయం వద్ద వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ఆయన విజయం ప్రకటించారు.
తన విజయంపై చియాంగ్ హర్షం వ్యక్తం చేశారు. తనకు మద్దతు తెలిపిన వారితోపాటు ప్రత్యర్థి షెన్, ఆయన మద్దతుదారులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఓటు వేయని వారి నిర్ణయం తమకు మరింత బాధ్యతను గుర్తుచేస్తోందన్నారు. రాబోయే నాలుగేళ్లలో మరింత కష్టపడి ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, ఫలితం ఎలా ఉన్నా తైవాన్ ప్రజాస్వామ్యమే విజేతగా నిలిచిందని షెన్ వ్యాఖ్యానించారు.
1994 నుంచి తైపీ నగర పాలనకు దూరంగా ఉన్న అధికార డీపీపీ.. ఈసారి ఎలాగైనా నగరంపై పట్టు సాధించాలని ప్రయత్నించింది. అయితే తాజా ఫలితంతో ఆ పార్టీకి మరోసారి నిరాశ ఎదురైంది. తైవాన్‌లోని 16 కౌంటీలు, ఆరు ప్రధాన నగర పాలక సంస్థల్లో సుమారు 11 వేల పదవులకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలను చైనా కూడా నిశితంగా పరిశీలిస్తోంది. స్వయంపాలిత తైవాన్‌ను తమ భూభాగంలో భాగంగా పేర్కొంటున్న చైనా.. అవసరమైతే బలప్రయోగం ద్వారానైనా విలీనం చేసుకుంటామని గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇదీ చదవండి: బ్రిటన్ పెన్షన్ శాఖపై సైబర్ దాడి


