లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ అడుగుపెట్టింది. మాజీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు నేతృత్వంలోని సర్వజన్ సనాతన్ పార్టీ (ఎస్‌ఎస్‌పీ) 2027 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
తెలంగాణతో లింకు..
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎం. నాగేశ్వరరావు 1986 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన, అనంతరం ఐఐటీ మద్రాస్‌లో పరిశోధన చేశారు. 1986లో ఐపీఎస్‌లో చేరిన ఆయన ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేశారు. 1996లో జగత్‌సింగ్‌పూర్ ఎస్పీగా ఉన్న సమయంలో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించి ఓ క్లిష్టమైన కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. నేర పరిశోధనతోపాటు మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లోనూ పనిచేశారు. సీఆర్‌పీఎఫ్‌లో పలు కీలక హోదాలు నిర్వహించారు.
సీబీఐలో కాలుమోపి..
2016లో సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా చేరి అనంతరం అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. 2018 అక్టోబర్‌లో అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను పదవి నుంచి తప్పించిన నేపథ్యంలో నాగేశ్వరరావుకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. 2019 జనవరిలో మరోసారి ఈ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డ్స్ విభాగాలకు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. 2020 జూలై 31న పదవీ విరమణ చేశారు. పోలీసు సేవల్లో విశిష్ట ప్రతిభకు గాను రాష్ట్రపతి పోలీసు పతకాలు సహా పలు పురస్కారాలు అందుకున్నారు. 2026 అక్టోబర్‌లో వారణాసి నుంచి సర్వజన్ సనాతన్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
అభ్యర్థులకు ఈ అర్హతలు తప్పనిసరి
తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నాగేశ్వరరావు కొన్ని నిబంధనలు విధించారు. దరఖాస్తుదారులు భారత పౌరులై ఉండాలి. ఉత్తరప్రదేశ్‌లోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. నామినేషన్ పత్రాల పరిశీలన నాటికి కనీసం 25 ఏళ్లు నిండి ఉండాలి. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, విధానాలకు కట్టుబడి పనిచేయడానికి అంగీకరించాలి.
రెండు దశల్లో అభ్యర్థుల ఎంపిక
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని నాగేశ్వరరావు వెల్లడించారు. మొదటి దశలో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రాథమిక పరిశీలన చేపడతారు. అందులో అర్హులుగా గుర్తించినవారిని రెండో దశకు ఆహ్వానిస్తారు. అప్పుడు పూర్తిస్థాయి వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసినంత మాత్రాన పార్టీ టికెట్ ఖాయమైనట్లు కాదని స్పష్టం చేశారు. అభ్యర్థుల తుది ఎంపికను పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు.
కుల రాజకీయాలకు ప్రత్యామ్నాయమంటూ..
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత విలువల ఆధారంగా రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని నాగేశ్వరరావు చెబుతున్నారు. కుల, సామాజిక విభజనల ఆధారంగా సాగే రాజకీయాలకు భిన్నంగా రాజ్యాంగ ప్రజాస్వామ్యం, ఆధునిక అభివృద్ధి, ప్రతి పౌరుడి సంక్షేమం, గౌరవానికి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. గతాన్ని తిరిగి తీసుకురావడం తమ ఉద్దేశం కాదని, భారతదేశ వారసత్వంలోని మంచి అంశాలను ఆధునిక పరిజ్ఞానం, ఆవిష్కరణలతో ముందుతరాలకు అందించాలనుకుంటున్నామని వివరించారు.
బీజేపీకి పోటీ ఇవ్వగలదా?
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 255 స్థానాలు గెలుచుకుంది. అప్నాదళ్ (సోనెలాల్) 12, నిషాద్ పార్టీ ఆరు స్థానాలు సాధించడంతో ఎన్డీఏ కూటమి బలం 273కు చేరింది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలు గెలుచుకోగా, దాని మిత్రపక్షాలకు మరో 14 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ రెండు, బీఎస్పీ ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 403 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్న నాగేశ్వరరావు పార్టీ యూపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.
ఇదీ చదవండి: ‘ముగ్గురి మరణంతో సోనియాకు పట్టం’.. కంగనా సంచలన వ్యాఖ్యలు!


