‘ముగ్గురి మరణంతో సోనియాకు పట్టం’.. కంగనా సంచలన వ్యాఖ్యలు! | Kangana Ranaut Targets Sonia Gandhi | Sakshi
Sakshi News home page

‘ముగ్గురి మరణంతో సోనియాకు పట్టం’.. కంగనా సంచలన వ్యాఖ్యలు!

Nov 11 2026 12:32 PM | Updated on Nov 11 2026 12:38 PM

Kangana Ranaut Targets Sonia Gandhi

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబ రాజకీయ చరిత్రపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. గాంధీ కుటుంబంలోకి ఓ విదేశీయురాలు ప్రవేశించడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలన్నీ అనేక సందేహాలకు తావిస్తున్నాయని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. ముగ్గురు కీలక వ్యక్తుల మరణాల తర్వాత రాజకీయ వారసత్వంగా సోనియా గాంధీకి ప్రాధాన్యం పెరగడాన్ని ప్రస్తావించారు.

తన సినిమా 'ఎమర్జెన్సీ' కోసం భారత రాజకీయాలు, గాంధీ కుటుంబ చరిత్రపై విస్తృతంగా పరిశోధన చేసినట్లు కంగనా తెలిపారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న ఎన్విడియా హనీట్రాప్ వివాదాన్ని ప్రస్తావిస్తూ గాంధీ కుటుంబంలోకి ఓ విదేశీయురాలు ప్రవేశించిన విషయంతో పోలిక తెచ్చారు. సోనియా గాంధీ రాజకీయంగా దశాబ్దాలపాటు ప్రభుత్వంపై ప్రభావం చూపారని, 2014 తర్వాత పరిస్థితులు మారాయని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల విషయంలోనూ సోనియా వైఖరిని విమర్శించారు.

మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీకి ఎదురైన పరిస్థితులను కంగనా ప్రస్తావించారు. భర్త మరణించిన తర్వాత చిన్న వయసులో ఉన్న మేనకను, ఆమె కుమారుడితో కలిసి గాంధీ కుటుంబ నివాసం నుంచి బయటకు పంపించడంపై ప్రశ్నించారు. సంజయ్ మేనకను ఎంతో ప్రేమించారని, అలాంటి యువ వితంతువుకు కుటుంబంలో ఎదురైన పరిస్థితులు బాధాకరమని వ్యాఖ్యానించారు.

ఇటీవల విడుదలైన సోనియా గాంధీ జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో మేనకతో కుటుంబానికి ఏర్పడిన విభేదాల గురించి వివరించారు. 526 పేజీల ఈ పుస్తకంలో మేనక 1973 చివర్లో సంజయ్‌కు పరిచయమయ్యారని, 1974 సెప్టెంబర్‌లో వీరి వివాహం జరిగిందని సోనియా పేర్కొన్నారు. అప్పటికి మేనక వయసు 18 సంవత్సరాలు.

ప్రారంభంలో మేనకను చిన్న చెల్లెలిలా ఆహ్వానించానని సోనియా గుర్తుచేసుకున్నారు. అయితే కాలక్రమేణా మేనక, సంజయ్ మధ్య విభేదాలు పెరిగాయని, వారి వాదనలు కుటుంబ సభ్యుల ముందే జరిగేవని రాశారు. కోపం వచ్చినప్పుడు మేనక అసభ్య పదజాలం ఉపయోగించేవారని, ఇందిరాగాంధీ సమక్షంలోనూ అలా మాట్లాడటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించారు.

అయితే ఉమ్మడి కుటుంబంలో జీవించడం, స్వేచ్ఛగా ఉండే స్వభావం కలిగిన యువతి మేనకకు సులభం కాకపోయి ఉండవచ్చని సోనియా భావించారు.. ఈ నేపథ్యంలో సోనియా పుస్తకంలోని పాత కుటుంబ విభేదాలు, కంగనా తాజా వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి చర్చకు దారితీశాయి.

ఇదీ చదవండి: సోనియా పుస్తకం: బీజేపీకి అస్త్రం.. సొంత పార్టీకి ‘ఎసరు’?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement