లక్నో: 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం), చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) నిర్ణయించినట్లు సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 12న లక్నోలో నిర్వహించనున్న మీడియా సమావేశంలో ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ అధికారికంగా ఈ కూటమిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కూటమిలోకి మరిన్ని పార్టీలు?
ప్రతిపాదిత కూటమిని మరింత విస్తరించేందుకు ఇతర రాజకీయ నేతలు, చిన్న పార్టీలతోనూ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. నవంబర్ 12న ప్రకటన వెలువడితే యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల ఎన్నికల బరిలో మరో రాజకీయ కూటమి రంగంలోకి దిగినట్లవుతుంది.
ఒకే వేదికపై ఒవైసీ, ఆజాద్
ఈ కూటమి ద్వారా ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఒకే వేదికపైకి రానున్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడిగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ ప్రస్తుతం నాగినా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే పొత్తుపై అవగాహన కుదిరింది.
బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యమా?
ఉత్తరప్రదేశ్‌లో ఏఐఎంఐఎం తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఒవైసీ ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనుకునే పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలో ఒవైసీ ప్రకటించారు.
ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన
2027 ఎన్నికల కోసం ఏఐఎంఐఎం ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ ఆజాద్ పార్టీతో కుదిరినట్లు చెబుతున్న అవగాహన ఒప్పందం ఏఐఎంఐఎం ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారే అవకాశం ఉంది.
రాజకీయ వర్గాల దృష్టి
లక్నోలో జరగనున్న మీడియా సమావేశంలో కూటమిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మరిన్ని పార్టీలు ఇందులో చేరతాయా? సీట్ల పంపకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: ‘రామాయణం’ చూసొచ్చి.. జటాయు సెంటర్‌కు పరుగులు!


