చడయమంగళం: ‘రామాయణం’ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన రణబీర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కేరళలోని జటాయువు భారీ శిల్పం మరోసారి వార్తల్లో నిలిచింది. కొల్లం జిల్లాలోని చడయమంగళంలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్‌ను సందర్శించేందుకు పర్యాటకులు, సినీ అభిమానులు తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పంగా గుర్తింపు పొందిన ఈ విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రామాయణంలో సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకెళ్తున్న సమయంలో జటాయువు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. రావణుడితో పోరాడి చివరకు ప్రాణాలు విడుస్తుంది. ఈ ఘట్టానికి ప్రతిరూపంగా జటాయు పారా అనే భారీ కొండపై ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. జటాయువు సీతమ్మను రక్షించేందుకు చేసిన పోరాటాన్ని ఈ విగ్రహం ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన కేరళ పర్యాటక శాఖకు ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అభినందనలు తెలిపారు. రామాయణం సినిమా చూసిన అనంతరం ఈ ప్రాంతానికి పర్యాటకులు తరలివస్తున్నారని ఆయన అన్నారు. జటాయువు చివరి ఘట్టంతో ముడిపడిన ఈ ప్రదేశం భారతీయ పురాణాలు, సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి ఉన్నవారిని ఆకర్షిస్తోందని పర్యాటక శాఖ పేర్కొంది.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పి.సి. విష్ణునాథ్ మాట్లాడుతూ.. కేరళలో పర్యాటకానికి జటాయు ఎర్త్ సెంటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. రామాయణం సినిమా విడుదల అనంతనం ఈ పురాణ ప్రదేశంపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందని తెలిపారు. ఈ కొండపై శ్రీరాముడి ఆలయం కూడా ఉందని తెలిపారు.
కేరళలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన తొలి పర్యాటక ప్రాజెక్టు ఇదే. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) విధానంలో దీనిని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు, శిల్పి రాజీవ్ అంచల్ తన బృందంతో కలిసి ఈ భారీ జటాయువు శిల్పాన్ని రూపొందించారు.
దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన రామాయణం సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటించారు. ఈ సినిమా కారణంగా రామాయణంలోని పలు ఘట్టాలతో సంబంధం ఉన్న ప్రదేశాలపై ప్రజుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పురాణాలు, కళలు, ప్రకృతి అందాలను కలగలిపిన జటాయు ఎర్త్ సెంటర్‌కు మరింత ఆదరణ లభిస్తున్నది.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా మేయర్ పీఠంపై భారతీయుడు.. ఎవరీ అభిషేక్ అవస్థి?


