బ్రిటన్‌ పెన్షన్‌ శాఖపై సైబర్ దాడి | UKs pension department suffers cyberattack days after hack of US Air Force cloud system | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ పెన్షన్‌ శాఖపై సైబర్ దాడి

Nov 29 2026 7:09 AM | Updated on Nov 29 2026 7:09 AM

UKs pension department suffers cyberattack days after hack of US Air Force cloud system

లండన్‌: అమెరికా వైమానిక దళం క్లౌడ్‌ వ్యవస్థపై హ్యాకర్ల దాడి ఘటన మరువకముందే, తాజాగా బ్రిటన్‌ ప్రభుత్వ విభాగంపైనా సైబర్‌ దాడి జరిగింది. పెన్షన్లు, సంక్షేమ పథకాల చెల్లింపులను నిర్వహించే బ్రిటన్‌ కార్మిక, పింఛన్ల శాఖ (డీబ్ల్యూపీ) నవంబర్‌ 28న సైబర్‌ దాడికి గురైంది. తమ కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి అనధికారికంగా ప్రవేశించేందుకు ప్రయత్నం జరిగినట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటనతో పలు ఆన్‌లైన్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సైబర్‌ భద్రతా నిపుణులు దాడికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయినప్పటికీ పెన్షన్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయని బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతమంది లబ్ధిదారులు చెల్లింపుల్లో జాప్యం జరిగినట్లు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆ ఆలస్యానికి తాజా సైబర్‌ దాడితో సంబంధం లేదని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. నవంబర్‌ 28 సాయంత్రం 5 గంటల సమయానికి కూడా కొన్ని ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రాలేదు. నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌, ప్రభుత్వ సైబర్‌ సమన్వయ కేంద్రంతో కలిసి దాడి స్వరూపాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు రోజు అమెరికా వైమానిక దళానికి చెందిన కీలకమైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వేదిక 'క్లౌడ్‌ వన్‌'పైనా హ్యాకర్లు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ చొరబాటుతో సైనిక కార్యకలాపాలు, సిబ్బంది, రవాణా, ఇతర కీలక సమాచారానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేసే సమయంలో ఈ చొరబాటును గుర్తించారు. దీంతో బ్యాక్‌ ఆఫీస్‌ వ్యవస్థల మార్పిడి ప్రక్రియను నిలిపివేయడంతోపాటు కీలక అప్లికేషన్ల అప్‌డేట్లను కూడా అడ్డుకున్నారు.

ఈ ఘటనపై నష్టం అంచనా వేసేందుకు అమెరికా సైబర్‌ కమాండ్‌ రంగంలోకి దిగింది. అయితే దాడికి పాల్పడిన హ్యాకర్లు ఎవరు? ఎంతమేరకు వ్యవస్థల్లోకి చొరబడ్డారు? ఏమైనా సమాచారం చోరీకి గురైందా? అనే అంశాలు ఇంకా స్పష్టతకు రాలేదు. వరుసగా రెండు దేశాల కీలక ప్రభుత్వ, రక్షణ వ్యవస్థలు సైబర్‌ దాడులకు గురికావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 

ఇదీ చదవండి: యెమెన్ తీరంలో హైజాక్ కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement