అణ్వస్త్ర ఉపగ్రహ ప్రయోగానికి రష్యా రెడీ?  | Russia could launch nuclear-armed satellite Sputnik-S into Earth orbit | Sakshi
Sakshi News home page

అణ్వస్త్ర ఉపగ్రహ ప్రయోగానికి రష్యా రెడీ? 

Nov 29 2026 5:27 AM | Updated on Nov 29 2026 5:27 AM

Russia could launch nuclear-armed satellite Sputnik-S into Earth orbit

జర్మనీ మీడియాలో కథనాలు 

నాటో ఉన్నతాధికారి కీలక ప్రకటన 

ఔటర్‌ స్పేస్‌ ట్రీటీలో లొసుగుల సవరణకు యత్నాలు

సిడ్నీ: రష్యా త్వరలోనే అణ్వాస్త్రాలున్న ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుందా? అవును అంటోంది జర్మనీ మీడియా. రెండేళ్ల క్రితం అమెరికా ఇదే రకమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయోగం ఎప్పుడన్న విషయంపై మాత్రం అమెరికా స్పష్టత ఇవ్వలేదు. తాజా పరిస్థితిని చూస్తే జర్మనీ మీడియా సంస్థల కథనాల ప్రకారం రష్యా అణ్వాస్త్రాన్ని అమర్చిన స్పుట్నిక్‌–5 ఉపగ్రహాన్ని చాలాకాలం క్రితమే సిద్ధం చేసి మాస్కో సమీపంలోని ఒక స్థావరంలో భద్రపరిచింది. నాటో కూటమిలోని యూరోపియన్‌ దేశాల నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని ఇప్పటికే పంచుకున్నాయి. 

ఈ వారం కూటమి సెక్రటరీ జనరల్‌ మాట్లాడుతూ నాటో సరిహద్దులను రక్షించుకోవడం అంటే రష్యా అంతరిక్ష వ్యవస్థల నుంచి కాపాడుకోవడం కూడా అని స్పష్టం చేయడం గమనార్హం. అయితే బెర్లిన్‌లోని రష్యా దౌత్యకార్యాలయం మాత్రం అంతరిక్ష అణ్వాయుధసహిత ఉపగ్రహ ప్రయోగం ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని చెబుతోంది. ఇది ఒట్టి ప్రచారం మాత్రమేనని, రష్యా 1967 నాటి ఔటర్‌ స్పేస్‌ ట్రీటీకి కట్టుబడి ఉందని తెలిపింది. ఈ ఒప్పందం ఏమిటి? అణ్వాస్త్రాల గురించి ఏం చెబుతుంది? దేశాలు ప్రయోగించే ఉపగ్రహాల్లో ఏముందో అంతర్జాతీయ సమాజం పరిశీలించవచ్చా? అన్నది ఇప్పుడు సశేష ప్రశ్నలుగా మిగిలాయి. 

ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే ప్రచ్ఛన్న యుద్ధం కాలానికి వెళ్లాలి. అప్పట్లో అమెరికా, సోవియట్‌ యూనియన్లు రెండు అణ్వాయుధాలను అంతరిక్షంలోకి చేర్చకూడదన్న అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇరుదేశాల మధ్య పోటీ ఎంత ఉన్నప్పటికీ ఈ విషయంలో రాజీ పడటం అంతర్జాతీయ సహకారానికి ప్రతీక అని అప్పట్లో ప్రశంసలు వినిపించాయి. కానీ భూమ్మీద ఈ రెండు దేశాల మధ్య ఆయుధపోటీ మాత్రం తగ్గలేదు. ఇక ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ విషయానికి వద్దాం. ఇందులోని నాలుగో ఆర్టికల్‌ ప్రకారం.. దేశాలు అణ్వాస్త్రాలను మోసుకెళ్లే ఏరకమైన వస్తువులను భూ కక్ష్యలో ఉంచకూడదు. సామూహిక హననానికి దారితీసే ఆయుధాలను అంతరిక్షంలోని స్టేషన్లలో కానీ, ఖగోళ వస్తువులపై కానీ ర్పాటు చేయరాదు. కక్ష్యలో అణ్వాస్త్రాన్ని పేలిస్తే పాక్షిక అణు పరీక్షల నిషేధ చట్టం (1963) ఉల్లంఘించినట్లు అవుతుంది.  

భూమికి పొంచి ఉన్న ముప్పు! 
ఇప్పటివరకూ ఏ దేశం కూడా భూ కక్ష్యలో అణ్వాయుధాలను మోహరించలేదు కానీ అణ్వాయుధ పరీక్షలు కొన్ని జరిగాయి. 1962లో హవాయి ప్రజలకు అణు పరీక్షల ఆనవాలుగా ఆకాశంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి ‘‘ఆకాశం పేలిపోయినట్లు’’ అనిపించిందని, ఆ తర్వాత అది చిక్కటి ఎరుపు రంగులో చాలాసేపు అలాగే ఉండిపోయిందని గుర్తు చేసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా పసిఫిక్‌ మహాసముద్రానికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ‘స్టార్‌ఫిష్‌ ప్రైమ్‌’ అన్న కోడ్‌నేమ్‌తో నిర్వహించిన అణ్వాయుధ పరీక్ష ప్రభాం ఇది. అయితే ఈ ప్రయోగ సమయంలో కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలతోపాటు ఆ తర్వాత కొన్ని వారాల్లో ప్రయోగించిన మొత్తం 24 ఉపగ్రహాలలో కనీసం ఎనిమిది ఆ పేలుడు ధాటికి దెబ్బతిన్నాయి. 

కక్ష్యలో వేల ఉపగ్రహాలు... 
ప్రస్తుతం భూకక్ష్యలో సుమారు 15,800 ఉపగ్రహాలు పని చేస్తున్నాయని అంచనా. జీపీఎస్‌తో మొదలుపెట్టి బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్ల వరకు అనేక మౌలిక సదుపాయాలకు ఇవే ఆధారం. కొన్ని ఉపగ్రహాలు భూమ్మీద ఉండే అణ్వాస్త్రాల నియంత్రణకు ఇంకొన్ని క్షిపణి దాడులను ముందే పసిగట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు ఉపయోగపడుతూంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్షంలో అణ్వాయుధాల ఏర్పాటు చేస్తే చిక్కులు తప్పవు. ఒకవేళ ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని మిగిలిన దేశాలు నిషేధించినప్పటికీ తనకు ఉన్న వీటో అధికారంతో రష్యా ఆ నిర్ణయాన్ని రద్దు చేయగలదు. ఆసక్తికరంగా ఒక ఉపగ్రహంలో అణ్వాయుధం ఉందో లేదో తనిఖీ చేయడానికి ప్రస్తుతం ఎలాంటి ఏర్పాటు, విధానం లేదు. ఈ రకమైన ఏర్పాటు కోసం ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement