టర్కీలో ప్రతిపక్ష మీడియాపై ఉక్కుపాదం.. | Turkey Halk TV Media Crackdown | Sakshi
Sakshi News home page

టర్కీలో ప్రతిపక్ష మీడియాపై ఉక్కుపాదం..

Nov 28 2026 12:23 PM | Updated on Nov 28 2026 12:23 PM

Turkey Halk TV Media Crackdown

టర్కీలో ప్రతిపక్షానికి మద్దతుగా వార్తలు ప్రసారం చేస్తున్న ప్రముఖ టీవీ ఛానల్‌ ‘హాల్క్‌ టీవీ’ (Halk TV)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. అధికారుల చర్యలతో ఛానల్‌ పూర్తిగా దెబ్బతిన్నదని హాల్క్‌ టీవీ యజమాని కేఫర్‌ మహిరోగ్లు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వారం ఛానల్‌తో సంబంధం ఉన్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

గత నెలలో హాల్క్‌ టీవీని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకున్న సమయంలో తన కుటుంబ సభ్యులు కూడా అరెస్టయ్యారని మహిరోగ్లు పేర్కొన్నారు. మనీలాండరింగ్‌, లంచం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగినట్లు సమాచారం. అయితే, తనపైనా, ఛానల్‌పైనా వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇస్తాంబుల్‌ చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ప్రకారం.. ఇటీవల అరెస్టయిన వారిలో ఛానల్‌కు చెందిన ఇద్దరు మాజీ న్యూస్‌ యాంకర్లు కూడా ఉన్నారు. డబ్బులు తీసుకుని తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ వారిపై ఆరోపణలు చేశారు. ఛానల్‌ న్యూస్‌ కోఆర్డినేటర్‌ కుర్షాద్‌ ఓగుజ్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, ఆయనపై కూడా అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.

ఈ క్రమంలో తాను టర్కీకి తిరిగి వెళ్తే జైలుకు పంపే అవకాశం ఉందని మహిరోగ్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం మీడియాను తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. తన ఛానల్‌ కంటే దేశం, ప్రజాస్వామ్యం గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నానని వ్యాఖ్యానించారు. గత నెలలో హాల్క్‌ టీవీ ప్రధాన కార్యాలయంపై అధికారులు దాడులు చేయడంతో ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. అనంతరం ఛానల్‌ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ప్రభుత్వం కొత్త నిర్వాహకుడిని నియమించింది.

ఈ నేపథ్యంలో టర్కీ మీడియాపై ప్రభుత్వ నియంత్రణ ఉందని, పత్రికా స్వేచ్ఛ విషయంలో ఆ దేశం అంతర్జాతీయంగా వెనుకబడిందని విమర్శలు ఉన్నాయి. అయితే, జర్నలిస్టులు తమ వృత్తిపరమైన విధులు నిర్వహించినందుకు వారిని అరెస్టు చేయడం లేదని ప్రభుత్వం చెబుతోంది. 2023 అధ్యక్ష ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన తర్వాత ఎర్డోగన్‌ ప్రభుత్వం అసమ్మతి స్వరాలపై చర్యలను పెంచిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఎర్డోగన్‌కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఇస్తాంబుల్‌ మేయర్‌ ఎక్రెమ్‌ ఇమామోగ్లును అవినీతి ఆరోపణలు, ఎన్నికల చట్టాల ఉల్లంఘన కేసుల్లో జైలుకు పంపారు. అయితే, ఈ ఆరోపణలను ఇమామోగ్లు, ఆయన పార్టీ తీవ్రంగా ఖండించాయి. ఆయనకు మద్దతుగా నిలిచిన వందలాది మందిపైనా కేసులు నమోదు కాగా, కార్యకర్తలు, న్యాయవాదులు, హాస్యనటులు సైతం జైలు పాలయ్యారు. ఈ పరిణామాలన్నీ టర్కీలో ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: సౌదీకి డేంజర్‌ బెల్స్‌.. వణుకుతున్న గల్ఫ్ దేశం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement