వాషింగ్టన్: చిన్నప్పుడు అతనికి ఎదురైన ఓ మంచి అనుభవం జీవిత లక్ష్యంగా మారింది. ఒకప్పుడు కుటుంబంతో కలిసి కారులోనే నివసించిన ఆ బాలుడు.. నేడు వేలాది కుటుంబాలకు పండగ భోజనం అందించే స్థాయికి ఎదిగాడు. అమెరికాకు చెందిన రాబ్ ఆడమ్స్ ప్రారంభించిన ‘థాంక్స్ గివ్వింగ్ హీరోస్’ సంస్థ ఇప్పటివరకు 29 వేలకుపైగా కుటుంబాలకు పండగ సందర్భంగా ఆహారాన్ని అందించింది.
కారులోనే బాల్యం
అమెరికాలోని దక్షిణ టెక్సాస్‌లో ఆరుగురు పిల్లలున్న కుటుంబంలో రాబ్ ఆడమ్స్ పెద్దవాడు. చిన్నతనంలో అతడి కుటుంబం హ్యూస్టన్ సమీపంలోని పోర్టర్ ప్రాంతంలో పికప్ ట్రక్కులో నివసించేది. వారికి సరైన దుస్తులు కూడా ఉండేవి కాదు. పాఠశాలలో ఇచ్చే మధ్యాహ్న భోజనమే రోజులో లభించే నమ్మకమైన ఆహారం. అయితే చిన్నతనంలో ఎదురైన కష్టాల మధ్య కూడా అతడికి ఓ మధురమైన అనుభవం ఎదురైంది.
మరచిపోలేని పొరుగింటి సాయం
ఓ క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్‌సన్ అనే పొరుగింటి కుటుంబం.. రాబ్ కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానించింది. వారు సెలవులపై వెళ్లే సమయంలో తమ ఇంట్లో ఉండాలని కోరింది. అంతేకాకుండా ఫ్రిజ్‌లో వారి కోసం పలు ఆహార పదార్థాలను ఉంచింది. పిల్లల కోసం క్రిస్మస్ చెట్టు కింద బహుమతులు కూడా ఏర్పాటు చేసింది. ఆ కుటుంబం చూపిన నిస్వార్థ ప్రేమ రాబ్‌పై చెరగని ముద్ర వేసింది.
11 ఏళ్ల వయసులోనే మాట
అప్పటికి రాబ్ వయసు 11 ఏళ్లు. భవిష్యత్తులో తాను ఆర్థికంగా స్థిరపడినప్పుడు మరో కుటుంబానికి ఇలాంటి సాయం చేస్తానని తల్లికి మాట ఇచ్చాడు. తనకు ఒకరు చేసిన మేలును మరొకరికి అందించాలని భావించాడు. కొన్నేళ్ల తర్వాత అతడి తల్లికి బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ సమయంలో చిన్నతనంలో ఇచ్చిన మాటను తల్లి గుర్తుచేసింది. దాన్ని నెరవేర్చాలని ప్రోత్సహించింది. దీంతో రాబ్ ‘థాంక్స్ గివింగ్ హీరోస్’ కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
10 కుటుంబాలతో మొదలై..
మొదటి ఏడాది కేవలం 10 కుటుంబాలకు భోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అనూహ్యంగా 755 కుటుంబాలకు ఆహారాన్ని అందించగలిగాడు. 2015 నుంచి ఉటా ప్రాంతంలో దాదాపు 20 వేల కుటుంబాలకు ఈ సంస్థ భోజనం అందించింది. 2026లో ఉటాలో మరో 3,600 కుటుంబాలకు ఆహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దేశవ్యాప్తంగా విస్తరణ
ప్రస్తుతం ఈ కార్యక్రమం అమెరికాలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో 2020 నుంచి 6,600కుపైగా కుటుంబాలకు, లాస్‌వేగాస్‌లో 2021 నుంచి వందలాది కుటుంబాలకు భోజనం అందించారు. ఫీనిక్స్, కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ, ఒహియోలోని స్టార్క్ కౌంటీ, కనెక్టికట్‌లోని న్యూ హేవెన్ ప్రాంతాల్లోనూ కొత్త విభాగాలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 29 వేలకుపైగా కుటుంబాలకు ఈ సంస్థ సేవలందించింది.
కుటుంబంలో ఐదుగురికి సరిపడా భోజనం
ఒక్కో భోజన కిట్‌లో ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడా టర్కీ మాంసం, ఇతర వంటకాలు ఉంటాయి. వందలాది మంది వాలంటీర్లు వీటిని సిద్ధం చేసి, సంస్థ వెబ్‌సైట్ ద్వారా ఇతరులు సిఫార్సు చేసిన కుటుంబాల ఇళ్లకు చేరవేస్తారు. సాయం పొందేందుకు ప్రత్యేకంగా పేదరికాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిధుల సేకరణ, భోజన కిట్ల తయారీ, పంపిణీ కోసం ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నతనంలో అందుకున్న ఆప్యాయతను వేల కుటుంబాలకు పంచుతూ రాబ్ ఆడమ్స్ తన 11 ఏళ్ల వయసులో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
ఇదీ చదవండి: CBSE: ఎనిమిదేళ్లలో కెమిస్ట్రీకి 70% పెరిగిన ఆదరణ!


