విమానంలో ప్రయాణించేటప్పుడు మనలో చాలామంది ముందుగా ఆలోచించేది భోజనం గురించే. చికెన్ బిర్యానీ వస్తుందా? పాస్తా ఉంటుందా? వెజ్ మీల్ తీసుకోవాలా? అంటూ మెనూ గురించి ఆలోచిస్తుంటాం. అయితే.. విమానం ముందుభాగంలో కూర్చొని దాన్ని నడిపించే ఇద్దరు పైలట్లు మాత్రం ఒకే భోజనం తినరని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
విమానంలోని ఇద్దరు పైలట్లు ఒకే భోజనం తినకపోవడానికి కారణం.. ప్రత్యేక సదుపాయం కాదు. దీని వెనుక ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఓ ముఖ్యమైన కారణం ఉంది.
అందుకే వేరు వేరు భోజనం
ఒకే రకమైన ఆహారం ఇద్దరు పైలట్లు తిన్నారని అనుకుందాం. ఆ ఆహారం కలుషితమై ఉంటే, ఇద్దరికీ ఒకేసారి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. విమానం గాల్లో ఉన్న సమయంలో.. కెప్టెన్, కో-పైలట్ ఇద్దరూ ఒకేసారి అనారోగ్యానికి గురైతే పరిస్థితి ప్రమాదకరంగా మారొచ్చు. అందుకే.. చాలా విమానయాన సంస్థలు ఇద్దరు పైలట్లకు వేర్వేరు భోజనాలు అందించే విధానాన్ని పాటిస్తాయి. ఉదాహరణకు ఒక పైలట్ చికెన్ మీల్ తీసుకుంటే, మరొక పైలట్ వెజిటేరియన్ లేదా వేరే రకమైన మీల్ తీసుకోవచ్చు.
వేరువేరు భోజనాలు అందించడం వల్ల.. అనారోగ్యం వచ్చినా, మరో పైలట్ ఆరోగ్యంగా ఉండి విమానాన్ని సురక్షితంగా నడిపించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. కొన్ని సుదీర్ఘ విమాన ప్రయాణాల్లో పైలట్లు ఒకేసారి భోజనం చేయకుండా వేర్వేరు సమయాల్లో తినే విధానాన్ని కూడా పాటిస్తారు.
ఇలా చేయడం వల్ల ప్రమాదాన్ని మరింత తగ్గించవచ్చు. ఉదాహరణకు ముందుగా భోజనం చేసిన పైలట్‌కు కొంతసేపటి తర్వాత అనారోగ్య లక్షణాలు కనిపిస్తే, రెండో పైలట్ అదే ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు.
ప్రత్యేకమైన చట్టం ఉందా?
ఇద్దరు పైలట్లు తప్పనిసరిగా వేర్వేరు భోజనాలు తినాలనే ఒకే విధమైన ప్రత్యేకమైన చట్టం లేదు. సాధారణంగా ఇది ఆయా విమానయాన సంస్థలు తమ భద్రతా విధానాల్లో భాగంగా పాటించే జాగ్రత్త. విమాన ప్రయాణంలో చిన్న సమస్య కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు ప్రతి రిస్క్‌ను ముందుగానే తగ్గించేందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
విమానంలో సాధారణంగా పలువురు క్యాబిన్ సిబ్బంది ఉంటారు. వారిలో ఒకరు అనారోగ్యానికి గురైనా మిగిలిన సిబ్బంది ప్రయాణికులను చూసుకోగలరు. కానీ.. కాక్‌పిట్‌లో సాధారణంగా ఇద్దరు పైలట్లే ఉంటారు. ఇద్దరూ ఒకేసారి అనారోగ్యానికి గురైతే విమాన నిర్వహణపై నేరుగా ప్రభావం పడుతుంది. అందుకే పైలట్ల విషయంలో ఇలాంటి జాగ్రత్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఇదీ చదవండి: ఇండియాలో పైలట్ జీతాలు ఎంతో తెలుసా?


