దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటెయిలర్లలో ఒకటైన నయారా ఎనర్జీ.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.5, డీజిల్ ధరను లీటర్‌కు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం.. ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల.. అంతర్జాతీయ ముడిచమురు ధరలు, రూపాయి విలువ, రవాణా ఖర్చులు, కేంద్ర-రాష్ట్ర పన్నులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి.. నయారా ఎనర్జీ పెంచిన ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో అమలులో ఉన్న స్థానిక పన్నుల కారణంగా తుది ధరల్లో తేడాలు ఉంటాయి.
నయారా ఎనర్జీ.. దేశవ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది. కాబట్టి ఈ ధరల పెంపు నయారా బంకుల్లో ఇంధనం కొనుగోలు చేసే వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా.. రోజువారీ వాహనాలను ఉపయోగించే ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఖర్చులు పెరగడం వల్ల నెలవారీ రవాణా వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
నయారా ఎనర్జీ ఇంధన ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో కూడా కంపెనీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. తాజాగా మరోసారి ధరలు పెంచడంతో నయారా బంకుల్లో ఇంధనం కొనుగోలు చేసే వినియోగదారులు అదనపు భారం భరించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: AIతో ఉద్యోగాలకు ముప్పు.. కానీ వీరు మాత్రం సేఫ్!


