ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగిన సమయంలో ఇథనాల్ కలపకపోయి ఉంటే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.125కు చేరే అవకాశం ఉండేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇథనాల్‌ను ముందుగా నిర్ణయించిన ధరలకు దేశీయంగా కొనుగోలు చేయడం వల్ల అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రభావం కొంతమేర తగ్గిందని తెలిపింది.
ఎఫ్‌సీఐ బియ్యంపై ఆరోపణలు తప్పుదోవ పట్టించేవి
ఇథనాల్ తయారీ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) బియ్యాన్ని తక్కువ ధరకు డిస్టిలరీలకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆహార భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), సంక్షేమ పథకాలు, తప్పనిసరి బఫర్ నిల్వల అవసరాలు పూర్తయిన తర్వాత మాత్రమే మిగులు ధాన్యాన్ని ఇతర అవసరాలకు మళ్లిస్తామని తెలిపింది.
ఎఫ్‌సీఐ నుంచి ఇథనాల్ తయారీకి ఉపయోగిస్తున్నది ఆహార భద్రతకు అవసరమైన బియ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. ఆహార, ప్రజా పంపిణీ శాఖ గుర్తించిన మిగులు నిల్వలు, దెబ్బతిన్న ధాన్యం, మానవ వినియోగానికి పనికిరాని విరిగిన బియ్యం వంటి వాటినే వినియోగిస్తున్నట్లు వివరించింది.
బియ్యానికి ప్రత్యేక రాయితీ లేదు
ఇథనాల్ తయారీదారులకు ఎఫ్‌సీఐ బియ్యాన్ని ప్రత్యేకంగా తక్కువ ధరకు అందిస్తున్నారన్న వాదనను కూడా మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల వ్యవస్థలో ఇథనాల్ ఉత్పత్తికి అనుమతించిన పలు ఫీడ్‌స్టాక్స్‌లో ఎఫ్‌సీఐ బియ్యం కూడా ఒకటేనని పేర్కొంది.
2025-26 ఇథనాల్ సరఫరా సంవత్సరానికి వివిధ ముడి పదార్థాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు కేంద్రం నిర్ణయించిన కొనుగోలు ధరల్లో మొక్కజొన్నకు లీటరుకు రూ.71.86, చెరకు రసం/సిరప్‌కు రూ.65.61, దెబ్బతిన్న ఆహార ధాన్యాలకు రూ.64, బి-హెవీ మొలాసిస్‌కు రూ.60.73, ఎఫ్‌సీఐ బియ్యానికి రూ.60.32, సి-హెవీ మొలాసిస్‌కు రూ.57.97గా ఉన్నాయి.
2025-26లో ఇథనాల్ ఉత్పత్తిలో ఎఫ్‌సీఐ బియ్యం వాటా 24.64 శాతానికి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. రెండేళ్ల క్రితం ఇది కేవలం 0.02 శాతమేనని పేర్కొంది. ఆహార భద్రత అవసరాలకు మించి దేశంలో మిగులు ధాన్య నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.
20 శాతానికి చేరిన ఇథనాల్ మిశ్రమం
దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే స్థాయి గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. 2013-14లో 1.5 శాతం కంటే తక్కువగా ఉన్న బ్లెండింగ్ 2025-26లో 20 శాతానికి చేరింది. దీంతో 2030 నాటికి 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని భారత్ ఐదేళ్లు ముందుగానే సాధించింది. ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం కూడా 2014లోని సుమారు 421 కోట్ల లీటర్ల నుంచి 2026 నాటికి దాదాపు 2,000 కోట్ల లీటర్లకు పెరిగింది.
ఇథనాల్ మిశ్రమం ద్వారా 2014-15 నుంచి మే 2026 వరకు రూ.1.90 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసినట్లు కేంద్రం చెబుతోంది. అలాగే 310 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ముడిచమురు దిగుమతులకు ప్రత్యామ్నాయం లభించిందని, దాదాపు 930 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలిగామని పేర్కొంది. రైతులకు అదనంగా రూ.1.60 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు తెలిపింది.
ఇకపై 20 శాతానికి మించి పెంచుతారా?
ప్రస్తుతం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచే నిర్ణయం ఏదీ తీసుకోలేదని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. భవిష్యత్తులో అధిక మిశ్రమంపై నిర్ణయం తీసుకునే ముందు శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహించి, వాహన తయారీ సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు సహా సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది.
అదే సమయంలో E85ను ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మాత్రమే ప్రవేశపెట్టామని, అది దేశవ్యాప్తంగా సాధారణ పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచినట్లు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


