ఓవర్‌టైమ్ చేస్తున్నారా?.. యూకే కంపెనీలు ఏమంటాయో తెలుసా? | Indian Techie Viral Post Highlights Difference Between UK And Indian Work Culture | Sakshi
Sakshi News home page

ఓవర్‌టైమ్ చేస్తున్నారా?.. యూకే కంపెనీలు ఏమంటాయో తెలుసా?

Jul 31 2026 3:01 PM | Updated on Jul 31 2026 3:42 PM

Indian Techie Viral Post Highlights Difference Between UK And Indian Work Culture

ఒకప్పుడు చాలామంది ఉద్యోగమే జీవితం అని బ్రతికేవారు. కానీ నేడు కాలం మారింది. ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. అయితే.. ఈ విధానం ప్రతి దేశంలోనూ ఒకే విధంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ముఖ్యంగా భారత్, యూకే వంటి దేశాల మధ్య ఈ విషయంలో చాలా తేడా కనిపిస్తుంది.

ఇండియాలో వర్క్ లైఫ్
భారతదేశంలో చాలామంది ఉద్యోగులు ఆఫీస్ టైమ్ ముగిసిన తరువాత కూడా.. రాత్రి వరకు పని చేస్తుంటారు. సెలవు రోజుల్లో కూడా ఆఫీస్ వర్క్స్ చేసేవాళ్లు ఇండియాలో కోకొల్లలు. అలాంటి వారిని అంకితభావం ఉన్న ఉద్యోగులుగా, కంపెనీ కోసం కష్టపడేవారిగా భావిస్తారు. మరోవైపు.. సమయానికి పని ముగించి ఇంటికి వెళ్లేవారిని కొన్ని సంస్థలు నిబద్ధత లేని వారిగా చూస్తాయని చెబుతారు.

యూకేలో ఇలా..
అయితే.. యూకే వంటి దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ వర్క్ పూరవ్వగానే లేదా ఆఫీస్ టైమ్ ముగిశాక పనిచేయడానికి ఆసక్తి చూపించరు. కంపెనీలు కూడా ఎక్కువసేపు పనిచేయాలని ఒత్తిడి చేయవు. ఉద్యోగులు తమ కుటుంబానికి, ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించాలని సంస్థలు ప్రోత్సహిస్తాయి. వర్క్ టైమ్ ముగిశాక ఈమెయిల్స్ లేదా మెసేజ్‌లకు వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని భావిస్తారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుభవం
ఈ విషయాన్ని ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓమ్ తన అనుభవం ద్వారా వివరించాడు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి అతను రాత్రి 7 గంటల తర్వాత కూడా తన తన సహోద్యోగి పంపిన కామెంట్లకు సమాధానం ఇచ్చాడు. ఆఫీసు సమయం దాటిన తరువాత పనిచేయడాన్ని అలవాటుగా చేసుకోవద్దని, వృత్తిపరమైన.. వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పాటించాలని సహోద్యోగి సలహా ఇచ్చినట్లు చెప్పాడు.

నెటిజన్ల స్పందన
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు విదేశీ కంపెనీలు ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని గౌరవిస్తాయని ప్రశంసించగా, మరికొందరు ప్రతి కంపెనీ లేదా ప్రతి దేశాన్ని ఒకేలా చూడకూడదని అభిప్రాయపడ్డారు.

కష్టపడి పని చేయడం ఎంత అవసరమో, అదే విధంగా ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యమైనవని ఈ సంఘటన చెబుతోంది. పని కోసం జీవితాన్ని పూర్తిగా త్యాగం చేయడం కంటే.. పని - వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం ఉద్యోగిలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, పనిలో మెరుగైన ఫలితాలను తీసుకువస్తుంది. అందుకే ప్రతి ఉద్యోగి పని పట్ల బాధ్యతతో పాటు తన వ్యక్తిగత జీవితానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement