సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ఇది ఆత్మహత్య కాదు.. హత్యే అంటున్న కుటుంబం
హైదరాబాద్, మీర్‌పేట: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ శోభన్, మృతురాలి బంధువుల కథనం ప్రకారం. కూకట్‌పల్లి అల్విన్‌కాలనీకి చెందిన నర్సింహస్వామి, పద్మల కుమార్తె హేమ (28) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అల్మాస్‌గూడ వినాయకహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజ్‌కుమార్‌తో పదిహేను నెలల క్రితం ఈమెకు వివాహమైంది.
ఈ క్రమంలో హేమ గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన కొద్ది రోజులకే తాను మరో యువతితో ప్రేమలో ఉన్నానని, పెద్దల ప్రోద్బలంతోనే వివాహం చేసుకున్నానని భర్త రాజ్‌కుమార్ తరచూ భార్యతో గొడవపడేవాడని మృతురాలి బంధువులు తెలిపారు.
హేమ వేతనంతోనే ఈఎంఐలు, ఇంటి అవసరాలు తీరుస్తుండగా, రాజ్‌కుమార్ మాత్రం తన వేతనం గురించి చెప్పేవాడుకాదని, అదే విధంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంటికి రావాలన్నా తన అనుమతి ఉండాల్సిందేనని హేమను ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. వివాహమైన రోజు నుంచి తరచూ గొడవ పడేవాడని, దీంతో రెండు నెలలుగా హేమ పుట్టింటి వద్దే ఉంటోందని, నెల రోజుల క్రితం పెద్దమనుషులు నచ్చజెప్పడంతో మంచిగా ఉంటానని రాజ్‌కుమార్ హామీ ఇవ్వడంతో అత్తవారింటికి పంపామని కుటుంబ సభ్యులు చెప్పారు.
రాజ్‌కుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హేమ మానసికంగా కుంగిపోయిందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైనది కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తన బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి నర్సింహస్వామి ఆరోపించాడు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


