పల్లెపైనా సైబర్‌ పడగ! | Frauds increasing along with digital transactions: Telangana | Sakshi
Sakshi News home page

పల్లెపైనా సైబర్‌ పడగ!

Jul 31 2026 6:17 AM | Updated on Jul 31 2026 6:17 AM

Frauds increasing along with digital transactions: Telangana

డిజిటల్‌ లావాదేవీలతో పాటే పెరుగుతున్న మోసాలు

రైతులు, వృద్ధులు, మహిళలే లక్ష్యంగా కేటుగాళ్ల వల 

మోసపు మాటలు, ఆఫర్లతో గ్రామీణులకు బురిడీ 

సంక్షేమ పథకాల పేర్లూ విరివిగా వినియోగం 

అమాయకత్వం, అవగాహన లేమిని ఆసరాగా చేసుకుని కోట్లు స్వాహా 

అప్రమత్తతే ముఖ్యం అంటున్న పోలీసులు  

సైబర్‌ మోసానికి గురైతే హెల్ప్‌లైన్‌ నంబర్‌: 1930  

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని గోన్యాతండాకు చెందిన ధీరావత్‌ రమేశ్‌ను ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పేరిట సైబర్‌
నేరగాళ్లు మోసగించి సొమ్ము కాజేశారు. ఈ పథకం కింద మీకు రూ.12 లక్షల రుణం మంజూరైందంటూ నేరగాడు ఫోన్‌ చేశాడు. నమ్మకం కల్పించేలా ఈ స్కీమ్‌కు సంబంధించిన ఒక కాపీని సైతం వాట్సాప్‌కు పంపించాడు. ప్రతినెలా ఈఎంఐ ద్వారా రూ.43,062 కట్టాల్సి ఉంటుందని చెప్పడంతో రమేశ్‌ నిజమే అనుకున్నాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ ఫీజు పేరిట విడతల వారీగా ఆన్‌లైన్‌లో మొత్తం రూ.1.80 లక్షలు చెల్లించాడు. తర్వాత బాధితుడు ఫోన్‌ చేస్తే అవతలివైపు నుంచి
స్పందన లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన రమేశ్‌ ఈ ఏడాది జనవరి 1న స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ పంటకు అడ్వాన్స్‌ పంపుతున్నాం..’, ‘ప్రభుత్వ సబ్సిడీ జమ చేస్తున్నాం..., ‘మీ ఆవు కొనుగోలు చేస్తాం..ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ పంపుతున్నాం.. మీకు రుణం మంజూరైంది. 30 నిమిషాల్లోనే డబ్బు ఖాతాలో పడుతుంది’.. గ్రామీణ జనం సులభంగా మోసపోవడానికి ఇలాంటి అనువైన ఆఫర్లు ఇస్తూ సైబర్‌ కేటుగాళ్లు వారిని బురిడీ కొట్టిస్తున్నారు. ఇదే చివరి అవకాశం అంటూ ఒత్తిడికి గురి చేస్తున్నారు. మాయమాటలతో ఆందోళనకు గురిచేస్తున్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అమాయక రైతులు, మహిళలు, వృద్ధులు, చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. 

డిజిటల్‌ లావాదేవీలతో పాటే పెరుగుతున్న మోసాలు 
గ్రామాల్లో ఇటీవలి కాలం వరకు ప్రతి లావాదేవీ నగదుతోనే. రైతు పంట అమ్మినా, కూలీ చెల్లించినా, కిరాణా సామాను కొనుగోలు చేసినా డబ్బుతోనే. కానీ ఇప్పుడు పరిస్థితి దాదాపుగా మారింది. గ్రామపంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, ఎరువుల దుకాణం, పాల సేకరణ కేంద్రం, టీ దుకాణం, కూరగాయల బండి... ఎక్కడ చూసినా ఒక క్యూఆర్‌ కోడ్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. యూపీఐ ద్వారా చెల్లింపులు పెరిగాయి. ఈ డిజిటల్‌ విప్లవం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసినా, ఇది సైబర్‌ నేరగాళ్లకు కొత్త అవకాశాలను సృష్టించింది. ఇప్పుడు ఆన్‌లైన్‌ మోసాలు నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకూ విస్తరిస్తున్నాయి.

గ్రామాల్లో ఎక్కువ మందికి డిజిటల్‌ లావాదేవీలు, వీటిని ఆసరాగా చేసుకుని చేసే మోసాల గురించిన పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో ఇలాంటి కేసులు వేగంగా పెరుగుతున్నాయని సైబర్‌ పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల పేర్లను కూడా నేరగాళ్లు విరివిగా వాడుతున్నారని వెల్లడించారు.

పంట అమ్మకాలకు, సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమవుతుండటంతో, ఏది నిజమో, ఏది మోసమో తెలియని పరిస్థితుల్లో గ్రామీణులుంటున్నారు.ఓటీపీ, యూపీఐ పిన్, క్యూఆర్‌ కోడ్‌లపై వారికి సరైన అవగాహన ఉండటం లేదు. ‘బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం‘అని చెప్పగానే నమ్మే పరిస్థితి ఉంటోంది. పోలీసుల వరుస అవగాహన కార్యక్రమాలతో రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్‌ నేరాలు 10 శాతం తగ్గినా..మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. 
 
గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎక్కువగా నమోదవుతున్న మోసాలు: 
– కేవైసీ అప్‌డేట్‌ పేరిట 
– నకిలీ ప్రకటనలు 
– నకిలీ క్యూఆర్‌ కోడ్‌ 
– నకిలీ లోన్‌ యాప్‌లు 
– ఓటీపీ 
– పెట్టుబడులపై అధిక లాభాలు 
– నకిలీ ఉద్యోగాలు 
– ఫిషింగ్‌ (నకిలీ వెబ్‌సైట్లు, ఈ–మెయిల్స్‌ ద్వారా సమాచారం దోచుకోవడం) 
– విషింగ్‌ (నకిలీ ఫోన్‌ కాల్స్‌ ద్వారా మోసం) 
– డిజిటల్‌ అరెస్ట్‌  
– ఆన్‌లైన్‌ ఉద్యోగాలు  
– నకిలీ కస్టమర్‌ కేర్‌  
– వివాహ సంబంధాల పేరిట  
– బిజినెస్‌ ఈ–మెయిల్‌ కాంప్రమైజ్‌ (వ్యాపార ఈ–మెయిల్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి నకిలీ చెల్లింపులు చేయించడం)  

ఎలా మోసం చేస్తారు? 
– ప్రభుత్వ సంస్థల పేర్లు, లోగోలు ఉపయోగించి బాధితులను సంప్రదిస్తారు. 
– మీ ఆధార్, పాన్, బ్యాంక్‌ వివరాలు ఇప్పటికే వెరిఫై అయ్యాయని నమ్మిస్తారు. 
– లోన్‌ విడుదలకు ముందు ప్రాసెసింగ్‌ ఫీజు, ఫైల్‌ చార్జీలు, జీఎస్టీ, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్‌ పేరుతో రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించమంటారు. 
– నకిలీ అప్రూవల్‌ లెటర్లు, శాంక్షన్‌ ఆర్డర్లు పంపిస్తారు.  
– నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తారు. ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్‌ చేస్తారు.  
– డబ్బు పంపిన తర్వాత మరో కారణం చెబుతూ మళ్లీ చెల్లింపులు చేయిస్తారు. 
– చివరకు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి, వాట్సాప్‌ నంబర్, వెబ్‌సైట్‌ మాయం చేసేస్తారు.  

అత్యధికంగా మోసపోతున్న వర్గాలు: 
– రైతులు 
– మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు 
– వృద్ధులు  
– పాల ఉత్పత్తిదారులు 
– చిన్న వ్యాపారులు 
– గ్రామీణ యువత  

ఈ జాగ్రత్తలు మరవొద్దు.. 
– డబ్బు చెల్లించడానికే గానీ, పొందడానికి ఎప్పుడూ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయకూడదు. 
– బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్‌ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దు.  
– ముందస్తు చెల్లింపు కోరే లోన్‌ ఆఫర్లను నమ్మవద్దు. 
– అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లలో మాత్రమే వివరాలు పరిశీలించండి 
– వ్యక్తిగత లేదా యూపీఐ నంబర్లకు డబ్బు పంపవద్దు. 
– తెలియని లింకులు క్లిక్‌ చేయవద్దు. 
– ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ కూడా వాట్సాప్‌ ద్వారా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపమని అడగరు. 

ఇలా చేయాలి 
– సైబర్‌ నేరానికి గురైతే వెంటనే 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయండి. 
–  www.cybercrime.gov.in  పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. 
– బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి లావాదేవీని నిలిపివేయడానికి ప్రయతి్నంచండి. 
– చెల్లింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, చాట్‌లు, కాల్‌ వివరాలు భద్రపరచండి. 


––––––––––––––––––– 
మరింత అప్రమత్తతోనే సైబర్‌ భద్రత 
సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 10 శాతం నేరాలు తగ్గాయి. అయితే సైబర్‌ మోసగాళ్లు ఎప్పటికప్పడు ఏదో కొత్త పన్నాగంతో మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కొల్లగొట్టాలని చూస్తారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైబర్‌ మోసాలపై మరింత అవగాహన పెంచేందుకు గ్రామపంచాయతీల అధికారులు, స్వయం సహాయ సంఘాల మహిళలు, స్థానిక యువత ఇలా అన్ని వర్గాలకు ౖఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 
– శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సైబర్‌ సెక్యూరిటీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement